8వ వేతన సంఘంపైనే ఉద్యోగుల ఆశలన్నీ..
జనవరి 1, 2026 నుండి 8వ వేతన సంఘం అమలులోకి వస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ డిమాండ్లను పే కమీషన్ ముందుంచేందుకు ఉద్యోగులు సిద్దమయ్యారు. ప్రభుత్వం కూడా వేతనసంఘం ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్ లో పే కమీషన్ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలతో పాటు రాష్ట్రాల నుండి అభిప్రాయాలు కోరినట్లు... త్వరలోనే కమీషన్ ను అధికారికంగా నోటిఫై చేస్తామన్నారు. తర్వాత ఫే కమీషన్ ఛైర్మన్, సభ్యులను నియమించనున్నట్లు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం 7వ వేతన సంఘం కొనసాగుతోంది. 8వ వేతన సంఘం సిపార్సులు అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు సవరించబడతాయి. తద్వారా దాదాపు 45 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పింఛనుదారులు ప్రయోజనాన్ని పొందుతారు.
పాత పింఛను పథకం (OPS) పునరుద్ధరణ, ఉచిత వైద్యం, పిల్లలకు విద్యకు ఆర్థిక సహాయం వంటి అనేక సంస్కరణలను కొత్త వేతనసంఘం సిపార్సుల్లో ఉండాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ శాఖలు ప్రాథమిక ప్రణాళిక దశలో భాగంగా ఈ ప్రతిపాదనలను సమీక్షిస్తున్నాయి.