
వెండి ధరలు మళ్లీ మెరుస్తున్నాయి. ఈ సంవత్సరం వెండి ధరలు అసాధారణంగా పెరిగాయి. వచ్చే ఏడాది కూడా అదే మెరుపును కొనసాగించే అవకాశం ఉంది. వెండి ధరలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఒక ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. అదే వెండి కిలో ధర ₹2 లక్షల మార్కును ఎప్పుడు దాటుతుంది? వచ్చే ఏడాది వెండి ధర ₹2 లక్షలకు చేరుకుంటుందా? లేక తగ్గుతుందా? మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
వెండి ధరలు వచ్చే ఏడాది ప్రారంభంలోనే కిలో ₹2 లక్షల జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకుంటే 2025లో వెండి పెట్టుబడిదారులకు గణనీయమైన రాబడిని ఇచ్చింది. రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయి. 2026లో కూడా పెట్టుబడిదారుల ముఖాల్లో ఆనందం తీసుకువస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కేడియా అడ్వైజరీ, పలు మార్కెట్ రిపోర్టుల ప్రకారం.. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్)లో కేవలం 10 రోజుల్లోనే వెండి ధర 20% పెరిగింది. ఇది వెండి ధరలలోని బలమైన పెరుగుదల ధోరణిని స్పష్టంగా సూచిస్తుంది.
వివిధ సాంకేతిక సూచికలు వెండికి బలమైన పెరుగుదల ధోరణిని సూచిస్తున్నాయి. 'కప్-అండ్-హ్యాండిల్ బ్రేకౌట్' (Cup-and-handle breakout) ప్రకారం, వెండి త్వరలోనే ₹1,93,000 మార్కును చేరుకునే అవకాశం ఉంది. ప్రపంచ పరిస్థితులు అనుకూలంగా ఉంటే, వెండి ధర ₹2,06,000 స్థాయిని కూడా తాకవచ్చు.
ఇక నేటి వెండి ధరల విషయానికొస్తే, గుడ్ రిటర్న్స్ (Good Returns) సమాచారం ప్రకారం, కిలో వెండి ధర ప్రస్తుతం ₹1,91,000 వద్ద ఉంది. ఇది అంతకుముందు సెషన్‌తో పోలిస్తే ఏకంగా ₹3,000 పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ పెరుగుదల మార్కెట్‌లో వెండికి ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది.
వచ్చే ఏడాది ప్రారంభంలోనే వెండి ధర ₹2 లక్షల మార్కును అధిగమించవచ్చని కమోడిటీ నిపుణులు సూచిస్తున్నారు. వెండి ధరల పెరుగుదలకు అనేక అంశాలు కారణమవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా, యూఎస్ జియోలాజికల్ సర్వే (US Geological Survey) వెండిని కీలక ఖనిజాల జాబితాలో చేర్చడం, టారిఫ్ ఆందోళనలు, డాలర్ ఇండెక్స్ విలువ తగ్గడం, సరఫరా అంతరాయాలు, పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం వంటివి ఉన్నాయి.
అంతేకాకుండా, వెండి పారిశ్రామిక వినియోగం కూడా నిరంతరం పెరుగుతుండటం ధరల పెరుగుదలకు కారణాలుగా ఉన్నాయి. అందుకే వెండి మార్కెట్‌కు బలమైన దిశగా ముందుకు సాగుతోంది.
పారిశ్రామిక డిమాండ్ వెండి ధరల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తోంది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల వంటి గ్రీన్ టెక్నాలజీ రంగాలలో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. దీనితో పాటు, సాంకేతిక రంగంలో పెరుగుతున్న అవసరాల కారణంగా వెండికి డిమాండ్ ఎల్లప్పుడూ బలంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఈ కారణాల వల్ల, వెండి సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ డిమాండ్, సరఫరా అంతరం ధరల పెరుగుదలకు ప్రధాన చోదక శక్తిగా మారింది.
నిపుణులు మొదటి నుంచీ వెండిలో పెట్టుబడి పెట్టాలని సలహా ఇస్తున్నారు. ప్రముఖ అమెరికన్ వ్యాపారవేత్త, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) అనే ప్రసిద్ధ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) సైతం వెండి ప్రస్తుతం ఉత్తమ పెట్టుబడి ఎంపిక అని విశ్వసిస్తున్నారు.
వెండి పారిశ్రామిక వినియోగం వేగంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ల నుండి ఎలక్ట్రిక్ కార్ల వరకు అన్నింటిలోనూ వెండిని ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అందువల్ల, వెండికి డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుందనీ, దాని ధరలు పెరుగుతూనే ఉంటాయని ఆయన అన్నారు. వెండి ధరలు నాలుగు రెట్లు పెరుగుతాయని కూడా ఆయన అంచనా వేశారు. ఇలా అన్ని కోణాల నుంచి వెండిని పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారుస్తోంది.