నిన్న ఆస్ట్రేలియాకి, నేడు టీమిండియాకి... డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు టీమిండియా ఆటగాడికి గాయం...

First Published Jun 5, 2023, 10:25 AM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ముందు ఇరు జట్లను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే గాయంతో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హజల్‌వుడ్, డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కి ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయమైనట్టు సమాచారం...

కెఎల్ రాహుల్ గాయపడడంతో అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ని ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఎంపిక చేసింది బీసీసీఐ. ప్రాక్టీస్ సెషన్స్‌లో టీమిండియా నెట్ బౌలర్ అంకిత్ చౌదరి బౌలింగ్‌లో ఓ బౌన్సర్, ఇషాన్ కిషన్‌ చేతికి బలంగా తాకినట్టు సమాచారం...

అయితే ఆ గాయానికి బ్యాండేజీ వేసుకుని తిరిగి నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు ఇషాన్ కిషన్. ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కి గాయమైంది. 

వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో ఇషాన్ కిషన్ కంటికి గాయం కావడంతో అతను రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి కూడా రాలేదు... రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కి శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్‌లను వికెట్ కీపర్లుగా ఎంపిక చేసింది బీసీసీఐ..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకి శ్రీకర్ భరత్ వికెట్ కీపర్‌గా వ్యవహరించాడు. అయితే ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడిన శ్రీకర్ భరత్, వృద్ధిమాన్ సాహా కారణంగా పూర్తిగా రిజర్వు బెంచ్‌లోనే కూర్చోవాల్సి వచ్చింది. 

దీంతో ప్రాక్టీస్ లేని శ్రీకర్ భరత్ కంటే ముంబై ఇండియన్స్ తరుపున అన్ని మ్యాచులు ఆడి ఆకట్టుకున్న ఇషాన్ కిషన్‌ని టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడిస్తే బాగుంటుందని విమర్శలు వెల్లడించారు..

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ కూడా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో శ్రీకర్ భరత్‌ని ఆడించడం కంటే ఇషాన్ కిషన్‌ని ఆడిస్తే ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడని కామెంట్ చేశారు..

click me!