దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ ఉన్నా అత్యధిక వికెట్లు తీసింది మన కుంబ్లేనే.. బీజీటీలో వికెట్ల వీరులు వీళ్లే

First Published Feb 6, 2023, 5:16 PM IST

Border Gavaskar Trophy 2023: ప్రతిష్టాత్మక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  ఈనెల 9 నుంచి భారత్ - ఆస్ట్రేలియా మధ్య    నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టు  మొదలుకానున్నది. ఈ నేపథ్యంలో  ఈ ట్రోఫీలో అత్యధిక వికెట్ల వీరులెవరో చూద్దాం. 

భారత్ - ఆస్ట్రేలియాల మధ్య  పరిమిత ఓవర్ల  క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో అంతకు డబుల్  టెస్టు క్రికెట్ కు ఉంది.  ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరీస్ కు ఏ మాత్రం తీసిపోని  ఈ ట్రోఫీలో   బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టడంలో బౌలర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.    నాగ్‌పూర్ టెస్టుకు  ముందు ఈ ట్రోఫీలో అత్యధిక వికెట్ల వీరులెవరో చూద్దాం. 

1996 నుంచి  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.   దాదాపుగా అదే టైమ్ నుంచి  ఆస్ట్రేలియా క్రికెట్ లో   దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ తో పాటు  గ్లెన్ మెక్‌గ్రాత్ ఆసీస్ టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరూ  భారత పర్యటనతో పాటు  స్వదేశంలో కూడా రాణించినవారే.  భారత బ్యాటర్లను ఇబ్బందులు పెట్టినవారే. అయితే ఎంతమంది దిగ్గజ బౌలర్లు వచ్చినా ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసింది మాత్రం మన అనిల్ కుంబ్లేనే.  ఆ రికార్డు  జంబో పేరు మీదే ఉంది. 

బీజీటీలో భాగంగా అనిల్ కుంబ్లే మొత్తంగా    ఆస్ట్రేలియాతో 20 టెస్టులు ఆడాడు. ఈ  20 మ్యాచ్ లలో  ఏకంగా 111 వికెట్లు పడగొట్టాడు.  అత్యుత్తమ ప్రదర్శన  8-141.  బీజీటీలో  కుంబ్లే.. ఏకంగా పదిసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.  స్వదేశంలో ఆసీస్ ను భారత్ నిలువరించడంలో కుంబ్లేది కీలక పాత్ర. 

జంబో తర్వాత  రెండో స్థానంలో ఉన్నాడు టర్బోనేటర్ హర్భజన్ సింగ్. భజ్జీ.. 18 మ్యాచ్ లలో  95 వికెట్లు పడగొట్టాడు.  2001లో  ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టెస్టులో  లక్ష్మణ్ - ద్రావిడ్ రికార్డు పార్ట్నర్ షిప్ తో పాట భజ్జీ బౌలింగ్ వల్లే టీమిండియా  మ్యాచ్ ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో భజ్జీ హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. భజ్జీ మొత్తంగా  ఏడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. అత్యుత్తమ ప్రదర్శన 8-84గా ఉంది. 

ఈ జాబితాలో   ఆసీస్ వెటరన్ స్పిన్నర్  నాథన్ లియాన్  మూడో స్థానంలో నిలిచాడు. లియాన్.. 22 మ్యాచ్ లలో 94 వికెట్లు కూల్చాడు.  మరో వికెట్ తీస్తే  అతడు భజ్జీ రికార్డును సమం చేస్తాడు.   భజ్జీ మాదిరిగానే లియాన్ కూడా ఏడు  సార్లు  ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఉత్తమ ప్రదర్శన 8-50 గా ఉంది. 

తాజాగా ఈనెల 9 నుంచి జరుగబోయే  బీజీటీలో ఆసీస్ ఎందుకు భయపడుతుందనే దానికి ప్రధాన కారణం అశ్విన్. ఈ భారత  స్టార్ స్పిన్నర్ గణాంకాలే అందుకు సాక్ష్యం. ఆసీస్ పై అశ్విన్.. 18 టెస్టులలోనే 89 వికెట్లను పడగొట్టాడు.    అశ్విన్ వేసే క్యారమ్ బాల్ ను ఎదుర్కోవడానికి ఆసీస్ నానా తంటాలు పడుతోంది. ఈ సిరీస్ లో కూడా అశ్వినే భారత తురుపు ముక్క.  ఈ సిరీస్ లో అశ్విన్.. లియాన్, భజ్జీ రికార్డులను అధిగమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

అశ్విన్ తర్వాత  రవీంద్ర జడేజా కూడా  ఆసీస్ కు సింహస్వప్నమే.  జడేజా  ఆసీస్ తో 12 టెస్టులలో  63 వికెట్లు పడగొట్టాడు. మూడుసార్లు అతడు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదుచేశాడు.  అత్యుత్తమ ప్రదర్శన  6-63గా నమోదైంది.   తాజా సిరీస్ లో అశ్విన్ తో పాటు జడేజాను ఎదుర్కోవడం ఆసీస్ కు సవాలే.  

ఆసీస్ దిగ్గజ  బౌలర్లైన షేన్ వార్న్.. భారత్ తో  12 టెస్టులు ఆడి   42 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.   బ్రెట్ లీ కూడా 12 టెస్టులలో  53 వికెట్లు తీశాడు.  గ్లెన్ మెక్‌గ్రాత్.. 11 టెస్టులలో  51 వికెట్లు తీశాడు. 

click me!