India , Mayank Yadav
Mayank Yadav : IND vs BAN 1st T20: టెస్ట్ సిరీస్ తర్వాత టీ20 సిరీస్ లో కూడా బంగ్లాదేశ్ పై భారత్ బలమైన ఆరంభం చేసింది. బౌలర్లతో పాటు బ్యాట్స్‌మెన్‌ల అద్భుతమైన ప్రదర్శనతో గ్వాలియర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై భారత్ అద్భుత విజయం అదుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు రెండో మ్యాచ్ అక్టోబర్ 9న ఢిల్లీలో జరగనుంది. అయితే, తన అరంగేట్రం మ్యాచ్ తో యంగ్ పేసర్ మయాంక్ యాదవ్ రికార్డుల మోత మోగించాడు.
India , Mayank Yadav
ఐపీఎల్ సంచలనం మయాంక్ యాదవ్ అరంగేట్రం
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. భారత్ సూపర్ బౌలింగ్ తో 127 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిలు మూడేసి వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లు తలా ఒక్కో వికెట్ తీసుకున్నారు. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది.
ఈ మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం క్యాప్‌లు అందుకున్నారు. ప్రపంచ క్రికెట్‌లో విధ్వంసం సృష్టించేందుకు తుఫాను బౌలర్ లా తన అరంగేట్రంతో హెచ్చరికలు పంపాడు మయాంక్ యాదవ్. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ప్రకంపనలు సృష్టించిన మయాంక్.. ప్రపంచ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వెంటనే తుఫాను సృష్టించాడు. ఐపీఎల్‌లో గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన ఈ బౌలర్.. గ్వాలియర్ టీ20 మ్యాచ్ లోనూ అదే జోరును చూపించాడు.
India , Mayank Yadav
అరంగేట్రం తొలి ఓవర్ లో ఒక్క పరుగు కూడా ఇవ్వని మయాంక్ యాదవ్
బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ తో మయాంక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా సరికొత్త రికార్డు సృష్టించాడు. అతని తొలి ఓవర్ మెయిడిన్ గా నిలిచింది. దీంతో ఈ ఘనత సాధించిన మూడో భారత్ బౌలర్ గా నిలిచాడు.
టీ20 కెరీర్ లో అరంగేట్రం తొలి ఓవర్ మెయిడిన్ వేసిన భారత్ బౌలర్లు
అజిత్ అగార్కర్ వర్సెస్ సౌతాఫ్రికా - జోబర్గ్ 2006
అర్ష్ దీప్ సింగ్ వర్సెస్ ఇంగ్లాండ్ - సౌతాంప్టన్ 2022
మయాంక్ యాదవ్ వర్సెస్ బంగ్లాదేశ్ - గ్వాలియర్ 2024
Mayank Yadav
టీమిండియా యంగ్ బౌలింగ్ స్పీడ్ గన్ మయాంక్ యాదవ్
పవర్‌ప్లే చివరి ఓవర్ (ఆరో ఓవర్)లో మయాంక్ యాదవ్‌ను బౌలింగ్ చేయమని కెప్టెన్ సూర్యకుమార్ బాల్ అందించాడు. అంతకుముందు అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీసి బంగ్లాదేశ్ కు బిగ్ షాక్ ఇచ్చి ఆ జట్టు పరిస్థితిని మరింత దిగజార్చాడు. మయాంక్ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు అందరి చూపు అతని స్పీడ్ పైనే ఉంది. అతను కూడా నిరాశ చూపించకుండా సూపర్ బౌలింగ్ తో అదరగొట్టాడు. తొలి ఓవర్‌లో గంటకు 145 కిలోమీటర్ల వేగాన్ని రెండుసార్లు దాటాడు. అతని వేగవంతమైన బంతి గంటకు 147.6 కిలోమీటర్లుగా నమోదైంది.
అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో తన తొలి ఓవర్‌లో మయాంక్ యాదవ్ బౌలింగ్ వేగం
మొదటి బంతి - 141.9 kph
రెండవ బంతి - 145.1 kph (వికెట్)
మూడవ బంతి - 138.0 kph
నాల్గవ బంతి - 147.3 kph
ఐదవ బంతి - 135.2 kph
ఆరవ బంతి - 147.6 kph
Who is Mayank Yadav
మయాంక్ యాదవ్ తొలి వికెట్ గా మహ్మదుల్లా
మయాంక్ తన వేగంతో బంగ్లాదేశ్ అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ మహ్మదుల్లాకు షాక్ ఇచ్చాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో తన మొదటి వికెట్ గా ఔట్ చేశాడు. మహ్మదుల్లా 2 బంతుల్లో 1 పరుగు చేసి మయాంక్ యాదవ్ బౌలింగ్ లో వాషింగ్టన్ సుందర్ చేతికి చిక్కాడు. మయాంక్ వేసిన 146 కి.మీ వేగాన్ని నియంత్రించలేక సిక్సర్ కొట్టే ప్రయత్నంలో ఔటయ్యాడు.
కాగా, ఈ మ్యాచ్ లో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఆటతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. హార్దిక్ తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. హార్దిక్ పాండ్యా మ్యాచ్ ముగింపు సిక్సర్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.