కోహ్లీ, బట్లర్, రిజ్వాన్ కాదు.. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల వీరుడు అతడే : వీరేంద్ర సెహ్వాగ్

First Published | Oct 21, 2022, 12:19 PM IST

T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కు  అనుకూలించే  పిచ్ లపై  బ్యాటర్లు పండుగ చేసుకోవడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ  టోర్నీలో అత్యధిక పరుగులు సాధించే బ్యాటర్ ఎవరు..? 

టీ20 ప్రపంచకప్ లో అసలు సమరం  రేపటి నుంచి ప్రారంభం కానున్నది. ధనాధన్ గా ముగిసే టీ20లలో బ్యాటర్లదే హవా. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కు  అనుకూలించే  పిచ్ లపై  బ్యాటర్లు పండుగ చేసుకోవడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీ లో అత్యధిక పరుగులు చేసే బ్యాటర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. 

ప్రపంచ క్రికెట్ లో ప్రస్తుత ఫామ్ ను బట్టి చూసుకుంటే  ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో  నెంబర్ వన్ స్థానంలో ఉన్న పాకిస్తాన్ బ్యాటర్  మహ్మద్ రిజ్వాన్, రెండో స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ తో పాటు టీమిండియా మాజీ సారథి  విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ తో పాటు ఇంగ్లాండ్  సారథి  జోస్ బట్లర్, ఆసీస్  ఓపెనర్ డేవిడ్ వార్నర్, కివీస్ సారథి కేన్ విలియమ్సన్, సఫారీ బ్యాటర్లు క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్ ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. 
 


కానీ  ఈ మెగా టోర్నీలో వీళ్లెవరూ అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో ఉండరంటున్నాడు  టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.   పాకిస్తాన్ సారథి  బాబర్ ఆజమ్ ఈ మెగా టోర్నీలో మోస్ట్ రన్ స్కోరర్ గా ఉంటాడని చెబుతున్నాడు. 

ప్రపంచకప్ లో సూపర్-12 ప్రారంభానికి ముందు  వీరూ మాట్లాడుతూ.. ‘ఈ మెగా టోర్నీలో ఈసారి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ ఆజమ్  అగ్రస్థానంలో ఉంటాడు. అతడు అత్యద్భుతమైన బ్యాటర్. బాబర్ బ్యాటింగ్ చేస్తుంటే చూడటం బాగుంటుంది.  

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే ఫీలింగ్  బాబర్ బ్యాటింగ్ చూసినప్పుడు కలుగుతుంది..’ అని తెలిపాడు.  వీరూ తో పాటు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా ఈ మెగా టోర్నీలో మోస్ట్ రన్ స్కోరర్ గా బాబర్ ఉంటాడని  చెప్పడం గమనార్హం. 

అయితే వీరూ అంచనాలు నిజమవుతాయా..? అంటే మాత్రం అనుమానంగానే ఉంది. ఎందుకంటే గత కొద్దికాలంగా అతడు  పూర్తిస్థాయి ఫామ్ లో లేడు. ఆసియా కప్ లో వరుస వైఫల్యాలు ఎదుర్కున్నాడు. ఇటీవల  ఇంగ్లాండ్ తో సిరీస్ లో  ఫర్వాలేదనిపించినా  న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తో ముగిసిన  ముక్కోణపు సిరీస్ లో కూడా పెద్దగా రాణించలేదు. మరి  ఈ ప్రపంచకప్ లో బాబర్ ఎలా ఆడతాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  

ఇక ఈ మెగా టోర్నీలో భారత్ తో పాటు ఆతిథ్య ఆస్ట్రేలియా లు ఫైనల్ చేరతాయని వీరూ అంచనా వేశాడు.  ‘టీ20  ప్రపంచకప్ ఫైనల్ ఇండియా- ఆస్ట్రేలియా ల మధ్య జరుగుతుంది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియాను అదీ వారి స్వదేశంలో ఓడించడం అంత ఈజీ కాదు.  కానీ భారత జట్టు సమతూకంతో  ఉంది. ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం కూడా ఉన్నది.  ఇది భారత్ కు లాభిస్తుంది..’ అని   సెహ్వాగ్ అన్నాడు. 

Latest Videos

click me!