రోహిత్ శర్మ రికార్డుల మోత... ఆసియా కప్ టోర్నీలో అరుదైన ఘనత సాధించిన హిట్ మ్యాన్...

First Published Sep 6, 2022, 8:55 PM IST

కెప్టెన్సీ చేపట్టిన తర్వాత తన రేంజ్ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేకపోయిన రోహిత్ శర్మ, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదిరిపోయే ఇన్నింగ్స్‌తో టీమిండియాని ఆదుకున్నాడు. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత జట్టును హాఫ్ సెంచరీతో ఆదుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు...

KL Rahul

టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన భారత జట్టుకి రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. గాయం తర్వాత పరుగులు రాబట్టడానికి ఇబ్బంది పడుతున్న కెఎల్ రాహుల్‌ని మహీశ్ తీక్షణ, ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ చేశాడు. అంపైర్ అవుట్ ఇవ్వగానే డీఆర్‌ఎస్ తీసుకున్నాడు కెఎల్ రాహుల్. అయితే టీవీ రిప్లైలో అంపైర్స్ కాల్‌గా రావడంతో 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు.  

Image credit: Getty

వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ... దిల్షాన్ ముదుశంక బౌలింగ్‌లో మొదటి మూడు బంతుల్లో పరుగులు చేయలేకపోయాడు... నాలుగో బంతికి అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు దిల్షాన్ మదుశంక. దీంతో 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఆసియా కప్ టోర్నీలో విరాట్ కోహ్లీకి ఇది మొట్టమొదటి డకౌట్ కాగా కెరీర్‌లో 33వ డకౌట్...

13  పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత జట్టును ఆదుకున్నాడు రోహిత్ శర్మ. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి మూడో వికెట్‌కి 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్ శర్మ, 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేసి కరుణరత్నే బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...
 

Image credit: Getty

ఆసియా కప్ టోర్నీ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 971, విరాట్ కోహ్లీ 920 పరుగులతో రోహిత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
 

ఆసియా కప్‌లో రోహిత్ శర్మకు ఇది 9వ 50+ స్కోరు. ఆసియా కప్‌లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన భారత బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ ఏడు సార్లు 50+ స్కోర్లు చేసి రోహిత్, సచిన్ తర్వాతి ప్లేస్‌లో ఉన్నాడు...

Rohit Sharma

టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది 32వ 50+ స్కోరు. టీ20ల్లో అత్యధిక 50+ స్కోర్లు చేసి ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు రోహిత్ శర్మ. ఆసియా కప్‌లో 27 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు. 26 సిక్సర్లు బాదిన షాహిదీ ఆఫ్రిదీ రికార్డును అధిగమించాడు రోహిత్ శర్మ...

click me!