పంత్‌కు ప్రమాదం.. ఐపీఎల్‌కు దూరం..! మరి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఎవరు..?

First Published | Dec 31, 2022, 2:54 PM IST

IPL 2023: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు  శుక్రవారం  రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు త్వరలో  స్వదేశంలో ఆస్ట్రేలియా సిరీస్ తో పాటు  ఐపీఎల్  కూ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 
 

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్  కు  సారథి కష్టాలు మొదలయ్యాయి.  ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్  శుక్రవారం  కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం రిషికేష్ లోని ఏయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు.  పంత్ ప్రస్తుతం పరిస్థితి చూస్తే అతడు కోలుకోవడానికి ఆరు నుంచి 8 నెలల సమయం పట్టవచ్చునని తెలుస్తున్నది.  
 

ఇదే నిజమైతే అతడు స్వదేశంలో ఆస్ట్రేలియాతో  టెస్టు సిరీస్,  మార్చి చివరివారంలో జరుగబోయే ఐపీఎల్ కు కూడా దూరమైతాడు.  మరి పంత్ లేకుంటే  ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్సీ బాధ్యతలు మోసేది ఎవరు..? 


ఢిల్లీ యాజమాన్యానికి పంత్  ప్రమాదం కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది.  పంత్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు..? అని  వాళ్లు తలలు పట్టుకుంటున్నారు.  ఐపీఎల్ కు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో  కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి అప్పజెప్పితే బాగుంటుంది..?  ఆ  స్థానానికి ఎవరైతే సూటవుతారు..? ఢిల్లీని నడిపించేది ఎవరు..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

పంత్  స్థానాన్ని భర్తీ చేసేందుకు ఢిల్లీలో పలువురు ఆటగాళ్లు  పోటీ పడుతున్నారు. వారిలో  ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్,  ముంబై కెప్టెన్ పృథ్వీ షా, ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్  లు ముందువరుసలో ఉన్నారు. 

పైన పేర్కొన్న జాబితాలో  అత్యంత అనుభవజ్ఞుడు డేవిడ్ వార్నర్.  అంతేగాక వార్నర్ గతంలో  ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు  సారథిగా వ్యవహరించిన అనుభవం కూడా ఉంది.  పంత్  ప్రమాదం తర్వాత   ఢిల్లీ యాజమాన్యం కూడా ఇదే భావనకు వచ్చినట్టు తెలుస్తున్నది. 

వార్నర్ కాకుంటే  మరో ఆసీస్  స్టార్ మిచెల్ మార్ష్  కూడా  పోటీలో ఉన్నాడు. మార్ష్ కు ఐపీఎల్ లో సారథ్యం వహించిన అనుభవం లేదు. కానీ 2010లో ఆస్ట్రేలియా అండర్ - 19 జట్టుకు అతడే సారథి.  వార్నర్ కాకుంటే మార్ష్ రూపంలో ఢిల్లీకి మంచి ఆప్షన్ ఉంది. 
 

ఇండియన్  ప్లేయర్ నే కెప్టెన్ గా ఎంపిక చేయాలనుకుంటే మాత్రం ముందు వరుసలో ఉన్న పేరు పృథ్వీ షా. ఈ ముంబై బ్యాటర్ కు కూడా ఐపీఎల్ లో  కెప్టెన్ గా చేసిన అనుభవం లేదు.  కానీ దేశవాళీలో ముంబై జట్టును నడిపిస్తున్నాడు. అతడి హయాంలోనే ముంబై 2020-21 సీజన్ లో విజయ్ హజారే ట్రోఫీ నెగ్గింది. 2021-22  రంజీ సీజన్ లో రన్నరప్ గా నిలిచింది.   

ఈ ముగ్గురితో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ఇటీవలే  వేలంలో కొనుగోలు చేసిన మనీష్ పాండే కూడా ఉన్నాడు.  పాండే కూడా ఐపీఎల్ లో కెప్టెన్ గా  చేయకపోయినా దేశవాళీలో  కర్నాటక జట్టును  నడిపిస్తున్నాడు.  ఆ అనుభవం  కూడా అతడికి పనికొచ్చేదే. మరి  ఈ నలుగురిలో   సారథ్య పగ్గాలు దక్కెదెవరికో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

Latest Videos

click me!