ధోనీ రనౌట్‌కి నాలుగేళ్లు... వరల్డ్ కప్‌లో ఆ అర ఇంచు దూరం దాటి ఉంటేనా! అన్నీ వేరేలా ఉండేవిగా...

First Published Jul 10, 2023, 1:44 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ, ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి నేటికి నాలుగేళ్లు. సరిగ్గా ఇదే రోజున, 2019లో వన్డే వరల్డ్ కప్ టోర్నీ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడింది భారత జట్టు. ఇదే మహేంద్ర సింగ్ ధోనీకి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు...
 

2019 వన్డే వరల్డ్ కప్ గ్రూప్ స్టేజీలో వరుస విజయాలు అందుకుని, టేబుల్ టాపర్‌గా నిలిచింది టీమిండియా. టాప్ పొజిషన్‌లో ఉన్న ఇండియా, నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ మధ్య మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది..

వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. భువీ 3 వికెట్లు తీయగా బుమ్రా, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చామాల్ తలా ఓ వికెట్ తీశారు..

Latest Videos


240 పరుగుల లక్ష్యఛేదనలో కెఎల్ రాహుల్ 1, రోహిత్ శర్మ 1, విరాట్ కోహ్లీ 1 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. దినేశ్ కార్తీక్ 6 పరుగులు చేసి అవుట్ కావడంతో 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది..

రిషబ్ పంత్ 32 పరుగులు, హార్ధిక్ పాండ్యా 32 పరుగులు చేసి అవుట్ కాగా రవీంద్ర జడేజా, ధోనీ కలిసి ఏడో వికెట్‌కి 116 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసిన జడేజా ఉన్నంతసేపు టీమిండియా గెలుస్తుందనే అనుకున్నారు అభిమానులు..

అయితే విజయానికి 32 పరుగులు కావాల్సిన సమంలో జడేజాని ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు. జడ్డూ అవుట్ అయినా వరల్డ్ బెస్ట్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో ఉండడంతో టీమిండియా ఫ్యాన్స్ ఆశలు వదులుకోలేదు. 72 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసిన ధోనీ, టీమిండియా విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన సమయంలో రనౌట్ అయ్యాడు..
 

మార్టిన్ గుప్తిల్ వేసిన డైరెక్ట్ త్రో, మాహీ బ్యాటు క్రీజు దాటడానికి అరసెకను ముందు వికెట్లను గీరాటేసింది. ఫలితం మ్యాచ్‌ పోయింది. టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమ్, ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. ధోనీ బ్యాటు అర ఇంచు దూరం దాటినా.. టీమిండియా గెలిచే ఛాన్సులు తక్కువే... ఇది నిజం.

dhoni

ఆ వరల్డ్ కప్‌లో ధోనీ బ్యాటు నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ రాలేదు. సెమీస్‌లోనూ అప్పటిదాకా ధోనీ కొట్టింది రెండే బౌండరీలు. చివరి 9 బంతుల్లో 24 పరుగులు చేయాలంటే కనీసం 4 బౌండరీలు అవసరం. అయితే ధోనీ ఉన్న ఫామ్‌కి అది చాలా కష్టమే. వాస్తవానికి జడేజా అవుట్ అయినప్పుడే మ్యాచ్, భారత్ చేతుల్లో నుంచి చేజారింది...

ఒకవేళ టీమిండియా, న్యూజిలాండ్‌ని ఓడించి ఫైనల్ చేరి, ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ని చిత్తు చేసి ఉంటే.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టుకి ఓ ఐసీసీ టైటిల్ వచ్చి ఉండేది. అదే జరిగితే బీసీసీఐ, కోహ్లీ మధ్య విభేదాలు వచ్చేవి కావు. అన్నింటికీ మించి సౌరవ్ గంగూలీ, కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించే సాహసం చేసేవాడు కాదు... ఈ నాలుగేళ్లలో టీమిండియా గ్రాఫ్ మరోలా ఉండి ఉండేది. 

click me!