కోహ్లీతో బాబర్ పోలిక..! పాకిస్తాన్ మాజీ సారథి రియాక్షన్ ఇదే..

First Published Jan 28, 2023, 3:20 PM IST

భారత్ లో విరాట్ కోహ్లీ అంత కాకపోయినా పాకిస్తాన్ లో బాబర్ ఆజమ్ కు కూడా  ఆ స్థాయి ఫాలోయింగ్ ఉంది.  ఇద్దరూ తమ దేశాలలో కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య క్రికెటర్లే... 

సచిన్ టెండూల్కర్ తర్వాత అతడి వారసుడిగా దశాబ్దానికంటే  ఎక్కువకాలంగా  భారత క్రికెట్  బ్యాటింగ్ కు సేవలందిస్తున్న  పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ..  మాస్టర్ బ్లాస్టర్ రికార్డుల మీద కన్నేశాడు.   మరోవైపు  కోహ్లీ అంత స్థాయిలో కాకపోయినా  పాకిస్తాన్ సారథి  బాబర్ ఆజమ్ కూడా అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతున్నాడు.  

ఈ ఇద్దరినీ పోల్చుతూ చాలాకాలంగా ఇరు దేశాలకు చెందిన పలువురు క్రికెట్ విశ్లేషకులు విశ్లేషణలు చేస్తూనే ఉన్నారు. అయితే  తాజాగా ఇదే విషయమై  పాకిస్తాన్ మాజీ సారథి   సల్మాన్ భట్ తనదైన శైలిలో స్పందించాడు. కోహ్లీతో బాబర్ ను పోల్చడం  సరికాదని వ్యాఖ్యానించాడు. 

పాకిస్తాన్ కు చెందిన పాక్ టీవీ. టీవీతో  ముచ్చటిస్తూ భట్.. ‘ఇద్దరూ (కోహ్లీ-బాబర్)  వరల్డ్ క్లాస్ క్రికెటర్లు.   నిలకడగా ప్రదర్శనలిస్తూ  వారి జట్లకు సేవలందిస్తున్నారు.   కానీ ఇద్దరినీ పోల్చడం సరికాదు.   ఎందుకంటే కోహ్లీ ఇప్పటికే  తన కెరీర్ లో  74  సెంచరీలు చేశాడు.  మూడేండ్లుగా సెంచరీ చేయని   కోహ్లీ.. ఇప్పుడు మళ్లీ చెలరేగుతున్నాడు. 

ప్రతి  క్రికెటర్ కు  ఓ బ్యాడ్ ఫేజ్ ఉంటుంది. కోహ్లీ దానిని దాటేశాడు.   బాబర్  సారథిగా  జట్టును ఎలా నడిపిస్తున్నాడన్నది పక్కనబెడితే  వ్యక్తిగతంగా  అతడు నిలకడైన ప్రదర్శనలు ఇస్తున్నాడు. కొద్దికాలంగా  అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు.  మేం అతడు మరింత కాలం  పాకిస్తాన్ క్రికెట్ కు సేవలందించాలని కోరుకుంటున్నాం.  

పాకిస్తాన్ లో చాలా మంది క్రికెటర్లు  ఎగ్జైటింగ్  క్రికెట్ ఆడతారు. కానీ వాళ్లు నిలకడగా ఆడలేదు.  బాబర్ అలా కాదు.  చాలా కాలం తర్వాత మాకు బాబర్ రూపంలో ఒక మంచి బ్యాటర్ దొరికాడు. మేం అతడిని కాపాడుకోవాలి. అతడి ఆటను ఆస్వాదించాలి.  బాబర్ ను ఒత్తిడికి గురి చేయనియ్యద్దు...’అని చెప్పాడు. 

ఇదిలాఉండగా  ప్రస్తుతానికి  బాబర్.. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత ఖాళీగా ఉన్నాడు. త్వరలోనే మొదలుకాబోయే పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో  ఆడేందుకు అతడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు కోహ్లీ.. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ముగిశాక..  ప్రస్తుతం వచ్చే నెల ఆస్ట్రేలియాతో జరగాల్సి ఉన్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమవుతున్నాడు. 

click me!