8వ వేతన సంఘంపై ఉద్యోగులకు ఎదురయ్యే సాధారణ ప్రశ్నలు... వాటికి జవాబులు (FAQs)
ప్రశ్న : 8వ వేతన సంఘం ఎప్పుడు ఏర్పడుతుంది?
జవాబు : ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ప్రకటించింది (జనవరి 2025లో).. కానీ నోటిఫికేషన్ జారీ కాలేదు. ప్రభుత్వం నవంబర్ 2025 చివరి నాటికి దీనిని ఏర్పాటు చేస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి.
ప్రశ్న : 8వ వేతన సంఘం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?
జవాబు : ప్రభుత్వం సమయానికి కమిషన్‌ను ఏర్పాటు చేస్తే దాని సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రావచ్చు. అయితే జాప్యం జరిగితే ప్రభుత్వం వాటిని రెట్రోయాక్టివ్‌గా (గత తేదీ నుంచి వర్తింపజేయడం) కూడా అమలు చేయవచ్చు.
ప్రశ్న : 8వ వేతన సంఘం వల్ల ఎవరికి ప్రయోజనం?
జవాబు : ఈ కమిషన్ వల్ల దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారు. మొత్తం మీద 1.15 కోట్ల మందికి పైగా జీతాలు, పెన్షన్ విధానం ప్రభావితం అవుతుంది.
ప్రశ్న : 8వ వేతన సంఘంతో జీతం ఎంత పెరగవచ్చు?
జవాబు : ఖచ్చితమైన సంఖ్య కమిషన్ సిఫార్సుల తర్వాతే తెలుస్తుంది... కానీ 7వ వేతన సంఘంలో లాగే ప్రాథమిక వేతనంలో 30% నుంచి 35% వరకు పెరుగుదల ఉండవచ్చని అంచనా.
ప్రశ్న : 8వ వేతన సంఘంలో ఉద్యోగుల జీతాలు వెంటనే పెరుగుతాయా?
జవాబు : లేదు, ముందుగా కమిషన్ సిఫార్సులు చేస్తుంది, ఆ తర్వాత ప్రభుత్వం వాటిని ఆమోదిస్తుంది. జీతాల పెంపు అమలయ్యాక ఉద్యోగులకు బకాయిలు (Arrears) కూడా చెల్లించవచ్చు.