
BYD Fang Cheng Bao Ti 9 SUVని మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర 2,79,900 యువాన్లు (సుమారు 41,800 అమెరికన్ డాలర్లు). మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ. 38 లక్షలకుపైమాటే. ఈ SUV డిజైన్ విషయానికి వస్తే బాక్సీ ఆకారంలో దృఢంగా కనిపించేలా రూపొందించారు. ముందు భాగంలో ఒక చివరి నుంచి మరో చివరి వరకు విస్తరించిన లైటింగ్ డిజైన్ ఆకట్టుకుంటుంది. వెనుక భాగంలో నిలువుగా ఉండే ప్రత్యేక ఆకారపు టెయిల్ లైట్లు ఏర్పాటు చేశారు. ఈ కారు పొడవు 5,270 మి.మీ., వెడల్పు 1,999 మి.మీ., ఎత్తు 1,850 మి.మీ. (కొన్ని వివరాల్లో 1,880 మి.మీ.)గా ఉంది. వీల్‌బేస్ 3,130 మి.మీ. ఆరు రకాల బయటి రంగుల్లో, మూడు రకాల ఇంటీరియర్ రంగుల కలయికల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అవసరాన్ని బట్టి 2,000 కిలోల బరువును లాగే సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ టో హిచ్‌ను కూడా అదనంగా అమర్చుకోవచ్చు.
ఈ SUVలో BYD తొలిసారిగా DMS సూపర్ హైబ్రిడ్ ఆల్‌రౌండ్ ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసింది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చారు. ఇవి కలిపి గరిష్ఠంగా 400 కిలోవాట్ల (536 HP) శక్తిని ఉత్పత్తి చేస్తాయి. దీంతో కేవలం 4.8 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు వెనుక చక్రాల స్టీరింగ్, వీల్ టార్క్ నియంత్రణ, డిఫరెన్షియల్ లాక్, ఎలక్ట్రానిక్ లిమిటెడ్ స్లిప్ వంటి సాంకేతికతలను అందించారు. ఇందులో 'లెపార్డ్ టర్న్' అనే ప్రత్యేక టర్నింగ్ ఫీచర్ కూడా ఉంది. ఈ టెక్నాలజీల సాయంతో 5.3 మీటర్ల పొడవున్న ఈ పెద్ద SUV కేవలం 3.5 మీటర్ల టర్నింగ్ రేడియస్‌తో మలుపు తిరగగలదని కంపెనీ పేర్కొంది.
ఈ కారు రేంజ్ విషయంలోనూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇందులో 66.48 kWh సామర్థ్యం కలిగిన LFP బ్లేడ్ 2.0 బ్యాటరీని అమర్చారు. పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు కేవలం విద్యుత్‌తోనే 400 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. పెట్రోల్, విద్యుత్ రెండింటి సాయంతో మొత్తం 1,630 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. ఇవి చైనా CLTC పరీక్షా ప్రమాణాల ప్రకారం వెల్లడించిన గణాంకాలు. బ్యాటరీలో ఛార్జింగ్ తగ్గిపోయిన పరిస్థితుల్లో 100 కిలోమీటర్లకు సుమారు 6.4 లీటర్ల ఇంధనాన్ని వినియోగిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. కేవలం 9 నిమిషాల్లోనే బ్యాటరీని 10 శాతం నుంచి 97 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.
ఈ SUVలో అత్యంత ఆసక్తికరమైన ఫీచర్ మడతపెట్టే స్టీరింగ్ వీల్. BYD దీన్ని 'ఫోల్డబుల్ స్మార్ట్ క్యాబిన్'గా పరిచయం చేసింది. స్టీరింగ్ వీల్‌ను 0 నుంచి 180 డిగ్రీల వరకు మడతపెట్టవచ్చు. రోబోటిక్స్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ప్రత్యేక హింజ్‌లు, మోటార్లతో ఇది పనిచేస్తుంది. సుమారు 10 సెకన్లలో స్టీరింగ్ వీల్‌ను మడతపెట్టవచ్చు. అయితే కారు ప్రయాణిస్తున్నప్పుడు స్టీరింగ్‌ను మడతపెట్టే అవకాశం లేదు. వాహనం పూర్తిగా ఆగినప్పుడు మాత్రమే దీన్ని మడతపెట్టవచ్చు. డ్రైవర్ విశ్రాంతి తీసుకునే సమయంలో ఎక్కువ స్థలం అందించడమే దీని ప్రధాన ఉద్దేశం.
క్యాబిన్‌లో 30 అంగుళాల పనోరమిక్ స్క్రీన్, వెనుక ప్రయాణికుల కోసం 21.4 అంగుళాల సీలింగ్ స్క్రీన్ ఉన్నాయి. నప్పా లెదర్ సీట్లు, రెండో వరుసలో జీరో గ్రావిటీ సీట్లు, అన్ని వరుసల్లో వెంటిలేషన్, హీటింగ్, మసాజ్ సదుపాయాలు కల్పించారు. వీటితో పాటు 11.5 లీటర్ల సామర్థ్యం ఉన్న ఫ్రిజ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెనుక ప్రయాణికుల కోసం ప్రత్యేక టేబుళ్లను అందించారు.
సాంకేతికత పరంగా కూడా BYD Ti 9లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో 'గాడ్స్ ఐ బి' (God's Eye B) ఇంటెలిజెంట్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్‌ను అందించారు. LiDAR సెన్సార్ సాయంతో పనిచేసే ఈ వ్యవస్థ డ్రైవర్‌కు డ్రైవింగ్‌లో సహాయపడుతుంది. రోడ్డుపై ఉన్న వాహనాలు, ఇతర అడ్డంకులను గుర్తించేందుకు అధునాతన సెన్సార్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. భద్రత కోసం TSC హైస్పీడ్ టైర్ బ్లోఅవుట్ స్టెబిలైజేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రయాణ సమయంలో అధిక వేగంతో టైర్ పేలినప్పుడు వాహనంపై నియంత్రణ కోల్పోకుండా సహాయపడటమే దీని ఉద్దేశం. ముందు చక్రాలకు సిక్స్ పిస్టన్ బ్రేక్ కాలిపర్లను అమర్చారు. మొత్తంగా విలాసవంతమైన ఫీచర్లు, శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్, ఎక్కువ రేంజ్, ఆధునిక భద్రతా సదుపాయాలతో BYD Fang Cheng Bao Ti 9 చైనా మార్కెట్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.