కోహ్లీ ఈజ్ ఆన్ ది వే.. ర్యాంకింగుల్లో టాప్-10లోకి దూసుకొచ్చిన ఛేజింగ్ మాస్టర్..

First Published | Oct 26, 2022, 5:15 PM IST

Virat kohli: ఛేదనలో మొనగాడు విరాట్ కోహ్లీ ఇటీవలే పాకిస్తాన్ తో ముగిసిన ఉత్కంఠ పోరులో  అత్యద్భుత ఆటతీరుతో  టీమిండియాకు ఘన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆడిన ఆట ఇప్పుడు అతడిని  మళ్లీ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకులలో టాప్-10లోకి తీసుకొచ్చింది. 

Image credit: Getty

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ పాకిస్తాన్ తో మ్యాచ్ లో తనలోని మునపటి ఆటను చూపిస్తూ భారత్ కు ఘనవిజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో  కోహ్లీ.. 53 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ  ప్రదర్శనతో కోహ్లీ.. తిరిగి ఐసీసీ  టీ20 బ్యాటింగ్ ర్యాంకింగుల్లో టాప్-10లోకి దూసుకొచ్చాడు. 

virat kohli

ఒకప్పుడు మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ గా ఉన్న కోహ్లీ.. చాలాకాలం తర్వాత  గతేడాది  నవంబర్ లో టీ20 ర్యాంకింగుల్లో తొలిసారి టాప్-10 నుంచి వైదొలిగాడు. వరుస వైఫల్యాలతో అతడి ర్యాంకింగ్ రోజురోజుకూ పడిపోయింది.  అయితే ఈ ఏడాది ఫిబ్రవరి లో తిరిగి  టాప్-10లోకి వచ్చినా ఎక్కువ కాలం ఉండలేదు. మళ్లీ వరుసగా విఫలమై 35వ ర్యాంకుకు పడిపోయాడు.  


ఈ ఏడాది ఆగస్టులో దుబాయ్ వేదికగా నిర్వహించిన ఆసియా కప్ కు ముందు టీ20 ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ.. 35వ స్థానంలో ఉన్నాడు. కానీ ఆసియా కప్ కు ముందు విరామం తీసుకోవడం కోహ్లీకి హెల్ప్ అయింది. పాకిస్తాన్, థాయ్లాండ్  మీద నిలకడగా ఆడి ఆ తర్వాత అఫ్గానిస్తాన్ పై సెంచరీ చేశాడు. దీంతో కోహ్లీ ర్యాంకు ఆసియా కప్ తర్వాత 15కు చేరింది. 

పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు వరకు  కూడా కోహ్లీ ఇదే ర్యాంకులో ఉన్నాడు. కానీ ఈ మ్యాచ్ లో ఛేదనలో వీరోచిత పోరాటం చేయడంతో  కోహ్లీ.. తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఆరు స్థానాలు ఎగబాకి 9వ  స్థానానికి చేరుకున్నాడు.  ప్రస్తుతం కోహ్లీ..  635 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. తర్వాత మ్యాచ్ లలో కూడా  కోహ్లీ ఇదే  ప్రదర్శనను కొనసాగిస్తే టాప్-5లోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు. 

ఈ జాబితాలో మహ్మద్ రిజ్వాన్ 849 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. గతవారం రెండో స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానానికి పడిపోయాడు.  ఇటీవల ముగిసిన ముక్కోణపు సిరీస్ తో పాటు  ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ధాటిగా ఆడిన  కివీస్  ఓపెనర్ డెవాన్ కాన్వే.. 831 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు.  సూర్య..  828 పాయింట్లతో థర్డ్ ప్లేస్ కు చేరాడు. 

పాక్ సారథి బాబర్ ఆజమ్.. నాలుగో స్థానానికి పడిపోయాడు. ఆ తర్వాత మార్క్రమ్ (దక్షిణాఫ్రికా), డేవిడ్ మలన్ (ఇంగ్లాండ్), ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా), పతుమ్ నిస్సంక (శ్రీలంక) లు కోహ్లీ కంటే ముందున్నారు. 

Latest Videos

click me!