ఐఐటీలో చ‌దివి నెయ్యి వ్యాపారం మొద‌లుపెట్టాడు.. రూ.1,000 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు

Published : Nov 18, 2026, 07:03 AM IST

Success story: సాధారణంగా ఐఐటీలో చదివినవారు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేయాలని కోరుకుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడు. చిన్న 2BHK ఫ్లాట్‌లో నెయ్యి, నూనెల విక్రయాలు మొద‌లు పెట్టి భారీ వ్యాపారాన్ని సృష్టించాడు.

PREV
15
ఐఐటీలో చదువు.. గోల్డ్‌మన్ సాక్స్‌లో ఉద్యోగం

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌కు చెందిన కుల్దీప్ పరేవా ఓ రైతు కుటుంబంలో జన్మించారు. ఐఐటీ గువాహటిలో ఉన్నత విద్యను పూర్తి చేసిన ఆయనకు ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ గోల్డ్‌మన్ సాక్స్‌లో ఉద్యోగం లభించింది. మంచి జీతం, సౌకర్యవంతమైన ఉద్యోగం ఉన్నప్పటికీ ఆయనకు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉండేది. ఈ క్రమంలో కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. 2020లో తనతో పాటు ఐఐటీ గువాహటిలో చదువుకున్న అఖిల్ కన్సల్, ఆయుషి ఖండేల్వాల్‌తో కలిసి 'అన్వేషణ' (Anveshan) పేరుతో కంపెనీని ప్రారంభించారు. ఈ ఇద్దరూ గతంలో గోల్డ్‌మన్ సాక్స్‌లోనే పనిచేశారు. ముగ్గురూ కలిసి సహజ పద్ధతుల్లో తయారయ్యే ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

25
రెండు గదుల ఫ్లాట్‌ నుంచే వ్యాపారం ప్రారంభం

అన్వేషణ కంపెనీ ప్రారంభించడానికి భారీ కార్యాలయాలు, పెద్ద గోదాములు ఏర్పాటు చేయలేదు. బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉన్న కుల్దీప్‌ 2BHK ఫ్లాట్‌నే మొదటి కార్యాలయంగా మార్చుకున్నారు. ఇంట్లోని ఓ గదిలో సరుకులను నిల్వ చేసేవారు. లివింగ్ రూమ్‌లో నెయ్యి, నూనె ఉత్పత్తులను ప్యాకింగ్ చేసేవారు. మరో భాగాన్ని చిన్న గోదాముగా ఉపయోగించేవారు. ముగ్గురు వ్యవస్థాపకులు నేలపై కూర్చుని స్వయంగా ఆర్డర్లను ప్యాక్ చేసేవారు. ఒక్కోసారి రోజుకు దాదాపు 200 ఆర్డర్ల వరకు చేతులతోనే ప్యాకింగ్ చేసేవారు. ప్యాకింగ్ పూర్తయిన తర్వాత స్కూటర్‌పై వెళ్లి దుకాణాలకు సరుకులను అందించేవారు. ఇలా ఎలాంటి భారీ పెట్టుబడులు లేకుండా, చిన్న స్థాయిలో మొదలైన వ్యాపారం క్రమంగా వినియోగదారుల ఆదరణ పొందింది.

