ఆరోజు నాకింకా గుర్తుంది.. ఆ మ్యాచ్‌లో సూర్య నన్ను చంపేశాడనే అనుకున్నా : మోయిన్ అలీ షాకింగ్ కామెంట్స్

First Published Nov 9, 2022, 11:52 AM IST

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ (టీ20లకు), ఆల్ రౌండర్ మోయిన్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సూర్య తనను చావగొట్టాడని, అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. 
 

గురువారం ఇండియాతో రెండో సెమీస్ ఆడనున్న ఇంగ్లాండ్ ఆ మేరకు భారత్ ను నిలువరించడానికి వ్యూహరచన చేస్తున్నది. ముఖ్యంగా ఈ టోర్నీలో భారత విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్న  విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ లపై ఇంగ్లాండ్ దృష్టి సారించింది. ఈ ఇద్దరినీ ఔట్ చేస్తే టీమిండియాను నిలువరించడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయంలో  ఉన్న ఇంగ్లాండ్ ఆ మేరకు వ్యూహాలు రచిస్తున్నది. 

ఇదే క్రమంలో ఈ ఫార్మాట్ లో ఇంగ్లాండ్ కు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న  మోయిన్ అలీ సూర్యకుమార్ యాదవ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొద్దిరోజుల క్రితం భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు మూడో టీ20 లో సూర్య తనను చావబాదాడని, ఆ విధ్వంసం తనకు ఇంకా గుర్తుందని తెలిపాడు. 

ఈ ఏడాది జులైలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఎడ్జబాస్టన్ టెస్టు ముగిశాక భారత జట్టు ఇంగ్లాండ్ తో మూడు టీ20 లు ఆడింది.  రెండు టీ20లలో భారత్ దే విజయం. సిరీస్ కూడా కైవసం చేసుకుంది. కానీ మూడో మ్యాచ్ లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో  7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.  

తర్వాత లక్ష్య ఛేదనలో భారత్.. 31 పరుగులకే రోహిత్, రిషభ్, కోహ్లీ వికెట్లు కోల్పోయింది. కానీ సూర్య మాత్రం..  వీరవిహారం చేశాడు. 55 బంతుల్లోనే 14 ఫోర్లు,  6 సిక్సర్ల సాయంతో  117 పరుగులు చేశాడు. సూర్య పోరాటంతో ఆ మ్యాచ్ లో భారత్.. విజయానికి దగ్గరగా వచ్చింది.  20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.  సూర్య మరో ఓవర్ ఉండి ఉంటే మ్యాచ్ భారత్ గెలిచేదే. 

ఇక ఇండియా-ఇంగ్లాండ్ సెమీస్ కు ముందు అలీ ఈ మ్యాచ్ ను తలుచుకున్నాడు. అలీ మాట్లాడుతూ.. ‘సూర్య ఆ మ్యాచ్ లో   నన్ను మర్డర్ చేసినంత పని చేశాడు. మా బౌలర్లందరిపై ఆధిపత్యం చెలాయించాడు. నా అదృష్టం బాగుంది నేను రెండు ఓవర్లే వేశాను. అప్పటికే అలసిపోయిన సూర్య..    లక్కీగా నా బౌలింగ్ లోనే ఔట్ అయ్యాడు. ఆ మ్యాచ్ లో భారత్ ను గెలిపించినంత పని చేశాడు. 

ఆ మ్యాచ్ లో సూర్య ఆట అద్భుతం.  కొన్ని షాట్లైతే   వేరే లెవల్. అటువంటి షాట్లు నేను ఇంతవరకూ చూడలేదు. సూర్య టీ20 క్రికెట్ ను  వేరే లెవల్ కు తీసుకెళ్లాడు. అతడి వల్ల బౌలర్లు బంతులు ఎక్కడ వేయాలి..? అని తలలు పట్టుకుంటున్నారు.  సూర్యకు బౌలింగ్ చేయడం చాలా కష్టం..’ అని తెలిపాడు. 

click me!