2011 వన్డే వరల్డ్ కప్‌లో గౌతమ్ గంభీర్ 97 పరుగులు చేసి టీమిండయా విజయంలో కీలక పాత్ర పోషిస్తే... బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన మహేంద్ర సింగ్ ధోనీ 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ని ముగించాడు. ఆఖర్లో మాహీ కొట్టిన హెలికాఫ్టర్ షాట్... క్రికెట్ ఫ్యాన్స్‌కి కలకాలం గుర్తుండిపోతుంది...
అంతకుముందు జరిగిన గ్రూప్ మ్యాచుల్లో కానీ సెమీ ఫైనల్‌లో కానీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయిన మహేంద్ర సింగ్ ధోనీ, ఫైనల్‌లో టీమిండియా కుదురుకున్నాక వచ్చిన ఓ సిక్సర్‌తో క్రెడిట్ మొత్తం కొట్టేశాడు. టెండూల్కర్, సెహ్వాగ్ అవుటైన తర్వాత గౌతమ్ గంభీర్ ఆడిన ఇన్నింగ్స్‌తో పోలిస్తే, మాహీ ఇన్నింగ్స్ చాలా చిన్నదే...
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్... మిగిలిన టీమ్స్‌లా స్టార్ ప్లేయర్ల కోసం కోట్లు ఖర్చు చేయకుండా కుర్రాళ్లతో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ తీసుకొచ్చేవాడు. ముఖ్యంగా మాహీని అవుట్ చేసేందుకు గంభీర్ వాడిన టెక్నిక్ వేరే లెవెల్...
ధోనీ క్రీజులోకి రాగానే టీమ్‌లోని టాప్ స్పిన్నర్‌కి బంతిని అందించేవాడు గౌతమ్ గంభీర్. అలాగే టెస్టు మ్యాచుల్లో మాదిరిగా రెండు స్లిప్పులు, షార్ట్ లెగ్, సిల్లీ పాయింట్‌లో ఫీల్డర్లను మోహరించేవాడు. ఈ వ్యూహం చాలా సార్లు సూపర్ సక్సెస్ అయ్యింది.
ముంబై ఇండియన్స్‌పై జస్ప్రిత్ బుమ్రా, లసిత్ మలింగ వంటి ఫాస్ట్ బౌలర్లను కూడా చీల్చి చెండాడిన ధోనీ... గంభీర్ చేసిన వ్యూహాన్ని ఛేదించలేక స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరేవాడు. ఈ విషయం గురించి తాజాగా మాట్లాడాడు కేకేఆర్ మాజీ బ్యాటర్, వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప...
‘కెప్టెన్‌గా గౌతమ్ గంభీర్ ప్రతీ బ్యాటర్ ఆటతీరును క్షుణ్ణంగా చదివేవాడు. ఏ బ్యాటర్‌కి ఎలాంటి ఫీల్డింగ్ సెట్ చేయాలి, ఏ బౌలర్‌ని వాడాలనేది అతనికి చాలా క్లారిటీ ఉండేది. కేకేఆర్‌లో నేను వికెట్ కీపర్‌గా ఉన్నాను. మాహీ క్రీజులోకి రాగానే అతనిపై తీవ్రమైన ఒత్తిడి పెట్టేందుకు గంభీర్, పక్కా ప్లానింగ్‌ని వాడేవాడు...
ధోనీ క్రీజులోకి రాగానే స్లిప్స్ పెట్టి, అతని చుట్టురా ఫీల్డర్లను మోహరించి భారీ షాట్స్ ఆడడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా చేసేవాడు. మాహీ కూడా చాలా సార్లు ఈ చిక్కుముడిని ఛేదించలేక అవుట్ అయ్యాడు. మాహీని త్వరగా ఎలా అవుట్ చేయాలనేది గంభీర్ దగ్గర చాలా సమాధానాలు ఉన్నాయి...’ అంటూ చెప్పుకొచ్చాడు రాబిన్ ఊతప్ప...
ఐపీఎల్ 2015, 2016 సీజన్లలో మాహీ కోసం గంభీర్ ప్రయోగించిన ఫీల్డింగ్ ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతోంది. సునీల్ నరైన్, పియూష్ చావ్లాలను వాడి స్లిప్స్ పెట్టి... ధోనీని ముప్పుతిప్పలు పెట్టేవాడు గౌతమ్ గంభీర్..