Sydney Barnes : అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా గొప్ప బౌలర్లు చాలా మంది ఉన్నారు. గొప్పగొప్ప బ్యాట్స్‌మెన్‌లను సైతం తమ తుఫాను పేస్ లేదా స్పిన్ మాయాజలంతో తమ ట్రాప్ లో వేసుకుని పెవిలియన్‌కు దారి చూపించారు. అయితే, లెజెండరీ బౌలర్లు అనగానే చాలా మంది చెప్పే పేర్లు ముత్తయ్య మురళీధరన్ (1347 వికెట్లు), షేన్ వార్న్ (1001 వికెట్లు) పేర్లు అభిమానుల పెదవులపై తరచుగా వినిపిస్తాయి.
ఎందుకంటే వారిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు. అయితే, వీరిని మించిన ఒక లెజెండరీ బౌలర్ ఉన్నాడు. తన కెరీర్ లో అత్యధిక వికెట్లు తీసుకునే రికార్డును సాధించకపోయిన అతను సాధించిన ఇతర రికార్డులను ఇప్పటికీ ఏ బౌలర్ కూడా బ్రేక్ చేయలేకపోయాడు. అతని కెరీర్ చాలా తక్కువగా ఉండవచ్చు, కానీ ఒకప్పుడు ఈ లెజెండ్ అంటే బ్యాటర్లకు హడల్. అతనే సిడ్నీ బర్న్స్.
Sydney Barnes, England
తుఫాను వేగంతో బ్యాట్స్‌మెన్ హడలెత్తించిన సిడ్నీ బర్న్స్
తుఫాను వేగంతో బ్యాట్స్‌మెన్ హడలెత్తించిన దిగ్గజ బౌలర్ సిడ్నీ బర్న్స్. అతని కెరీర్ లో తక్కువ మ్యాచ్ లే ఆడినప్పటికీ క్రికెట్ లో ఎవరూ సాధించలేని రికార్డులు సృష్టించాడు.
ఇంగ్లండ్‌కు చెందిన ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ అంతర్జాతీయ కెరీర్ 27 టెస్ట్ మ్యాచ్‌లను మాత్రమే ఆడాడు. కానీ, అతను ఏకంగా 189 వికెట్లు పడగొట్టాడు. ఒకే మ్యాచ్ లో ఏకంగా 17 వికెట్లు తీసుకుని తన కెరీర్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 2.36 అద్భుతమైన ఎకానమీతో బౌలింగ్ చేసిన ఏకైక బౌలర్ అతను.
24 సార్లు ఐదేసి వికెట్లు పడగొట్టాడు.7 సార్లు 10 వికెట్లు తీసుకున్నాడు. చాలా మంది లెజెండ్ బ్యాట్స్‌మెన్‌లకు హడలెత్తించి వారికి రాత్రింభవళ్లు పీడకలగా మిగిలాడు సిడ్నీ బర్న్స్.
4 మ్యాచ్‌ల్లో 49 వికెట్లు తీసిన సిడ్నీ బర్న్స్
1901లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సిడ్నీ బర్న్స్ తన చివరి టెస్టులో పెను సంచలనం సృష్టించాడు. 1913-14లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య జరిగిన 4 టెస్టుల సిరీస్‌లో సిడ్నీ బార్న్స్ బ్యాట్స్‌మెన్‌పై విధ్వంసం సృష్టించి 49 వికెట్లు పడగొట్టాడు.
ఇది అంతర్జాతీయ క్రికెట్ టెస్టు సిరీస్ లో ఒక బౌలర్ సాధించిన అత్యధిక వికెట్ల రికార్డు. దీంతో అతను ఒకే టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇది ఇప్పటికీ నిలిచి ఉన్న ప్రపంచ రికార్డు. ఈ నాలుగు మ్యాచ్‌ల 8 ఇన్నింగ్స్‌ల్లో సిడ్నీ బర్న్స్ వరుసగా 5, 5, 8, 9, 3, 5, 7, 7 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో 7 సార్లు 5 వికెట్లు, 3 సార్లు 10 వికెట్లు తీశాడు.
England Cricket
సిడ్నీ బర్న్స్ ఈ గొప్ప రికార్డు ఇప్పటికీ బద్దలు కొట్టలేకపోయారు..
సిడ్నీ బర్న్స్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయిన రికార్డును కూడా నెలకొల్పాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 1913లో దక్షిణాఫ్రికాపై 150వ వికెట్ తీసి ఈ ఘనత సాధించాడు. బర్న్స్ తన 24వ మ్యాచ్‌లో 150 వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు.
అతను 40 సంవత్సరాల వయస్సులో ఒక టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్లు తీసుకున్నాడు, ఈ ఫార్మాట్‌లో 10 వికెట్లు తీసిన నాల్గవ అధిక వయస్సు కలిగిన క్రికెటర్‌గా నిలిచాడు.
సిడ్నీ బర్న్స్ అద్భుతమైన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్
సిడ్నీ బర్న్స్ పూర్తి పేరు సిడ్నీ ఫ్రాన్సిస్ బర్న్స్. అతను ఇంగ్లాండ్ లో ఏప్రిల్ 19న స్మెత్‌విక్, స్టాఫోర్డ్‌షైర్ లో జన్మించాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టుతో పాటు లంకాషైర్, వేల్స్, వార్విక్‌షైర్ రైట్‌విక్‌షైర్ జట్లకు ఆడాడు. రైట్‌షైర్ రైట్-ఆర్మ్ ఫాస్ట్-మీడియం, రైట్-ఆర్మ్ మీడియం బౌలర్ గా అద్భుతమైన క్రికెట్ కెరీర్ ను కొనసాగించాడు. 1901లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.
సిడ్నీ బర్న్స్ గణాంకాలు గమనిస్తే.. లాంకషైర్ లో జరిగిన లీగ్ లలో 6 సగటుతో 4069 వికెట్లు పడగొట్టాడు. మైనర్ కౌంటీ స్థాయిలో, స్టాఫోర్డ్షైర్ తరఫున, అతను 9 కంటే తక్కువ సగటుతో 1492 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 17 సగటుతో 719 వికెట్లు పడగొట్టాడు. అతని ఫస్ట్ క్లాస్ కెరీర్ 1894 నుంచి 1930 మధ్య 36 సంవత్సరాలు కొనసాగింది. జాతీయ జట్టు తరఫున టెస్టుల్లో కేవలం 27 టెస్టుల్లో 189 వికెట్లు పడగొట్టాడు.