సన్ రైజర్స్ హైదరాబాద్ సారథిగా అతడికే ఛాన్స్..! సఫారీ బ్యాటర్ మీద కన్నేసిన ఎస్ఆర్‌‌హెచ్

First Published Nov 22, 2022, 3:09 PM IST

IPL 2023: ఐపీఎల్ లో ఇటీవలే పూర్తయిన రిటెన్షన్ ప్రక్రియ తర్వాత దాదాపు అన్ని జట్లకూ  సారథులు మిగిలేఉన్నారు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ ది మాత్రం వింత పరిస్థితి. గత రెండు సీజన్లలో సారథిగా ఉన్న కేన్ విలియమ్సన్ ను హైదరాబాద్ వదిలించుకుంది. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రస్తుతం ఉన్న తొమ్మిది జట్లు  ఇటీవలే ముగిసిన రిటెన్షన్ ప్రక్రియలో వారి సారథుల జోలికి పోలేదు.  పంజాబ్ కింగ్స్  రిటెన్షన్ కు ముందే సారథిని మార్చింది.   కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం గత సీజన్ లో రూ. 14 కోట్లు పెట్టి  దక్కించుకున్నకేన్ మామ ను ఈసారి వదిలించుకుంది. కెప్టెన్ గా విఫలమైన  అతడు ఆటగాడిగా కూడా అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. 
 

రిటెన్షన్ ప్రక్రియ  ముగిసిన తర్వాత సారథి లేని  జట్టుగా ఉన్న సన్ రైజర్స్.. కొత్త  కెప్టెన్ ఎవరా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ లో మరే జట్టుకూ లేని విధంగా పర్స్ లో ఏకంగా  రూ. 42.5 కోట్లు ఉన్న ఎస్ఆర్హెచ్  ఈసారి ఇంగ్లాండ్ టెస్టు సారథి బెన్ స్టోక్స్ ను వేలంలో దక్కించుకుని  అతడినే సారథిగా నియమించాలని చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 

స్టోక్స్ కంటే ముందే  భువనేశ్వర్, అభిషేక్ శర్మల పేర్లు కూడా వినిపించాయి. భువీకి ఉన్న అనుభవం దృష్ట్యా అతడు జట్టును నడిపించగలడన్న వాదనలూ వినిపించాయి.  కానీ తాజాగా భువీ, స్టోక్స్ కాకుండా మరో పేరు  వినిపిస్తున్నది. సౌతాఫ్రికా బ్యాటర్ ఏయిడెన్ మార్క్రమ్  ను సన్ రైజర్స్ సారథిగా నియమించనున్నట్టు సమాచారం.  

ఇదే విషయమై  ఎస్ఆర్హెచ్  ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘జట్టు కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోవడానికి మాకు ఇంకా సమయముంది. ఫ్యాన్స్ కూడా  దీని గురించి  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు.  కానీ కెప్టెన్సీ అనేది పెద్ద బాధ్యత. ప్రస్తుతానికైతే మా దృష్టిలో  మార్క్రమ్ ఉన్నాడు.   

మార్క్రమ్ కు అంతర్జాతీయ స్థాయిలో సారథ్యం వహించిన అనుభవం లేనప్పటికీ   అతడికి జట్టును నడిపించగల సత్తా ఉంది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగలిగే అతడు  రెండు విభాగాలను సమర్థవంతంగా నడిపించగలడు. 

 దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్ (ఎస్ఎ 20) లో కూడా  మా సారథిగా అతడే ఉన్నాడు. అయితే ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ కు  అతుడిని సారథిగా నియమించాలా..? లేదా..? అనేదానిపై  మా కోచింగ్ సిబ్బందితో చర్చించాక  చెబుతాం..’ అని తెలిపాడు. 

దక్షిణాఫ్రికా లో వచ్చే జనవరి నుంచి మొదలుకాబోయే ఎస్ఎ 20 లీగ్ లో  సన్ రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సన్ రైజర్స్..  మార్క్రమ్ కు  సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది.  ఐపీఎల్ కంటే ముందే జరిగే ఈ టోర్నీలో  మార్క్రమ్ గనక మెరిస్తే అతడిని ఐపీఎల్ లో కూడా సారథిగా కొనసాగించే అవకాశాలు మెండుగా ఉంటాయి. 

click me!