Silver : వెండి దెబ్బకొట్టిందిరా సామీ.. భారీగా పడిపోయిన ధరలు.. మార్కెట్ లో ఏం జరుగుతోంది?

Published : Dec 29, 2025, 04:34 PM IST

Silver Price Crash : సోమవారం వెండి ధరలు ఎంసీఎక్స్ మార్కెట్లో రూ. 2.54 లక్షల ఆల్ టైమ్ రికార్డును తాకిన గంటల వ్యవధిలోనే భారీగా పతనమయ్యాయి. ఏకంగా రూ. 21,500 తగ్గింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో వెండి ధరలు తగ్గాయని మార్కెట్ నిపుణులు చెప్పారు. 

PREV
15
వెండి కొనేవారికి షాక్: రూ. 2.5 లక్షలు దాటిన ధర.. గంటలోనే సీన్ రివర్స్!

బులియన్ మార్కెట్ లో సోమవారం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయిని తాకిన కొద్దిసేపటికే భారీగా పతనమయ్యాయి. ఇన్వెస్టర్లను గందరగోళానికి గురిచేశాయి. రోజు ప్రారంభంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధర చరిత్ర సృష్టించింది. ఒకానొక దశలో ధర కిలోకు రూ. 2.54 లక్షల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 2025 సంవత్సరంలో చివరి ట్రేడింగ్ సెషన్లు జరుగుతుండటంతో వెండి సరికొత్త రికార్డు నెలకొల్పుతుందని అందరూ భావించారు.

అయితే, ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. మార్కెట్లో అకస్మాత్తుగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. కేవలం ఒక్క గంట వ్యవధిలోనే వెండి ధర రూ. 21,500 మేర కుప్పకూలింది. ఉదయం రూ. 2,54,174 పలికిన ధర, ఆ తర్వాత వేగంగా కిందకు దిగివచ్చి రూ. 2,32,663 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అంటే సోమవారం ఒక్కరోజే రూ. 21 వేలకు పైగా ధర తగ్గడం గమనార్హం.

25
వెండి ధరలు తగ్గడానికి కారణాలు ఏమిటి?

ఈ ఆకస్మిక వెండి ధరల పతనానికి కేవలం ఒక కారణం మాత్రమే లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ ధరలపై స్పష్టంగా కనిపించింది. గ్లోబల్ మార్కెట్లో వెండి ధర మొదట ఔన్సుకి 80 డాలర్ల స్థాయికి చేరుకుంది. కానీ ఆ తర్వాత వేగంగా 75 డాలర్ల దిగువకు పడిపోయింది.

దీనికి తోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సంకేతాలు వెలువడటం కూడా మార్కెట్‌ను ప్రభావితం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చల్లో రష్యా, ఉక్రెయిన్ కాల్పుల విరమణకు సంబంధించి సానుకూల సంకేతాలు వచ్చాయి. శాంతి చర్చలు తుది దశకు చేరుకున్నాయన్న వార్తలతో, సురక్షిత పెట్టుబడి గా భావించే వెండి, బంగారం వంటి లోహాలపై డిమాండ్ తగ్గింది. ఇది ధరల పతనానికి ఆజ్యం పోసింది.

35
బంగారం, వెండి ధరలు : నిపుణుల విశ్లేషణలు, హెచ్చరికలు ఏమిటి?

రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది ఈ పరిణామాలపై స్పందిస్తూ, "ప్రస్తుతం వెండి ట్రెండ్ పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ, మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉంటాయి. వెండికి రూ. 2.40 లక్షల వద్ద సపోర్టు లభిస్తుంది" అని పేర్కొన్నారు. ఈ పతనాన్ని బ్రాడ్ ప్రాఫిట్ బుకింగ్‌గా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.

అమెరికన్ సంస్థ బీటీఐజీ (BTIG) అనలిస్ట్ జోనాథన్ క్రిన్స్కీ చారిత్రక గణాంకాలను ఉటంకిస్తూ హెచ్చరించారు. 1987 నాటి పరిస్థితులను గుర్తుచేస్తూ, వెండి ధరలు ఒక్కరోజులో 10% పెరిగి మల్టీ మంత్ హైని తాకినప్పుడు, ఆ తర్వాత 25% వరకు పతనం సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సీఐఓ మనీష్ బంతియా కూడా, భారీ ర్యాలీల తర్వాత మార్కెట్ ఇలా తగ్గడం సాధారణంగా నెమ్మదిగా కాకుండా, ఇలాంటి భారీ కుదుపులతోనే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 

సాంకేతిక చార్టుల ప్రకారం వెండి 200-DMA కంటే దాదాపు 89% ఎగువన ట్రేడ్ అవుతుండటం కూడా ఆందోళన కలిగించే అంశమని నిపుణులు అంటున్నారు. "అంటే వెండి ధర తన శక్తికి మించి, చాలా తక్కువ టైంలో, చాలా ఎక్కువగా పెరిగిపోయింది. గాలి ఊదిన బెలూన్ లాంటిది, ఎప్పుడైనా గాలి పోవచ్చు లేదా పగిలిపోవచ్చు" అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

45
గత ఏడాది కాలంగా అద్భుతమైన రాబడినిచ్చిన వెండి

ఒక్కరోజులో భారీ పతనం నమోదైనప్పటికీ, గత ఏడాది కాలంగా వెండి తన ఇన్వెస్టర్లకు కనీవినీ ఎరుగని లాభాలను అందించింది. డిసెంబర్ 2024లో కిలో వెండి ధర సుమారు రూ. 90,000 వద్ద ఉండేది. అక్కడి నుంచి ధర దాదాపు 150 శాతానికి పైగా పెరిగింది. సోమవారం నాటి గరిష్ఠ ధర రూ. 2,54,000ను పరిగణనలోకి తీసుకుంటే ఈ పెరుగుదల అసాధారణమైనదని చెప్పవచ్చు.

పారిశ్రామిక డిమాండ్ పెరగడం, గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్ల తయారీలో వెండి వినియోగం విపరీతంగా పెరగడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దీనికి తోడు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కూడా పెట్టుబడిదారులు వెండి వైపు మొగ్గు చూపేలా చేసింది.

55
వెండి భవిష్యత్ అంచనాలు, ట్రేడింగ్ వ్యూహాలు

ప్రస్తుత పతనం తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో వెండి అవుట్‌లుక్ బలంగానే ఉందని కేడియా అడ్వైజరీ వంటి సంస్థలు చెబుతున్నాయి. సరఫరాలో కొరత, తక్కువ ఇన్వెంటరీ స్థాయిలు, పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ భవిష్యత్తులో ధరలకు సపోర్టుగా నిలుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు కూడా ధరలను ప్రభావితం చేయనున్నాయి.

అయితే, స్వల్పకాలంలో మాత్రం మార్కెట్ అత్యంత అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని, భారీ లాభాలు వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సోమవారం జరిగిన సిల్వర్ క్రాష్ మార్కెట్ లో రిస్క్ మేనేజ్మెంట్ ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేసింది.

Read more Photos on
click me!

Recommended Stories