Stock Market: దేశీయ షేర్ మార్కెట్‌లో ఐటీ రంగం భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనలు, ప్రపంచ మార్కెట్లలో అస్థిరత కారణంగా ఐటీ స్టాక్స్‌లో వరుసగా అమ్మకాలు కొనసాగుతున్నాయి.
ఐటీ రంగం మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పడిపోయింది. సుమారు 250 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ రంగంలో ఒక్కసారిగా అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్కెట్ విలువ 2020 స్థాయిల కంటే దిగువకు చేరి రూ.10 లక్షల కోట్లకు దిగువకు చేరింది. ఇది పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచింది.
25
TCS, Infosys, HCL షేర్ల పతనం
గత ఎనిమిది రోజుల్లో TCS దాదాపు 19 శాతం పడిపోయింది. Infosys షేర్లు 21 శాతం వరకు క్షీణించగా, HCL Technologies షేర్లు సుమారు 17 శాతం తగ్గాయి. ఒక్క శుక్రవారం రోజే TCS దాదాపు 6 శాతం క్షీణించింది. నిఫ్టీ ఐటీ సూచీ కూడా సుమారు 5 శాతం పడిపోయింది.
35
AI భయం ఎందుకు?
ఈ పతనం ఏదో ఒక కంపెనీ ఫలితాల కారణంగా కాదు. వేగంగా అభివృద్ధి చెందుతున్న AI టెక్నాలజీ సంప్రదాయ ఐటీ సేవల వ్యాపార మోడల్‌ను మార్చవచ్చనే భయం పెరిగింది. అమెరికాకు చెందిన AI స్టార్టప్ ఆంథ్రోపిక్ విడుదల చేసిన కొత్త టూల్ కూడా మార్కెట్‌లో ఆందోళన కలిగించింది. భవిష్యత్తులో ఐటీ ఉద్యోగాలు, ప్రాజెక్టులు తగ్గవచ్చనే భావన పెట్టుబడిదారులను వెనక్కు నెడుతోంది.
అమెరికా నుంచి వచ్చిన బలమైన ఉద్యోగ గణాంకాలు అక్కడ వడ్డీ రేట్లు త్వరగా తగ్గకపోవచ్చనే సంకేతాలు ఇచ్చాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే గ్రోత్, టెక్నాలజీ స్టాక్స్‌పై ఒత్తిడి పెరుగుతుంది. భారత ఐటీ కంపెనీల ఆదాయంలో పెద్ద భాగం అమెరికా క్లయింట్ల నుంచే వస్తుంది. అమెరికాలో టెక్నాలజీ ఖర్చులు తగ్గితే భారత కంపెనీల ఆదాయం కూడా ప్రభావితం అవుతుంది. దీంతో కంపెనీలు సహజంగానే ఉద్యోగులను తగ్గించుకునే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
55
ముందున్న సవాళ్లు
AI వేగంగా మారుతున్న పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు తమ వ్యాపార విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా సేవలను అభివృద్ధి చేస్తేనే దీర్ఘకాలంలో నిలదొక్కుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న భయాలు తాత్కాలికమా, లేక దీర్ఘకాల ప్రభావమా అన్నది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది. మొత్తంగా చూస్తే, AI ప్రభావం, అమెరికా ఆర్థిక పరిస్థితులు, గ్లోబల్ అనిశ్చితి అన్నీ కలిసి భారత ఐటీ స్టాక్స్‌పై భారీ ఒత్తిడిని తెచ్చాయి. దీంతో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.