అనిల్ కుంబ్లే తర్వాత అతడే.. టీమిండియా స్పిన్నర్ పై సంజయ్ బంగర్ కామెంట్స్

First Published Jun 22, 2022, 3:14 PM IST

భారత జట్టుకు సుదీర్ఘకాలం పాటు సేవలందించిన స్పిన్నర్లలో అనిల్ కుంబ్లే ఒకరు. లెగ్ స్పిన్ తో ఒంటి చేత్తో మ్యాచులను గెలిపించిన  కుంబ్లే తర్వాత.. 

టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తర్వాత భారత జట్టులో అంత నిలకడగా రాణించిన లెగ్ స్పిన్నర్ రాలేదనే చెప్పొచ్చు. రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్నా అతడు ఆఫ్ స్పిన్ బౌలర్. మణికట్టు మాయాజాలంతో బంతులను విసరడంలో లెగ్ స్పిన్నర్ల శైలి ప్రత్యేకం. 

కుంబ్లే రిటైర్మెంట్ తర్వాత ఇప్పటికి కూడా భారత జట్టులో నిఖార్సైన లెగ్ స్పిన్నర్ కొరత వేధిస్తూనే ఉంది.  మధ్యలో కొంతమంది వచ్చినా వాళ్లు కుంబ్లేను మరిపించలేకపోయారు. అయితే ఆ లోటును యుజ్వేంద్ర చాహల్ భర్తీ చేస్తాడని అంటున్నాడు ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్.. 

తాజాగా బంగర్ మాట్లాడుతూ... ‘భారత జట్టుకు నిలకడగా సుదీర్ఘకాలం పాటు సేవలందించిన లెగ్ స్పిన్నర్ ఎవరైనా ఉన్నారా..? అంటే మరో ఆలోచన లేకుండా గుర్తుకొచ్చే పేరు అనిల్ కుంబ్లే. అతడి తర్వాత మణికట్టు స్పిన్నర్ల జాబితాలో భారత జట్టు తరఫున నిలకడగా ఆడగలిగే సత్తా ఉన్న స్పిన్నర్ చాహల్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.. 

గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ లో అతడు ఆడాల్సి ఉండేది. ఒకవేళ అతడు ఆడుంటే కచ్చితంగా ఫలితం మరోవిధంగా ఉండేది. కానీ ఆస్ట్రేలియాలో జరుగబోయే ప్రపంచకప్ లో అతడు టీమిండియాకు ట్రంప్ కార్డ్ అవుతాడు. జట్టు సక్సెస్ లో అతడు కీలక పాత్ర పోషిస్తాడు..’ అని బంగర్ అన్నాడు. 

బంగర్ ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో ఉన్నప్పుడు  చాహల్ బెంగళూరు తరఫున ఆడిన విషయం విధితమే. చాహల్ ను దగ్గర్నుంచి గమనించిన వ్యక్తిగా బంగర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ తరఫున చాహల్ ఆడినప్పుడు.. ఇతర స్టేడియాలతో పోలిస్తే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం చిన్నదైనా  బ్యాటర్లను చాహల్ అద్భుతంగా కట్టడి చేసేవాడని బంగర్ తెలిపాడు.  

అందుకోసం చాహల్ బౌలింగ్ లైనప్ ను మార్చుకోవడం, బౌలింగ్ పొజిషన్ ను ఛేంజ్ చేసుకోవడం ద్వారా అద్భుత ఫలితాలు రాబట్టాడని  బంగర్ వివరించాడు.  గతేడాది ఐపీఎల్ లో రాణించినా చాహల్ కు ప్రపంచకప్ లో చోటు దక్కలేదు. అతడిని కాదని వరుణ్ చక్రవర్తికి చోటిచ్చారు సెలక్టర్లు. కానీ వరల్ద్ కప్ లో చక్రవర్తి చూపిన ప్రభావం శూణ్యం. ఈ నిర్ణయం పై గతంలోనే  బీసీసీఐపై తీవ్ర విమర్శలు వచ్చాయి.కాగా ఆ తర్వాత చాహల్  తిరిగి భారత జట్టులో చేరి అదరగొడుతున్నాడు. 

click me!