ఆఫ్ఘానిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడనున్న టీమిండియా... షెడ్యూల్ విడుదల చేసిన ఆఫ్ఘాన్ క్రికెట్ టీమ్...

First Published Dec 14, 2021, 10:37 AM IST

భారత క్రికెట్ టీమ్ వచ్చే ఏడాదిన్నరపాటు ఫుల్లు బిజీ బిజీ షెడ్యూల్‌లో గడపనుంది. ఇప్పటికే సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న టీమిండియా, వచ్చే ఏడాది వరుస సిరీస్‌లతో బిజీ బిజీగా గడపనుంది...

డిసెంబర్ 26 నుంచి సౌతాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డే మ్యాచుల సిరీస్‌లు ఆడే భారత జట్టు, జనవరి24న స్వదేశానికి తిరిగి రానుంది...

ఆ తర్వాత 10 రోజులకు వెస్టిండీస్‌తో స్వదేశంలో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లను ఆడనుంది టీమిండియా. ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 20 వరకూ ఈ సిరీస్ జరగనుంది..

ఆ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లను ఆడనుంది భారత జట్టు. ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక సిరీస్, మార్చి 18న ముగియనుంది...

మార్చి 19 తర్వాత భారత క్రికెటర్లు 10-12 రోజులు విశ్రాంతి తీసుకుని, ఐపీఎల్ 2022 సీజన్‌కి సిద్ధమవుతారని అనుకున్నారంతా. అయితే ఈ గ్యాప్‌లో కూడా మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది టీమిండియా...

మార్చి నెలలో ఇండియాలో మూడు వన్డేల సిరీస్ ఆడబోతున్నట్టు, షెడ్యూల్‌ను విడుదల చేసింది ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ టీమ్. వచ్చే రెండేళ్ల పాటు జరగబోయే క్రికెట్ షెడ్యూల్‌ను విడుదల చేసింది ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు...

2022 జనవరిలో నెదర్లాండ్స్‌తో, ఆ తర్వాత జింబాబ్వేతో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడే ఆఫ్ఘాన్ జట్టు, ఆ తర్వాత బంగ్లాదేశ్, ఇండియాలతో సిరీస్‌లు ఆడనుంది...

వచ్చే ఏడాది మే నెలలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో సిరీస్ ఆడబోతున్నట్టు ప్రకటించింది ఆఫ్ఘాన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్ఘాన్‌లో క్రికెట్ సాధ్యమేనా? లేక యూఏఈ వేదికగా ఈ మ్యాచులు జరుగుతాయా? అనేది తేలాల్సి ఉంది...

ఆ తర్వాత జూలైలో ఐర్లాండ్‌తో మ్యాచులు ఆడే ఆఫ్ఘాన్, ఆగస్టులో ఆసియా కప్, అక్టోబర్‌లో టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది. నవంబర్‌లో జింబాబ్వేతో రెండు టీ20, ఐదు వన్డే, రెండు టెస్టులు ఆడుతుంది...

టీ20 వరల్డ్ కప్ 2021 సీజన్‌లో భారత జట్టు పరాజయానికి బిజీ షెడ్యూలే కారణమని ట్రోల్స్ వినిపించాయి. అయితే వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ముందు కూడా యమా బిజీగా గడపనుంది భారత జట్టు...

ఆఫ్ఘాన్‌తో సిరీస్ తర్వాత ఐపీఎల్ 2022, సౌతాఫ్రికాతో స్వదేశంలో ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ఆడే టీమిండియా, ఇంగ్లండ్ టూర్‌లో ఓ టెస్టు, మూడు టీ20, మూడు వన్డే మ్యాచులు ఆడుతుంది...

ఆ తర్వాత ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్‌కప్ 2022 టోర్నీల్లో పాల్గొంటుంది భారత జట్టు. గత సీజన్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో పొట్టి ప్రపంచకప్ ఆడిన టీమిండియా ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ ఆడనుంది.

click me!