బాబర్ ఆజమ్‌కు స్వార్థమెక్కువ.. అందుకే అది వదలడం లేదు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్

First Published | Nov 2, 2022, 12:49 PM IST

T20 World Cup 2022: టీ20  ప్రపంచకప్ లో భారత్, జింబాబ్వే తో మ్యాచ్ లు ఓడి  సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాకిస్తాన్ జట్టు  తర్వాత జరిగిన నెదర్లాండ్స్ మ్యాచ్ లో గెలిచింది.  ఈ మూడు మ్యాచ్ లలో బాబర్ దారుణంగా విఫలమయ్యాడు. 

పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ స్వార్థపరుడని టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్  షాకింగ్ కామెంట్స్ చేశాడు. జట్టు ప్రయోజనాల కంటే అతడికి తన సొంత రికార్డుల మీదే  మోజు ఉందని, అందుకే జట్టు నాశనమవుతున్నా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాడని  వ్యాఖ్యానించాడు. 

భారత్,  జింబాబ్వే, నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో బాబర్.. రిజ్వాన్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. మూడు మ్యాచ్ లలో కూడా  పాకిస్తాన్ సారథి దారుణంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో  గంభీర్..  వరుసగా విఫలమవుతున్నా బాబర్ మాత్రం తన జట్టు కంటే స్వార్థం చూసుకుంటున్నాడని విమర్శించాడు. 


నెదర్లాండ్స్ తో మ్యాచ్ అనంతరం బాబర్ విఫలమయ్యాక గంభీర్ మాట్లాడుతూ..‘నా అభిప్రాయం ప్రకారం  ఒక కెప్టెన్ అనేవాడు తన కంటే తన జట్టు ప్రయోజనాల గురించి ఎక్కువ ఆలోచించాలి.  మన ప్రణాళికలో భాగంగా జరుగకుంటే దానిలో మార్పులు చేసుకోవాలి. గత కొంతకాలంగా బాబర్ పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. 

ఈ ప్రపంచకప్ లో కూడా భారత్, జింబాబ్వేతో మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యాడు. అటువంటి సమయంలో తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకుంటే బాగుండేది. ఫకర్ జమాన్ ను ఓపెనర్ గా పంపి.. వన్ డౌన్ లో బాబర్ వస్తే ఏమయ్యేది..? ఇదే స్వార్థం. ఒక కెప్టెన్ గా స్వార్థంగా ఉండటం  తేలికే.  

పాకిస్తాన్ గతంలో బాబర్ - రిజ్వాన్ లు కలిసి ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడారని చెప్పడం కూడా ఈజీనే.. కానీ కెప్టెన్ అనేవాడు తన సొంత రికార్డుల కంటే జట్టు గురించి ఆలోచించాలి.  అప్పుడే మంచి ఫలితాలను రాబట్టొచ్చు..’ అని గంభీర్ తెలిపాడు.  

గంభీర్ మాత్రమే గాక పాకిస్తాన్ లో కూడా మాజీ క్రికెటర్లు బాబర్ ఓపెనర్ గా రావడంపై మండిపడుతున్నారు. షోయభ్ అక్తర్ తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు బాబర్ ఓపెనర్ గా రాకూడదని.. తన బ్యాటింగ్ పొజిషన్ మార్చుకోవాలని పదే పదే  సూచిస్తున్నా అతడు మాత్రం వాళ్ల మాటను ఖాతరు చేయడం లేక తీవ్ర విమర్శల పాలవుతున్నాడు.   

Latest Videos

click me!