మోకాలి గాయం నుంచి కోలుకున్న సంజూ శాంసన్.. నేను రెడీ అంటూ..

First Published Jan 28, 2023, 3:55 PM IST

Sanju Samson: కేరళ బ్యాటర్ సంజూ శాంసన్  కు గాయం కావడంతో  లంకతో టీ20 సిరీస్ తో పాటు న్యూజిలాండ్ తో జరుగుతున్న  సిరీస్ లో జితేశ్ శర్మను   బ్యాకప్ వికెట్ కీపర్ గా ఎంపిక చేశారు సెలక్టర్లు. 

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్  సంజూ శాంసన్  ఈనెలలో  శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో  భాగంగా తొలి మ్యాచ్ లో గాయపడ్డాడు. వాంఖెడే వేదికగా లంకతో  జరిగిన తొలి టీ20లో  ఫీల్డింగ్ చేస్తూ అతడికి  మోకాలికి గాయమైంది.  గాయం  నేపథ్యంలో  బీసీసీఐ అతడిని ఇన్నాళ్లు  నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కు పంపించింది.  

గత కొద్దిరోజులుగా ఎన్సీఏలోనే గడుపుతున్న శాంసన్ తాజాగా  గాయం నుంచి కోలుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో  పోస్టు పెట్టి  వెల్లడించాడు.  ‘ఆల్ సెట్.. రెడీ టు గో’అని పోస్టు పెట్టి తాను కూడా  ఫిట్ గానే ఉన్నానని పరోక్షంగా  సెలక్టర్లకు  చెప్పాడు. 

అయితే  శాంసన్  కు గాయం కావడంతో  లంకతో టీ20 సిరీస్ తో పాటు న్యూజిలాండ్ తో జరుగుతున్న  సిరీస్ లో జితేశ్ శర్మను   బ్యాకప్ వికెట్ కీపర్ గా ఎంపిక చేశారు సెలక్టర్లు.  ఇషాన్ కు వరుసగా అవకాశాలిస్తున్న టీమిండియా మేనేజ్మెంట్.. జితేశ్ ను ఇంకా   ఆడించలేదు.  

ఇక  రంజీ ట్రోఫీ నుంచి  కూడా కేరళ  నిష్క్రమించడంతో  సంజూ శాంసన్  కు మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కితే తప్ప ఐపీఎల్ వరకూ ఖాళీనే.  ఈ గ్యాప్ లో భారత్.. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ముగిశాక ఆస్ట్రేలియాతో  నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ తో పాటు మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనుంది. 

టెస్టు సిరీస్ లో భాగంగా ఇదివరకే రెండు టెస్టులకు జట్టును ఎంపిక చేయగా  అందులో శాంసన్ పేరు లేదు.  మిగిలిన రెండు టెస్టులకూ   శాంసన్ ను ఎంపికవుతాడనుకోవడం అత్యాశే.  కనీసం వన్డే  సిరీస్ వరకైనా  సెలక్టర్లు  శాంసన్ ను  కరుణిస్తారో లేదో వేచి చూడాలి.  జట్టులో చోటు దక్కించుకున్నా అతడు ఆడతాడా..? లేదా..? అన్నదీ అనుమానమే. 

భారత జట్టు బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి ముందు కివీస్ తో మరో రెండు టీ20లు ఆడాల్సి ఉంది.  రాంచీ  వేదికగా జరిగిన  మ్యాచ్ లో  భారత్ దారుణంగా ఓడగా  జనవరి 29న రెండో మ్యాచ్, ఫిబ్రవరి 1న మూడో మ్యాచ్ జరుగుతుంది. 

click me!