ఆరోజు రాత్రంతా అర్ష్‌దీప్ నిద్రపోలేదు.. దాని గురించే ఆందోళన చెందుతూ..!

First Published Sep 14, 2022, 11:32 AM IST

Arshdeep Singh: ఇటీవలే ముగిసిన ఆసియా కప్ - 2022 లో భాగంగా సూపర్-4 దశలో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమికి   కారణాలలో ఒకడైన టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. ఆ  మ్యాచ్ లో కీలక క్యాచ్ జారవిడిచాడు. 

Arshdeep Singh

ఇటీవలి కాలంలో టీమిండియాలో అత్యంత చర్చనీయాంశమైన ఆటగాళ్లలో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఒకడు. ఆసియా కప్ లో భాగంగా  సూపర్-4 దశలో పాకిస్తాన్ తో పోరులో ఆ జట్టు బ్యాటర్  అసిఫ్ అలీ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను  జారవిడిచిన అర్ష్‌దీప్  పై నెటిజన్లు  ట్రోల్స్ తో ఆటాడుకున్నారు. 

ఇదే మ్యాచ్ లో  చివరి ఓవర్లో పాకిస్తాన్ 7 పరుగులు చేయాల్సి ఉండగా.. అద్భుతంగా బౌలింగ్ చేసినా మ్యాచ్ ను గెలిపించలేకపోయాడు.  శ్రీలంకతో మ్యాచ్ లో  కూడా ఫైనల్ ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి  లంకను ఓడినంతం పనిచేశాడు. కానీ పాకిస్తాన్ తో మ్యాచ్ లో అతడు అలీ క్యాచ్ ను జారవిడవడంతో తీవ్ర విమర్శల పాలయ్యాడు. 
 

అయితే ఈ క్యాచ్ జారవిడవడంతో పాటు పాకిస్తాన్ తో ఓటమి  చెందిన రోజు  రాత్రి  అర్ష్‌దీప్ నిద్రపోలేదట. ఈ విషయాన్ని స్వయంగా అతడి కోచ్ జస్వంత్ రాయ్ వెల్లడించాడు.  

తాజాగా  జస్వంత్ ఓ జాతీయ పత్రికతో మాట్లాడుతూ.. ‘మిగతా ప్లేయర్ల మాదిరిగానే అర్ష్‌దీప్  కూడా కాస్త టెన్షన్ పడ్డాడు. ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదని అర్ష్‌దీప్  మాతో చెప్పాడు. 

నిద్రపోనిది తనపై ట్రోల్స్ వచ్చినందుకు కాదు.. చివరి ఓవర్లో తాను యార్కర్లు  వేయాలని ప్రయత్నించినా అందుకు సఫలం కాలేదని  బాధపడ్డాడు.  అయితే బాధపడాల్సిందేమీ లేదని నేను అతడికి చెప్పా.  అర్ష్‌దీప్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. టీ20 ప్రపంచకప్ లో ఆడటం ఏ క్రికెటర్ కైనా గొప్ప అవకాశం. ఆస్ట్రేలియాలో అర్ష్‌దీప్  తప్పకుండా రాణిస్తాడు..’ అని  అన్నాడు. 

ఆసియా కప్ లో అర్ష్‌దీప్.. పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ లో రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే  డెత్ ఓవర్లలో మాత్రం  పొదుపుగా బౌలింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా అతడు.. టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. 

click me!