ఐపీఎల్ ఫ్రాంచైజీలే కాదు.. రేసులో బడా కార్పొరేట్లు.. వుమెన్స్ ఐపీఎల్‌లో టీమ్‌ను దక్కించుకోవడానికి టెండర్లు..!

First Published Jan 21, 2023, 5:46 PM IST

WIPL:  ఈ ఏడాది ప్రారంభం కాబోయే  ఉమెన్స్ ఐపీఎల్ లో టీమ్ ను దక్కించుకోవడానికి ఇప్పటికే పురుషుల  ఐపీఎల్ లో ఉన్న సుమారు 8 టీమ్ లు  యత్నిస్తున్నాయని   వార్తలు వస్తుండగా ఇప్పుడు  బడా కార్పొరేట్లు కూడా  రేసులోకి వచ్చారు. 

భారత క్రికెట్ నియంత్రణ మండలి  (బీసీసీఐ)  ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న మహిళల ఐపీఎల్ లో ఇటీవలే మీడియా హక్కుల ద్వారా  భారీగా ఆర్జించిన  బోర్డు.. తాజాగా  ఫ్రాంచైజీల కేటాయింపులో కూడా  పురుషుల ఐపీఎల్ కు  ఏ మాత్రం తగ్గకుండా సంపాదించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. 

మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను వయాకామ్ 18 (రిలయన్స్)  సంస్థ  రూ. 951 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా బీసీసీఐ త్వరలోనే ఈ లీగ్ లో ఫ్రాంచైజీల కోసం  వేలం నిర్వహించనుంది.  ఇదివరకే టెండర్లు దాఖలైన ఈ ప్రక్రియలో   వచ్చే వారం లేదా పది రోజుల్లో టీమ్ ల వివరాలు, వేలం తేదీలు   ప్రకటించే అవకాశముంది. 

ఇదిలాఉండగా.. ఉమెన్స్ ఐపీఎల్ లో  ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు గాను ఇప్పటికే మెన్స్ ఐపీఎల్ లో తిష్ట వేసి కూర్చున్న ఉద్దండులు  వీటిపైనా  ఆసక్తి చూపుతుండగా  తాజాగా  వస్తున్న సమాచారం ప్రకారం  ఐపీఎల్ ఫ్రాంచైజీలతో పాటు మరో 30 బడా కంపెనీలు కూడా   టెండర్లు కొనుగోలు చేసి టీమ్ ను కొనేందుకు సిద్ధమయ్యాయట.  

క్రిక్ బజ్ లో వచ్చిన నివేదిక ప్రకారం.. ప్రముఖ ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్  కంజ్యూమర్ గూడ్స్)  సంస్థ  హల్దిరామ్ గ్రూప్,  ఏపీఎల్ అపోలో, శ్రీరామ్ గ్రూప్, నీలగిరి గ్రూప్, ఏడబ్ల్యూ కట్కూరి గ్రూప్ లు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్  లు పోటీలో ఉన్నాయి. 

ఇక ఇండియా సిమెంట్స్ (చెన్నై సూపర్ కింగ్స్)  స్ఫూర్తితో తమిళనాడుకు చెందిన చెట్టినాడు సిమెంట్స్, జేకే సిమెంట్స్ లు కూడా  ఉమెన్స్ ఐపీఎల్ టెండర్లు కొనుగోలు చేశాయట.   ఈ క్రమంలోనే మరికొంతమంది బడా కార్పొరేట్లు కూడా   ఉమెన్స్ ఐపీఎల్ టీమ్ ల మీద ఆసక్తిగా ఉన్నారు. 

ఇవేగాక  ఇంటర్నేషనల్ లీగ్  టీ20లో  పెట్టుబడులు పెట్టిన  క్యాప్రీ గ్లోబల్ (షార్జా వారియర్స్), అదానీ గ్రూప్ (గల్ఫ్ జెయింట్స్)లతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్లు అయిన జీఎంఆర్, జేఎస్‌డబ్ల్యూ లు విడివిడిగా  టెండర్లను దాఖలు చేసినట్టు బీసీసీఐ వర్గాల సమాచారం.  

click me!