ఆరేళ్ల క్రితం అలా, ఇప్పుడు ఇలా... విండీస్‌ టీమ్‌ని చంపేసిన ఫ్రాంఛైజీ క్రికెట్ మోజు! మనకి హెచ్చరికేనా..

First Published | Oct 21, 2022, 1:38 PM IST

1983 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా చేతుల్లో ఓడిన తర్వాత ఆ షాక్ నుంచి తేలుకోవడానికి వెస్టిండీస్ కొన్ని దశాబ్దాల కాలం పట్టింది. అయితే టీ20 క్రికెట్ వచ్చిన తర్వాత విండీస్‌కి పూర్వ వైభవం తిరిగి వచ్చింది. రెండు సార్లు పొట్టి ప్రపంచకప్ విజేతగా నిల్చిన విండీస్, గత రెండు ఎడిషన్లలోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యింది...

2012 టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెస్టిండీస్, 2016లో ఇంగ్లాండ్‌ని ఓడించి రెండోసారి పొట్టి ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా నిలిచిన విండీస్, గత ఏడాది యూఏఈలో జరిగిన టోర్నీని డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రారంభించింది...

అయితే గ్రూప్ స్టేజీలో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక చేతుల్లో ఓడిన వెస్టిండీస్... బంగ్లాదేశ్‌తో జరిగిన ఒక్క మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోగలిగింది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో వరుస ఓటముల కారణంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో విండీస్, అసోసియేట్ దేశాలతో పోటీపడాల్సిన స్థితికి చేరుకుంది..


తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్ చేతుల్లో 42 పరుగుల తేడాతో ఓడిన వెస్టిండీస్, ఐర్లాండ్ చేతుల్లో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. లెజెండరీ క్రికెటర్ల రిటైర్మెంట్ వన్డే, టెస్టు క్రికెట్‌లో వెస్టిండీస్ వైభవం తగ్గడానికి కారణమైతే ఇప్పుడు మాత్రం ఫ్రాంఛైజీ క్రికెట్ మోజే, విండీస్ పతనాన్ని శాసించింది...

క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, ఆండ్రూ రస్సెల్, సిమ్రాన్ హెట్మయర్, కిరన పోలార్డ్, సునీల్ నరైన్ వంటి భారీ హిట్టర్ల కారణంగా విండీస్ రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. అయితే ఫ్రాంఛైజీ క్రికెట్‌కి క్రేజ్ పెరిగిన తర్వాత చాలామంది ప్లేయర్లు, అంతర్జాతీయ క్రికెట్ కంటే ఈ ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు...

CPL Chris Gayle

దానికి తోడు కాంట్రాక్ విషయంలో విండీస్ బోర్డుకి, ప్లేయర్లకీ మధ్య తలెత్తిన విభేదాలు వెస్టిండీస్ క్రికెట్ టీమ్‌ని ఈ స్థితికి తీసుకొచ్చాయి. ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్ వంటి సీనియర్లను పూర్తిగా పక్కనబెట్టేసి భారీ మూల్యం చెల్లించుకుంది వెస్టిండీస్...

వెస్టిండీస్ క్రికెటర్లు క్రిస్ గేల్, కిరన్ పోలార్డ్ కలిసి టీ20ల్లో 26 వేల పరుగులు చేశారు. అయితే ఇందులో అంతర్జాతీయ క్రికెట్‌లో చేసినవి 3500 లోపే. కరేబియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్, బీబీఎల్, పీఎస్ఎల్, లంక ప్రీమియర్ లీగ్... ఇలా ప్రతీ ఫ్రాంఛైజీ లీగ్‌లో ఆడుతున్న విండీస్ ప్లేయర్లు... వెస్టిండీస్ టీమ్‌ని మాత్రం పట్టించుకోవడం లేదు...

Image credit: Getty

ఆరేళ్ల క్రితం రెండోసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్, ఇప్పుడు గ్రూప్ స్టేజీ కూడా దాటలేకపోవడం ఓ రకంగా టీమిండియాకి హెచ్చరికే. ఐపీఎల్ 2022 సీజన్‌ని 10 ఫ్రాంఛైజీలతో 74 రోజుల పాటు నడిపించిన బీసీసీఐ, మున్ముందు మ్యాచుల సంఖ్య, ఫ్రాంఛైజీల సంఖ్య పెంచాలని చూస్తోంది...

Image credit: PTI

ఇది ఇలాగే కొనసాగితే న్యూజిలాండ్ జట్టులో ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీశమ్.. ఫ్రాంఛైజీ క్రికెట్‌లో పాల్గొనేందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా... టీమిండియా ప్లేయర్లు కూడా ఐపీఎల్‌కి అందుబాటులో ఉండేందుకు భారత జట్టు ఆడే మ్యాచులకు దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు.. 
 

Latest Videos

click me!