PM E Drive scheme: పీఎం ఈ-డ్రైవ్ స్కీం మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ-బస్సులు, ట్రక్కుల ప్రోత్సాహం 2028 వరకు కొనసాగుతుంది. అలాగే, రెండు, మూడు చక్రాల ఈ-వాహనాల కొనుగోలుపై కూడా సబ్సిడీలు అందనున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాని ఈ-డ్రైవ్ (PM E-Drive) స్కీంను మరో రెండు ఆర్థిక సంవత్సరాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ స్కీం 2027-28 చివరి వరకు కొనసాగుతుంది. అంతకుముందు, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2025 మార్చిలో ముగిసేలా ప్రణాళికలు చేసింది. అయితే, నిధుల వినియోగంలో భారీ అంతరం ఉన్నందున దీన్ని పొడిగించారు.
ఈ స్కీంకు రూ.10,900 కోట్లు మంజూరు చేయగా, దాదాపు సగం నిధులు మాత్రమే వినియోగమయ్యాయి. మిగిలిన నిధులు ఈ-బస్సులు (14,000), ఈ-ట్రక్కులు (5,600), ఈ-చార్జింగ్ స్టేషన్లు (72,000) ఏర్పాటుకు వినియోగించాల్సి ఉంది.
DID YOU KNOW ?
పీఎం ఈ-డ్రైవ్ పథకం
పీఎం ఈ-డ్రైవ్ పథకం ప్రధాన లక్ష్యం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) వాడకాన్ని పెంచడం, తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం.ఈ పథకం కింద ఎలక్ట్రిక్ టూ-వీలర్లు, త్రీ-వీలర్లు, ఈ-బస్సులు, ఈ-ట్రక్కుల కొనుగోలుపై సబ్సిడీ లభిస్తుంది. దీనివల్ల ప్రజలకు EVలు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయి. ఈ-టూ వీలర్లకు బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ఒక్కో వాహనానికి రూ. 10,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. ఇ-త్రీ వీలర్లకు రూ. 50,000 వరకు, ఈ-బస్సులకు రూ. 35 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది.
టూ, త్రీ వీలర్ ఈ-వాహనాలకు మంజూరు చేసే సబ్సిడీలు 2025-26 చివరితో ముగుస్తాయని కేంద్రం పేర్కొంది. ఈ వాహనాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కిలోవాట్ గంటకు రూ.5,000, తదుపరి ఏడాది రూ.2,500 ప్రోత్సాహం లభిస్తుంది. ఇది వాహనం ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో 15% వరకు మాత్రమే వర్తిస్తుంది.
36
ఈ-ట్రక్కులపై రూ.9.6 లక్షల వరకు సబ్సిడీ
ఈ సబ్సిడీ పొడిగింపుతో N2, N3 కేటగిరీలలో వచ్చే ఈ-ట్రక్కులకు రూ.9.6 లక్షల వరకూ సబ్సిడీ లభించనుంది.
N2 వర్గం: 3.5 టన్నుల కంటే ఎక్కువ, 12 టన్నుల లోపు వాహనాలు
N3 వర్గం: 12 టన్నులకు మించి, 55 టన్నుల లోపు వాహనాలు
ఈ ప్రోత్సాహకాలు వాహన ధరపై తగ్గింపులు తయారీదారులకు PM E-Drive పోర్టల్ ద్వారా రీయింబర్స్ చేస్తారు. తయారీదారులు కోనుగోలు దారులకు ధర తగ్గింపుతో విక్రయిస్తారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పై నిపుణులు ఏమంటున్నారు?
ప్రైమస్ పార్ట్నర్స్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ నిఖిల్ ధాకా మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడం కోసం ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ స్కీమ్ పొడిగింపు చేయడం... ఈ-బస్సులు, ట్రక్కుల వినియోగం పెంచడానికి కీలకమని అన్నారు. రాష్ట్ర రవాణా సంస్థలు, ప్రైవేట్ ఆపరేటర్లు ఈ అవకాశం ద్వారా తగిన విధంగా ప్రణాళికలు రూపొందించుకొని ప్రామాణిక నిర్మాణాల ఏర్పాటుకు ముందడుగు వేయవచ్చన్నారు.
టూ, త్రీ వీలర్ వాహనాలపై లోకలైజేషన్ నిబంధనలను అలాగే ఉంచడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం బలోపేతం అవుతుందన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ప్రతిష్టల మధ్య భారత్ స్వావలంబన దిశగా ముందుకు వెళ్లడంలో సహాయపడుతుందని తెలిపారు.
56
మునుపటి స్కీమ్స్‌తో పోల్చితే ఈ డ్రైవ్ ప్రత్యేకత ఏమిటి?
పీఎం ఈ-డ్రైవ్ స్కీం 2024 అక్టోబర్ లో ప్రారంభమైంది. ఇది ముందున్న FAME I, FAME II స్కీమ్స్‌ను విలీనం చేసి అమలులోకి తీసుకొచ్చారు. FAME స్కీమ్స్ 2014 నుంచి 2024 వరకూ అమలులో ఉన్నాయి. అయితే, PM E-Drive స్కీం వచ్చిన తర్వాత ఈ-బస్సులు, ఈ-ట్రక్కులకు ఎక్కువ నిధులు కేటాయించారు.
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏప్రిల్‌లో ప్రకటించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు రూ.422 కోట్లు రెండు, మూడు చక్రాల వాహనాల కోసం విడుదల చేశారు.
66
కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ఎలక్ట్రిక్ వాహనాలు కీలకం
కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి మాట్లాడుతూ.. దేశంలో డీజిల్ ట్రక్కులు మొత్తం వాహనాల సంఖ్యలో కేవలం 3% మాత్రమే ఉన్నా, ఇవి 42% ట్రాన్స్‌పోర్ట్ గ్రీన్‌హౌస్ ఎమిషన్స్‌కు కారణం అవుతున్నాయన్నారు. ఈ కారణంగా, ఈ ట్రక్కులకు ప్రోత్సాహం కల్పించడం పర్యావరణ పరిరక్షణకు అత్యంత అవసరంగా పేర్కొన్నారు.
ఈ స్కీంతో పాటు, ఈ వాహనాల కొనుగోలుపై జీఎస్టీని 5% వరకు తగ్గించింది. ఫాసిల్ ఫ్యూయెల్ వాహనాలపై ఇది 28%గా ఉంది. అలాగే రూ.25,938 కోట్ల విలువైన PLI-Auto స్కీం ద్వారా తయారీదారులకు కూడా ప్రోత్సాహాలు లభిస్తున్నాయి.