
మీ దగ్గర రూ.10 లక్షలు ఉన్నాయని అనుకుందాం. ఆ డబ్బుతో వెంటనే కారు కొనకుండా, మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో రెండేళ్ల పాటు పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సగటున 12 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే అంచనాతో లెక్కిస్తే... పెట్టుబడి రూ.10,00,000, రెండేళ్ల కాలానికి సగటు రాబడి 12 శాతంగా అంచనా వేసినా రెండేళ్ల తర్వాత మీ పెట్టుబడి సుమారు రూ.12.5 లక్షలకు చేరుకునే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏ పని చేయకుండానే మీ డబ్బు సుమారు రూ.2.5 లక్షలు పెరిగినట్లే.
రెండేళ్ల తర్వాత మీ దగ్గర ఉన్న రూ.12.5 లక్షలను పూర్తిగా తీసేయాల్సిన అవసరం లేదు. దానిని సిస్టమిక్ విత్‌డ్రా ప్లాన్ (SWP)లో ఇన్వెస్ట్ చేయండి. అంటే ప్రతి నెల అవసరమైనంత మొత్తాన్ని మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగతా డబ్బు మాత్రం పెట్టుబడిగానే కొనసాగుతుంది. ఇప్పుడు రూ.10 లక్షల విలువైన కారు కొనుగోలు చేశారని అనుకుందాం. 7 సంవత్సరాల లోన్ తీసుకుంటే నెలకు సుమారు రూ.25 వేల EMI రావచ్చు.
ప్రతి నెల మీ SWP నుంచి రూ.20 వేలు తీసుకుని EMIకి ఉపయోగించండి. మీ జేబు నుంచి చెల్లించాల్సింది కేవలం రూ.5 వేలు మాత్రమే. అంటే EMI మొత్తం మీరు భరించడం కాదు... మీ పెట్టుబడి కూడా మీకు తోడుగా పనిచేస్తుంది. డబ్బు పూర్తిగా అయిపోదు.. కంపౌండింగ్ మ్యాజిక్ ఇక్కడే కనిపిస్తుంది. చాలామందికి ఒక సందేహం వస్తుంది. ప్రతి నెల రూ.20 వేలు తీసుకుంటే పెట్టుబడి పూర్తిగా ఖాళీ అయిపోదా?
SWP ద్వారా డబ్బు తీసుకుంటున్నప్పటికీ, మిగిలిన మొత్తం మార్కెట్లోనే పెట్టుబడిగా కొనసాగుతుంది. దానిపై మళ్లీ రాబడి వస్తూనే ఉంటుంది. దీనినే కంపౌండింగ్ ప్రభావం అంటారు. రఫ్ అంచనా ప్రకారం... ప్రారంభ పెట్టుబడి రూ.12.5 లక్షలు అయితే మీరు 7 ఏళ్లపాటు ప్రతీ నెల SWP ద్వారా రూ.20,000 విత్‌డ్రా చేసుకుంటే. ఈ మొత్తం కాలం తర్వాత కూడా సుమారు రూ.8 లక్షల వరకు పెట్టుబడి మిగిలి ఉండే అవకాశం ఉంది. మార్కెట్ పరిస్థితులు, రాబడిని బట్టి ఈ మొత్తం ఎక్కువగానూ, తక్కువగానూ ఉండొచ్చు. అంటే మీరు కారు కూడా వాడుకున్నారు... అదే సమయంలో మీ పెట్టుబడిలో గణనీయమైన మొత్తం కూడా మిగిలే అవకాశం ఉంది.
రెండేళ్లకు బదులుగా మూడేళ్లు వేచి ఉండగలిగితే పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడికి మరో ఏడాది అదనంగా కంపౌండింగ్ పనిచేస్తుంది. దీంతో కారుకు అవసరమైన EMIలో ఇంకా ఎక్కువ భాగాన్ని పెట్టుబడే భరించే అవకాశం ఉంటుంది. చివరికి మీ చేతి నుంచి వెళ్లే డబ్బు మరింత తగ్గుతుంది. కారు కొనడం తప్పు కాదు. కానీ కొన్ని నెలలు లేదా రెండుమూడేళ్లు ఓపిక పట్టడం చాలా పెద్ద ఆర్థిక ప్రయోజనాన్ని ఇవ్వొచ్చు. ఈ చిన్న నిర్ణయం భవిష్యత్తులో మీ సంపదను పెంచడంలో కీలకంగా మారుతుంది.
ఈ విధానం ఇప్పటికే రూ.10 లక్షలు చేతిలో ఉన్నవారికి మాత్రమే సరిపోతుంది. కారు కొనడానికి పర్సనల్ లోన్ తీసుకుని, ఆ డబ్బును మ్యూచువల్ ఫండ్‌లో పెట్టడం సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే లోన్ వడ్డీ భారం, మార్కెట్ రిస్క్ రెండూ కలిసి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. మరొక విషయం గుర్తుంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. ప్రతి సంవత్సరం 12 శాతం రాబడే వస్తుందని ఎవరూ హామీ ఇవ్వలేరు. ఇక్కడ చెప్పిన లెక్కలు కేవలం అవగాహన కోసం ఇచ్చిన రఫ్ అంచనా మాత్రమే. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. వెంటనే కొనాలనే ఆత్రం కంటే, కొంతకాలం ఓపికతో పెట్టుబడి పెట్టడం చాలా సందర్భాల్లో మంచి ఆర్థిక నిర్ణయంగా మారుతుంది. డబ్బును ముందుగా మీ కోసం పనిచేయించగలిగితే, తర్వాత ఆ డబ్బుతో మీ కలలను నెరవేర్చుకోవడం మరింత సులభమవుతుంది.
గమనిక: ఈ కథనం కేవలం ఆర్థిక అవగాహన కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.