సఫారీలతో సవాల్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ దూరం

First Published Nov 2, 2022, 1:23 PM IST

T20 World Cup 2022: టీ29 ప్రపంచకప్ లో సెమీస్ అవకాశాలు మిణుకుమిణుకుమంటున్న తరుణంలో  పాకిస్తాన్ కు ఊహించని షాక్ తాకింది. గాయంతో ఆ జట్టు స్టార్ బ్యాటర్ సౌతాఫ్రికాతో మ్యాచ్ కు దూరమయ్యాడు. 
 

మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఉన్నది ప్రపంచకప్ లో పాకిస్తాన్ పరిస్థితి. భారత్, జింబాబ్వేతో  మ్యాచ్ లు ఓడి నెదర్లాండ్స్ తో గెలిచినా.. దక్షిణాఫ్రికాను భారత్ ఓడించకపోవడంతో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.అయితే ఇప్పటికీ ఆ జట్టు సెమీస్ ఆశలను చంపుకోలేదు. తర్వాత రెండు మ్యాచ్ ల విజయాలతో పాటు ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలు ఆ జట్టు సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుతాయి. 

ఈ క్రమంలో పాకిస్తాన్.. నవంబర్ 3న సిడ్నీలో సౌతాఫ్రికాతో కీలక మ్యాచ్ ఆడనుంది. నెదర్లాండ్స్ తో గెలిచి ఈ మ్యాచ్ కు సిద్ధమవుతున్న పాకిస్తాన్ కు  భారీ షాక్ తాకింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఫకర్ జమాన్  గాయంతో  ఈ మ్యాచ్ లో అందుబాటులో ఉండటం లేదు.

ఈ విషయాన్ని  స్వయంగా పాకిస్తాన్  టీమ్ మేనేజ్మెంట్ తో పాటు పీసీబీ కూడా  వెల్లడించింది. పీసీబీ మెడికల్ చీఫ్, పాకిస్తాన్ టీమ్ డైరెక్టర్ నజీబ్ స్పందిస్తూ..  ‘ఆసియా కప్ కు ముందు ఫకర్ కు గాయమైంది. ఏడువారాల విరామం తర్వాత అతడు తిరిగి జట్టులోకి వచ్చాడు. నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో ఆడాడు.   

కానీ మోకాలి నొప్పి మళ్లీ తిరగబెట్టింది.  అతడు 100 శాతం ఫిట్ గా లేడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉండడు.  ప్రస్తుతం అతడిని స్కాన్, ఇతర  వైద్య పరీక్షల కోసం పరీక్షిస్తున్నాం.  బంగ్లాదేశ్ తో మ్యాచ్ కల్లా అతడు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం..’ అని తెలిపాడు. 

వరుస గాయాలతో పాకిస్తాన్ ఈ  మెగా టోర్నీలో సతమతమవడం ఇదే ప్రథమం కాదు.  ఆసియా కప్ కు ముందు గాయమై ఆ టోర్నీ నుంచి తప్పుకున్న షాహీన్ షా అఫ్రిదిని ప్రపంచకప్ జట్టులోకి తీసుకున్నా అతడి ఫిట్నెస్ పై అనుమానాలున్నాయి. అతడు గతంలో మాదిరిగా రాణించలేకపోవడంతో   పాక్ మాజీలు ఇదే విషయాన్ని ఎండగడుతున్నారు. షాన్ మసూద్, మహ్మద్ వసీం జూనియర్ కూడా గాయాల బాధితులే. 

ఇక ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్.. నవంబర్ 3న దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడుతుంది. ఆ మ్యాచ్ లో గనక ఓడితే పాకిస్తాన్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. ఆ  తర్వాత నవంబర్ 6న బంగ్లాదేశ్ తో చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. 

click me!