రాసిపెట్టుకోండి.. ఐపీఎల్ వేలంలో అతడు హాట్ కేకు.. ఆసీస్ ఓపెనర్ పై గావస్కర్ కామెంట్స్.. బాధేసిందన్న వార్నర్

First Published Nov 16, 2021, 3:43 PM IST

IPL Auction: త్వరలో జరుగనున్న ఐపీఎల్ మెగా వేలంలో  సన్ రైజర్స్ హైదరాబాద్  సారథ్యం  నుంచి తప్పించిన ఆస్ట్రేలియా ఓపెనర్ హాట్ కేకులా అమ్ముడుపోతాడని  సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే తనను జట్టునుంచి  తప్పించడం  బాదేసిందని వార్నర్ వాపోయాడు.

త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్-2022 మెగా వేలంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను  దక్కించుకోవడానికి అన్ని జట్లు ఎగబడతాయని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. వేలంలో ఫ్రాంచైజీలు కచ్చితంగా కొనుగోలు చేసే ఆటగాళ్లలో వార్నర్ ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్-14 సీజన్ లో విఫలమయ్యాడని ఆరోపిస్తూ డేవిడ్ వార్నర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం పక్కనబెట్టిన విషయం తెలిసిందే. ఐపీఎల్-14 తొలిదశలో అతడిని జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన యాజమాన్యం.. ఆ తర్వాత  రెండో దశలో ఏకంగా అతడిని జట్టులోంచి కూడా పక్కనబెట్టడం తెలిసిందే. అయితే ఐపీఎల్ అనంతరం జరిగిన టీ20 ప్రపంచకప్ లో ఆడిన వార్నర్.. ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా సాధించాడు. 

ఈ నేపథ్యంలో గావస్కర్  స్పందిస్తూ.. ‘వేలంలో కచ్చితంగా ఫ్రాంచైజీలు  కోరుకునే ఆటగాళ్లలో  డేవిడ్ వార్నర్ ఉంటాడు. ఈసారి ఐపీఎల్  వేలంలో  పాత 8 జట్లతో పాటు రెండు కొత్త ఫ్రాంచైజీలు కూడా రాబోతున్నాయి. ఆటగాడిగానే గాక నాయకుడిగా ఎంతో అనుభవమున్న వార్నర్ ను దక్కించుకోవడానికి  ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తాయి. 

వార్నర్ ఈ ఫార్మాట్ (టీ20) కు సరిగ్గా సరిపోతాడు. కొత్త జట్లతో పాటు పాత ఫ్రాంచైజీలు కూడా వార్నర్ కోసం ఎగబడే అవకాశముంది. ఎందుకంటే సన్ రైజర్స్ అతడిని రిటైన్ చేసుకునే అవకాశలైతే కనిపించడం లేదు.గత ఐపీఎల్ సందర్భంగా అనామక ప్లేయర్లను సైతం జట్టుతో గ్రౌండ్ కు తీసుకువచ్చి వార్నర్ ను  హోటల్ రూమ్స్ కే పరిమితం చేయడమన్నది సమంజసం కాదు. ఫామ్ కారణమని చూపెడుతున్నా.. అంతకుమించి ఇతర  కారణాలేవో దాని వెనుక ఉండొచ్చు. 

కానీ వార్నర్ ఇవన్నీ పట్టించుకోలేదు. తనపై నమ్మకం ఉంచాడు. సానుకూల దృక్పథంతో టీ20 ప్రపంచకప్ లో ఆడాడు. గతాన్ని మర్చిపోయి భవిష్యత్ మీదే దృష్టి పెట్టాడు. అందుకే టీ20  వరల్డ్ కప్ టోర్నీలో రాణించాడు..’ అని  గావస్కర్ అభిప్రాయపడ్డాడు.

కాగా..  తనను ఏ కారణం లేకుండా  సారథ్య బాధ్యతల నుంచి తప్పించడం వంటివి చాలా బాధించాయని వార్నర్ అన్నాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన ఓ జాతీయ ఛానెల్ తో అతడు మాట్లాడాడు. 

వార్నర్ మాట్లాడుతూ.. ‘కొన్నేళ్ల పాటు ఎంతో అమితంగా ఇష్టపడిన ఉన్న జట్టు నుంచి హఠాత్తుగా తొలగించడం నన్ను చాలా బాధించింది. అయితే ఈ విషయంపై నేను  ఎవ్వరి మీదా ఎలాంటి ఫిర్యాదులూ చేయాలనుకోవడం లేదు. 

హైదరాబాద్ తో పాటు  ఇండియాలో నాకు చాలా మంది అభిమానులున్నారు. నేను ఫామ్ లో ఉన్నా లేకున్నా వాళ్లు నాకు అండగా నిలిచారు. వాళ్ల కోసమే నేను క్రికెట్ ఆడుతున్నా. ఫ్యాన్స్ ను అలరించడానికి నేను ఉన్నాను. 

నన్ను తొలగించడానికి కారణం ఏదైనా కావచ్చు గానీ నేనైతే సన్ రైజర్స్ కోసం  చాలా కష్టపడ్డా.   క్రమం తప్పకుండా  ప్రాక్టీస్ చేవా. అయితే ఆఖరు సీజన్ లో పరుగులు చేయలేకపోయా. అలాంటప్పుడు నన్ను  సారథ్య బాధ్యతల తో పాటు జట్టులోంచి కూడా తీసేయడం  చాలా బాధ కలిగించింది. అయితే నాకింకా ఐపీఎల్ లో ఆడేందుకు అవకాశముందనే నమ్ముతున్నా..’ అని చెప్పుకొచ్చాడు.   

click me!