ఉమ్రాన్ మాలిక్ రికార్డును బ్రేక్ చేస్తా: పాక్ యువ పేసర్ శపథం

First Published Feb 6, 2023, 2:32 PM IST

Umran Malik: టీమిండియా యువ సంచలనం ఉమ్రాన్ మాలిక్.. పాకిస్తాన్ దిగ్గజ పేసర్ అక్తర్ రికార్డుల మీద కన్నేయగా.. తాజాగా  పాకిస్తాన్ కు చెందిన యువ బౌలర్   జమాన్ ఖాన్ మాత్రం   ఉమ్రాన్ రికార్డులకు ఎసరుపెట్టాడు. 

టీమిండియా యువ సంచలనం ఉమ్రాన్ మాలిక్ జాతీయ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి  ప్రయత్నాలు చేస్తున్నాడు. 2021 ఐపీఎల్ లో  పరిచయమై  గతేడాది మెరుపులు మెరిపించిన ఈ జమ్మూ యువ బౌలర్.. భారత జట్టులోకి రాగానే   అటు వన్డేలతో పాటు ఇటు టీ20లలో కూడా అత్యద్బుత వేగంతో అదరగొడుతున్నాడు.

ఐపీఎల్ లో గంటకు 157 కిలోమీటర్ల వేగంతో  బంతులు విసిరిన ఉమ్రాన్.. జాతీయ జట్టు తరఫున కూడా అవే రికార్డులు నమోదు చేస్తున్నాడు. ఇటీవల శ్రీలంకతో  ముగిసిన వన్డే, టీ20 సిరీస్ లలో ఉమ్రాన్.. భారత్ తరఫున అత్యధిక వేగంతో బంతులు విసిరన బౌలర్ గా రికార్డులకెక్కాడు.

శ్రీలంకతో వన్డే మ్యాచ్ లో  156 కి.మీ. వేగంతో  బాల్ వేసిన  అతడు.. టీ20లలో   155 కి.మీ. స్పీడ్ తో బౌలింగ్ చేశాడు.  వన్డేలలో  షోయభ్ అక్తర్  పేరిట ఉన్న  రికార్డు (162 కి.మీ.) రికార్డును కూడా బ్రేక్ చేస్తానని  మాలిక్  గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఉమ్రాన్.. అక్తర్ రికార్డుల మీద కన్నేయగా.. తాజాగా  పాకిస్తాన్ కు చెందిన యువ బౌలర్   జమాన్ ఖాన్ మాత్రం   ఉమ్రాన్ రికార్డులకు ఎసరుపెట్టాడు. త్వరలో జరుగబోయే  పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో  తాను ఉమ్రాన్ మాలిక్ రికార్డులను తిరగరాస్తానని శపథం పూనాడు.

పాకిస్తాన్ లో స్థానిక మీడియాతో  మాట్లాడుతూ... ‘వచ్చే  పీఎస్ఎల్ లో  నేను ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ బాల్ రికార్డును బ్రేక్ చేస్తా..’అని చెప్పాడు. ఈ కుర్రాడు  పీఎస్ఎల్ లో లాహోర్ ఖలాండర్స్ తరఫున ఆడుతున్నాడు.   ఇప్పటివరకు  జాతీయ జట్టులో చోటు దక్కకపోయినా  జమాన్..  దేశవాళీలో  నిలకడైన ప్రదర్శనలు  చేస్తున్నాడు.  దేశవాళీలో ఏడు లిస్ట్ ఏ మ్యాచ్ లు, 30 టీ20 మ్యాచ్ లు ఆడాడు.

తనకు పేస్ (వేగం) ముఖ్యం కాదని,  మ్యాచ్ లో పరిస్థితులకు అనుగుణంగా  బౌలింగ్ చేస్తూ మంచి ప్రదర్శనలు ఇవ్వడమే ముఖ్యమని జమాన్ అన్నాడు. బౌలింగ్ లో పేస్ ఉండటం పెద్ద కష్టమేమీ కాదని, కానీ  దానిని ఎలా వాడామన్నదే కీలకం అని చెప్పాడు. పీఎస్ఎల్ - 8వ సీజన్ ఈనెల 13న మొదలుకానుంది.

click me!