Jalaj Saxena, MS dhoni
Cricket Records: ప్రపంచ క్రికెట్ లో అసాధ్యం అనుకున్న అనేక రికార్డులు సుసాధ్యం అయ్యాయి. కొన్ని ఆశ్చర్యపరిచే క్రికెట్ రికార్డులు కూడా ఉన్నాయి. భారత స్టార్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలు కూడా సాధించలేని రికార్డును ఒక భారత ప్లేయర్ సాధించి చరిత్ర సృష్టించాడు. అతనే జలజ్ సక్సేనా.
రంజీ ట్రోఫీలో విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీలను అధిగమిస్తూ జలజ్ సక్సేనా చరిత్ర సృష్టించాడు. భారత దేశవాళీ క్రికెట్‌లో వెటరన్ ఆల్ రౌండర్ జలజ్ సక్సేనా అలాంటి ఘనత సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటి వరకు భారత ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా ఈ ఘనత సాధించడంలో లేట్ అయ్యారు. బుధవారం తుంబలో ఉత్తరప్రదేశ్‌తో కేరళ నాలుగో రౌండ్ మ్యాచ్‌లో జలజ్ సక్సేనా రంజీ ట్రోఫీలో 6000 పరుగులతో పాటు 400 వికెట్లు కూడా పూర్తి చేశాడు.
Jalaj Saxena
కేరళకు చెందిన జలజ్ సక్సేనా బుధవారం (06 నవంబర్ 2024) రంజీ ట్రోఫీ చరిత్రలో 400 వికెట్లు, 6000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా చరిత్రాత్మక ఫీట్‌ను సాధించాడు. తిరువనంతపురంలోని తుంబలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ గ్రౌండ్‌లో ఉత్తరప్రదేశ్ (యూపీ) తో జరిగిన కేరళ నాలుగో రౌండ్ మ్యాచ్‌లో జలజ్ సక్సేనా ఈ ఫీట్ సాధించాడు. మొదటి రోజు ఆటలో నితీష్ రాణాను స్టంపౌట్ చేయడం ద్వారా ఆఫ్ స్పిన్నర్ తన నాల్గవ ఔట్‌తో ఈ ఘనతను సాధించాడు. కేరళ కెప్టెన్ సచిన్ బేబీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న తర్వాత సక్సేనా యూపీ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు.
Jalaj Saxena
చివరి రౌండ్‌లో కోల్‌కతాలో 6000 పరుగులు పూర్తి చేసిన జలజ్ సక్సేనా, యూపీపై తన నాలుగో వికెట్ తీసి 400వ రంజీ ట్రోఫీ వికెట్ మైలురాయిని సాధించాడు. ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత కేరళ యూపీ టాప్ ఆర్డర్‌ను చిత్తు చేసింది. సక్సేనా తన అద్భుతమైన బౌలింగ్‌తో యూపీ జట్టును చిత్తు చేశాడు. అతను యూపీ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ నితీష్ రాణాను స్టంపౌట్ చేయడం ద్వారా తన 400వ వికెట్ ను సాధించాడు.
37 ఏళ్ల సక్సేనా రంజీ ట్రోఫీ చరిత్రలో 400 వికెట్లు తీసిన 13వ బౌలర్.. అలా చేసిన ప్రస్తుతం ఆడుతున్న ఏకైక క్రికెటర్. సక్సేనా తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను 2005లో మధ్యప్రదేశ్‌తో ప్రారంభించాడు. 2016-17 సీజన్‌లో కేరళకు వెళ్లే ముందు, అతను జట్టు కోసం 159 వికెట్లు తీయడంతో పాటు 4041 పరుగులు పూర్తి చేశాడు. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కేఎన్ అనంతపద్మనాభన్ తర్వాత కేరళ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. సక్సేనా కూడా రంజీ ట్రోఫీలో కేరళ తరఫున 2000 పరుగులకు చేరువలో ఉన్నాడు.
ఏళ్ల తరబడి జాతీయ జట్టులో స్థానం కోసం కష్టపడుతున్న జలజ్ సక్సేనా .. గత సీజన్‌లో దేశవాళీ క్రికెట్‌లో 9000 పరుగులు, 600 వికెట్లు తీసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. వీరిలో వినూ మన్కడ్, మదన్ లాల్, పర్వేజ్ రసూల్ ఈ లిస్టులో ఉన్నారు. రంజీ ట్రోఫీ సర్క్యూట్‌లో జలజ్ సక్సేనా ప్రదర్శన ఇతర ఆల్ రౌండర్ల కంటే చాలా ఎక్కువ, అతను గ్రేట్స్ విజయ్ హజారే, మదన్ లాల్, సునీల్ జోషి కంటే మెరుగైన గణాంకాల రికార్డును సాధించాడు.
రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్లు
637 - రాజిందర్ గోయల్
530 - ఎస్.వెంకటరాఘవన్
479 - సునీల్ జోషి
442 - ఆర్.వినయ్ కుమార్
441 - నరేంద్ర హిర్వానీ
437 - భగవత్ చంద్రశేఖర్
418 - వి.వి.కుమార్
416 - షాబాజ్ నదీమ్
409 - పంకజ్ సింగ్
405 - సాయిరాజ్ బహుతులే
403 - బిషన్ సింగ్ బేడీ
401 - ఉత్పల్ ఛటర్జీ
400* -జలజ్ సక్సేనా