పాక్‌ని కమ్మేసిన హార్ధిక్ పాండ్యా... 2016 ఆసియా కప్‌లో దాయాది పరువు తీసేస్తూ...

First Published Aug 25, 2022, 4:54 PM IST

2022 ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కి ఇప్పటికే భారీ హైప్, క్రేజ్ వచ్చేశాయి. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత్, పాక్‌పై గెలిచి ఉంటే... ఈ మ్యాచ్‌ని టీమిండియా ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదేమో. అయితే రాకరాక దక్కిన ఆ విజయం తర్వాత పాక్‌ ఫ్యాన్స్, మాజీలు విర్రవీగిపోయారు. టీమిండియాని తక్కువ చేస్తూ చులకనగా మాట్లాడారు. అందుకే పాక్‌ను చిత్తుగా ఓడించి, ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ఎదురుచూస్తున్నారు భారత అభిమానులు...

ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన గత 6 మ్యాచుల్లో 5 విజయాలు అందుకుంది భారత జట్టు. అందులో 2016 ఆసియా కప్‌ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చాలా ప్రత్యేకం. టీ20 వరల్డ్ కప్ 2016కి ముందు జరిగిన ఆసియా కప్‌ని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు. పొట్టి ఫార్మాట్‌లో జరిగిన మొట్టమొదటి ఆసియా కప్ టోర్నీ ఇదే...

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 17.3 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్‌గా వచ్చిన మహ్మద్ హఫీజ్‌ని ఆశీష్ నెహ్రా 4 పరుగులకే అవుట్ చేశాడు. 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్, ఏ దశలోనూ కోలుకోలేదు. షార్జీల్ ఖాన్ 7, కుర్రామ్ మన్జూర్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

Hardik Pandya-MS Dhoni

షోయబ్ మాలిక్ 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేయగా ఉమర్ అక్మల్ 3, షాహీదీ ఆఫ్రిదీ 2 పరుగులు చేశారు. వహద్ రియాజ్ 14, మహ్మద్ సమీ 8, మహ్మద్ అమీర్ 1 పరుగు చేసి అవుట్ కాగా సర్ఫరాజ్ అహ్మద్ 24 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసి పాక్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

సర్ఫరాజ్ అహ్మద్, కుర్రామ్ మన్జూర్ మినహా మిగిలిన పాక్ బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు. భారత్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా 3.3 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఆశీష్ నెహ్రా 3 ఓవర్లలో 20 పరుగులిచ్చి ఓ వికెట్ తీయగా జస్ప్రిత్ బుమ్రా 3 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు...

యువరాజ్ సింగ్ ఓ వికెట్ తీయగా రవీంద్ర జడేజాకి రెండు వికెట్లు దక్కాయి. 84 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది.మహ్మద్ అమీర్ తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ, అజింకా రహానేలను డకౌట్ చేశారు. ఈ ఇద్దరూ కూడా ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యారు. 

Virat Kohli

సురేష్ రైనా 1 పరుగు చేసి అవుట్ కావడంతో 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. అయితే యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ కలిసి నాలుగో వికెట్‌కి 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 51 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు... విరాట్ ఆడిన అతి గొప్ప ఇన్నింగ్స్‌ల్లో ఇది కూడా ఒకటి.. 

బ్యాటింగ్‌లో హార్ధిక్ పాండ్యా డకౌట్ అయినా యువరాజ్ సింగ్ 14, ధోనీ 7 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు. ఈ పరాభవం నుంచి కోలుకోవడానికి పాకిస్తాన్‌కి చాలా సమయమే పట్టింది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో లక్కీగా దక్కిన విజయంతో విర్రవీగుతున్న పాక్‌కి ఇలాంటి ఆన్సర్‌తో దిమ్మతిరిగేలా చేయాలని కోరుకుంటున్నారు టీమిండియా ఫ్యాన్స్... 

click me!