35
దేశీ నెయ్యి, కోల్డ్ ప్రెస్డ్ నూనెలతో ప్రత్యేక గుర్తింపు

అన్వేషణ మొదట్లో ప్రధానంగా బిలోనా పద్ధతిలో తయారు చేసిన దేశీ నెయ్యి, కోల్డ్ ప్రెస్డ్ నూనెల విక్రయాలపై దృష్టి పెట్టింది. బిలోనా పద్ధతిలో పెరుగును చిలికి వెన్న తీసి, దాని నుంచి నెయ్యిని తయారు చేస్తారు. ఈ సంప్రదాయ విధానంలో తయారయ్యే నెయ్యికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే కోల్డ్ ప్రెస్డ్ నూనెలను విత్తనాలు, గింజలను చెక్క గానుగలు లేదా ప్రత్యేక యంత్రాల ద్వారా ఒత్తిడి చేసి తయారు చేస్తారు. ఈ విధానంలో నూనె తీయడానికి అధిక వేడిని ఉపయోగించరు. మార్కెట్లో సహజ పద్ధతుల్లో తయారయ్యే ఆహార ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుండటాన్ని కంపెనీ వ్యవస్థాపకులు గుర్తించారు. దీంతో నెయ్యి, నూనెలతో ప్రారంభమైన ఉత్పత్తుల జాబితాను క్రమంగా విస్తరించారు. ప్రస్తుతం అన్వేషణ బ్రాండ్ కింద తేనె, మసాలా దినుసులు, పిండి, వివిధ రకాల విత్తనాలు, ఇతర సంప్రదాయ ఆహార పదార్థాలను కూడా విక్రయిస్తున్నారు.

45
250 మందికి పైగా రైతులతో అనుబంధం.. దేశవ్యాప్తంగా వ్యాపారం

రెండు గదుల ఫ్లాట్‌లో ప్రారంభమైన అన్వేషణ వ్యాపారం ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించింది. కుల్దీప్ పరేవా లింక్డ్‌ఇన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కంపెనీ 250 మందికి పైగా రైతులతో కలిసి పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా 20కి పైగా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసింది. కంపెనీలో 150 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మిది రాష్ట్రాల్లో కంపెనీకి 16 తయారీ కేంద్రాలు ఉన్నాయి. కంపెనీ సొంత వెబ్‌సైట్‌తో పాటు ఈ-కామర్స్ సంస్థలు, క్విక్ కామర్స్ యాప్‌ల ద్వారా కూడా ఉత్పత్తులను విక్రయిస్తోంది.

ముఖ్యంగా చిన్న పట్టణాల్లోని వినియోగదారుల నుంచి కూడా అన్వేషణ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోంది. రైతులకు మెరుగైన మార్కెట్ కల్పించడం, నాణ్యమైన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించడం కంపెనీ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

55
రూ.430 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు చేరిన కంపెనీ విలువ

అన్వేషణ వ్యాపారం విస్తరించడంతో పెట్టుబడిదారుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. 2025 ఏప్రిల్‌లో విప్రో కన్స్యూమర్ కేర్ వెంచర్స్, డీఎస్‌జీ కన్స్యూమర్ పార్ట్‌నర్స్, టైటాన్ క్యాపిటల్ వంటి సంస్థల నుంచి కంపెనీ రూ.48 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. ఈ సమయంలో కంపెనీ విలువ సుమారు రూ.430 కోట్లుగా అంచనా వేశారు. కంపెనీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఎంట్రాకర్ రిపోర్ట్‌ ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అన్వేషణ ఆదాయం రూ.46.84 కోట్లుగా ఉండగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.77.08 కోట్లకు చేరింది.

ఆ తర్వాత 2026 జూన్‌లో జరిగిన సిరీస్-బి ఫండింగ్ రౌండ్‌లో కంపెనీ మరో రూ.150 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. 2026 మార్చిలో వచ్చిన ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఈ పెట్టుబడుల దశలో కంపెనీ విలువ రూ.900 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల మధ్యకు చేరినట్లు అంచనా.

ఒకప్పుడు చిన్న ఫ్లాట్‌లో నేలపై కూర్చుని ఆర్డర్లు ప్యాక్ చేసిన ముగ్గురు యువకులు.. నేడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫుడ్ బ్రాండ్‌ను నిర్మించారు. సరైన ఆలోచన, నాణ్యమైన ఉత్పత్తులు, రైతులతో భాగస్వామ్యం ఉంటే చిన్న స్థాయి నుంచే పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చని అన్వేషణ ప్రయాణం నిరూపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories