బుమ్రా బాటలోనే అర్ష్‌దీప్..! వెన్నునొప్పితో మూడో టీ20కి దూరం.. ముందస్తు చర్యలా లేక షాక్ తప్పదా..?

First Published Oct 4, 2022, 8:17 PM IST

IND vs SA T20I: ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో  భారత్ కు మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్ లో టీమిండియా యువ పేసర్  అర్ష్‌దీప్ సింగ్ ఆడటం లేదు. 

ఈనెల మూడోవారం నుంచి ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కు ముందు భారత క్రికట్ జట్టుకు  మరో షాక్ తప్పదా..? ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా  దూరమై చేయి విరిగినంత పనైన భారత బౌలింగ్ దళానికి మరో షాక్ తప్పేలా లేదా..? 

బుమ్రా లేకున్నా లెఫ్టార్మ్ పేసర్  అర్ష్‌దీప్ పై భారత జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కానీ దక్షిణాఫ్రికాతో ఇండోర్ లో జరుగుతున్న మూడో మ్యాచ్ లో అతడు  తుది జట్టులో లేడు. బుమ్రా ఏ కారణంచేతనైతే టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడో అర్ష్‌దీప్ కూడా అదే కారణంగా  ఈ మ్యాచ్  లో ఆడటంలేదు.

అర్ష్‌దీప్ ఈ మ్యాచ్ ఎందుకు ఆడటం లేదనే విషయమై టాస్ సందర్భంగా  రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘నేటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ లకు విశ్రాంతినిచ్చాం. వీళ్లిద్దరితో పాటు  ఈ మ్యాచ్ లో అర్ష్‌దీప్ కూడా ఆడటం లేదు. ఈరోజు ఉదయం నుంచి అతడు వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. 

అయితే అదేమంత పెద్దదైతే కాదు. ముందస్తు చర్యలో భాగంగానే అర్ష్‌దీప్ ను ఈ మ్యాచ్ ఆడించడంలేదు.  అంతకుమించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..’ అని తెలిపాడు. 

ఆస్ట్రేలియా సిరీస్ లో తొలి టీ20కి, దక్షిణాఫ్రికాతో మొదటి టీ20కి టాస్ కు వచ్చినప్పుడు కూడా రోహిత్ బుయ్రా గురించి ఇదే మాట చెప్పాడు. బుమ్రాకు కాస్త ఒంట్లో బాగోలేదని  అతడు తర్వాత మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని చెప్పాడు. కానీ తీరా చూస్తే  బుమ్రా ఏకంగా  ప్రపంచకప్ జట్టు నుంచే వైదొలగాల్సివచ్చింది. 
 

ఇప్పుడు కూడా రోహిత్.. అర్ష్‌దీప్ విషయంలో చెబుతున్న మాటలుఎంతవరకు నమ్మవచ్చన్నది సందేహంగానే ఉన్నది. ప్రపంచకప్ కు వెళ్లేముందే టీమ్ మేనేజ్మెంట్ మరో షాక్ ఏమీ ఇవ్వదు కదా..? అని ఫ్యాన్స్ వాపోతున్నారు. 

ఇదిలాఉంటే ఇండోర్ మ్యాచ్ ముగిశాక  భారత జట్టు.. ఈ నెల 6న ఆసీస్ కు వెళ్లనుంది. మరి  ఆ జట్టుతో అర్ష్‌దీప్ వెళ్తాడా..? లేదా..? అనేది చూస్తే అతడు ప్రపంచకప్  లో ఆడతాడా..? లేదా..? అనేదానిమీద ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. 

click me!