మీరు రాకున్నా మాకు పోయేదేం లేదు.. మేం లేకుంటే ఏసీసీయే లేదు.. పాక్‌కు కౌంటర్ ఇచ్చిన భారత మాజీ క్రికెటర్

First Published | Oct 20, 2022, 6:18 PM IST

BCCI vs PCB Asia Cup 2023 Row: ఆసియా కప్ - 2023 వివాదంపై   బీసీసీఐ-పీసీబీ మధ్య తలెత్తిన వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. అయితే ఆసియా కప్ ఆడనంత మాత్రానా భారత్ కు నష్టపోయేది ఏమీ లేదని.. కానీ ప్రపంచకప్ ఆడకపోతే పాకిస్తాన్ ను భారీ నష్టం తప్పదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంటున్నాడు. 
 

బీసీసీఐ-పీసీబీ మధ్య తలెత్తిన ఆసియా కప్ -2023 వివాదం ముదిరి పాకాన పడింది. 2023లో పాకిస్తాన్ వేదికగా ఈ టోర్నీని జరిపితే తాము ఆడబోమని బీసీసీఐ సెక్రటరీ జై షా  కరాకండీగా చెప్పేశాడు. దీనిపై  పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తో పాటు ఆ జట్టు మాజీలు కూడా  ఘాటుగా స్పందిస్తున్నారు.  

భారత జట్టు పాకిస్తాన్ కు రావాల్సిందేనని.. ఒకవేళ ఆసియా కప్ లో ఆడకుంటే తాము వచ్చే ఏడాది భారత్ లో జరగాల్సి ఉన్న వన్డే ప్రపంచకప్ కూ రామని హెచ్చరిస్తుండగా.. కమ్రాన్ అక్మల్ వంటి ఆటగాళ్లైతే  అప్పటిదాకా ఆగాల్సిన అవసరం లేదని.. ఈనెల 23న మెల్‌బోర్న్ లో భారత్ తో జరిగే మ్యాచ్ ను బాయ్‌కాట్ చేయాలని  సూచించాడు. 


ఇదిలాఉండగా తాజాగా  ఈ వివాదంపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా స్పందించాడు. ఆసియా కప్ లో ఆడకున్నా భారత్ కు వచ్చే నష్టమేమీ లేదని.. అలాగే పాకిస్తాన్ వన్డే ప్రపంచకప్ ఆడకున్నా తమకు  ఒక్క శాతం నష్టం లేదని  ఆ జట్టు మాజీ ఆటగాళ్లకు కౌంటర్ ఇచ్చాడు. అసలు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ను పోషిస్తున్నదే బీసీసీఐ అని చెప్పాడు. 

తన యూట్యూబ్ ఛానెల్ లో చోప్రా మాట్లాడుతూ... ‘ఏసీసీలో  బీసీసీఐ పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. భారత్ పాకిస్తాన్ కు వెళ్లొద్దని నిర్ణయించుకుంటే అదే పక్కా. నేను మీకు రాసిస్తాను.   ఆసియా కప్ -2023  తటస్థ వేదిక మీద జరుగుతుంది. పాకిస్తాన్ కూడా  వచ్చే ఏడాది ప్రపంచకప్ కు వచ్చి తీరుతుంది. 

చాలా మందికి తెలియని విషయమేమిటంటే..  ఏసీసీ అనేది ఒక కన్సార్షియం (కొన్ని సంస్థలను కలిపే ఒక ఏకీకృత వ్యవస్థ).  ఏసీసీ నుంచి సభ్య దేశాలైన ప్రతీ దేశం కొంత డబ్బును తీసుకుంటాయి. కానీ    ఏసీసీ నుంచి బీసీసీఐ ఒక్క పైసా కూడా తీసుకోదు.  తీసుకోకపోగా పై నుంచి  డబ్బులను పంచుతున్నది.  

అసలు ఆసియా కప్ అనేది భారత్ లేకుండా జరగనే జరగదు. ప్రపంచకప్ తో పోల్చితే ఆసియా కప్ అనేది చాలా చిన్నది.   ప్రపంచకప్ ను మిస్ చేసుకోవడమంటే అది తెలివితక్కువతనమే. అలా చేస్తే ఐసీసీ నుంచి వచ్చే భారీ ఆదాయాన్ని కోల్పోయినట్టే అవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ అంత సాహసానికి దిగుతుందా..  

అసలు ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.  ఆసియా కప్ కచ్చితంగా జరుగుతుంది. అయితే అది పాకిస్తాన్ లో మాత్రం కాదు. తటస్థ వేదిక మీద ఆసియా కప్ జరుగుతుంది..’ అని తెలిపాడు. 

Latest Videos

click me!