Asia Cup 2022: అయినా గుర్రమెగరావచ్చు.. టీమిండియా ఇలా ఫైనల్ చేరావచ్చు..!

First Published Sep 7, 2022, 10:16 AM IST

Asia Cup 2022: ఆసియా కప్ లో భారత్ కథ ముగిసిందా..? మంగళవారం శ్రీలంకతో  మ్యాచ్ లో ఓడాక టీమిండియా బ్యాగులు సర్దుకోవాల్సిందేనా..?  

ఆసియా కప్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన  భారత జట్టు  సూపర్-4లోనే బోల్తా కొట్టింది.  సూపర్-4లో వరుసగా పాకిస్తాన్, శ్రీలంకలతో ఓడి ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే సాంకేతికంగా  భారత్ కు ఇంకా అవకాశాలున్నాయి. అవి ఎలాగంటే..? 
 

ఇప్పటికే రెండు విజయాలతో శ్రీలంక ఆసియా కప్ ఫైనల్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. మిగిలిన రెండు జట్లు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ చెరో రెండు మ్యాచులు ఆడనున్నాయి. వాటిలో ఒక్కటి గెలిచినా వాటికి కూడా ఫైనల్ చేరే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వీటితో పాటు వరుసగా రెండు మ్యాచులు ఓడిన టీమిండియాకూ  ఫైనల్ చేరే అవకాశాలు ఈ విధంగా ఉన్నాయి. 

సూపర్-4లో భాగంగా  నేడు జరుగబోయే అఫ్గాన్-పాక్ పోరులో విజేతను బట్టి ఈ టోర్నీలో భారత భవితవ్యం ఆధారపడి ఉంటుంది. నేటి మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ పాకిస్తాన్ ను ఓడించాలి.  ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తే భారత్ ఆశలు గల్లంతే.. 
 

అయితే ఆ తర్వాత గురువారం ఇండియా-అఫ్గానిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది.  ఈ మ్యాచ్ లో భారత్ అఫ్గాన్ ను ఓడించాలి. అది కూడా భారీ తేడాతో ఘనవిజయం సాధిస్తే ఇంకా మంచిది. అప్పుడు భారత రన్ రేట్ కూడా పెరుగుతంది. భారత్ ఫైనల్ బెర్త్ కు అదే కీలకమవుతుంది. 

అంతేగాక సెప్టెంబర్ 9న  జరగనున్న శ్రీలంక-పాకిస్తాన్ మ్యాచ్ లో  లంక ఓడిపోవాలి.  పొరపాటున  పలితం తారుమారు అయినా   భారత్ బ్యాగ్ సర్దుకోవడమే. 

వీటన్నింటికీ మించి ఫైనల్ బెర్త్ కు నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం శ్రీలంక నెట్ రన్ రేట్ +0.351గా ఉంది.  రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్ నెట్ రన్ రేట్.. +0.125గా ఉండగా మూడో స్థానంలో ఉన్న భారత్.. -0.125గా ఉంది. అఫ్గాన్ -0.589 తో నాలుగో స్థానంలో ఉంది. 

Image credit: PTI

పైన పేర్కొన్న సమీకరణాలతో పాటు అఫ్గాన్ తో మ్యాచ్ లో భారత్ భారీ తేడాతో.. (ఒకరకంగా చెప్పాలంటే మ్యాచ్ వన్ సైడ్ అయితే మరీ మంచిది) గెలిస్తే భారత్ నెట్ రన్ రేట్ మెరుగవుతుంది. అప్పుడు  పైనున్న సమీకరణాలన్నీ అనుకున్నట్టు జరిగితే భారత్ ఫైనల్ చేరడం ఖాయం.  ఇవన్నీ జరిగే పనేనా..? అనుకుంటున్నారా..? ఏమో గుర్రం ఎగరావచ్చు కదా..!

click me!