Recharge plan: మొబైల్ రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు మరోసారి భారం పడే అవకాశం కనిపిస్తోంది. రానున్న 4 నుంచి 5 నెలల్లో దేశంలోని టెలికాం కంపెనీలు తమ టారిఫ్ ప్లాన్ల ధరలను పెంచే అవకాశం ఉందని సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ రిపోర్ట్ అంచనా వేసింది.
టెలికాం రంగంలో ప్రస్తుతం రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ప్రధాన సంస్థలుగా ఉన్నాయి. మార్కెట్‌లో పోటీ తగ్గడంతో ధరలను పెంచేందుకు కంపెనీలకు పరిస్థితులు అనుకూలంగా మారాయని సెంట్రమ్ రిపోర్ట్ పేర్కొంది. అందుకే వచ్చే 4-5 నెలల్లో టారిఫ్‌లు మరోసారి 12-15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇలా జరిగితే మొబైల్ కాల్స్, డేటా, ఇతర సేవల కోసం వినియోగదారులు ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు.
24
జియో, ఎయిర్‌టెల్, వీఐ కస్టమర్ల పరిస్థితి
టెలికాం కంపెనీల ఆదాయంలో ARPU అంటే ఒక్కో వినియోగదారుడి నుంచి సగటున వచ్చే ఆదాయం కీలకం. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ARPU 0.8 నుంచి 2 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని రిపోర్ట్ అంచనా వేసింది. 2G నుంచి 4G, 5Gకి వినియోగదారులు మారడం, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు పెరగడం దీనికి ప్రధాన కారణాలుగా చెప్పింది.
జియో సుమారు 80 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుని మొత్తం 54.1 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. కంపెనీ ARPU రూ.218కి పెరగవచ్చు. ఎయిర్‌టెల్ దాదాపు 30 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుని 38 కోట్లకు చేరుకోవచ్చని, దాని ARPU రూ.269కి పెరగవచ్చని అంచనా ఉంది. వోడాఫోన్ ఐడియా దాదాపు 10 లక్షల మంది కస్టమర్లను పెంచుకుని 19.4 కోట్లకు చేరుకోవచ్చని, ARPU రూ.178కు చేరవచ్చని రిపోర్ట్ పేర్కొంది.
34
5G విస్తరణతో డేటా వినియోగం పెరుగుతోంది
దేశంలో 4G, 5G సేవల వినియోగం పెరుగుతుండటంతో ఒక్కో కస్టమర్ ఉపయోగించే డేటా కూడా ఎక్కువగానే ఉంటుందని రిపోర్ట్ తెలిపింది. జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే 95 శాతానికి పైగా జిల్లాల్లో 5G సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇక మరిన్ని 5G పరికరాలను తమ నెట్‌వర్క్‌కు అనుసంధానించడంపై ఈ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి.
వోడాఫోన్ ఐడియా కూడా 5G సేవలను దాదాపు 200 నగరాలకు విస్తరించింది. భవిష్యత్తులో కవరేజీని మరింత పెంచే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు జియో, ఎయిర్‌టెల్ అందిస్తున్న 5G ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA), ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు కూడా మంచి స్పందన వస్తున్నట్లు రిపోర్ట్ పేర్కొంది.
వోడాఫోన్ ఐడియా తన నెట్‌వర్క్ విస్తరణ, మౌలిక వసతుల కోసం భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ఇందుకోసం బ్యాంకులతో కలిసి రూ.25,000 కోట్ల రుణ నిధులు సమీకరించే ప్రక్రియలో ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది. FY27 నుంచి FY29 మధ్య దాదాపు రూ.45,000 కోట్ల మూలధన వ్యయం చేయాల్సిన అవసరం కంపెనీకి ఉంది.
ఇక టెలికాం రంగంతో పాటు ఇండస్ టవర్స్, టాటా కమ్యూనికేషన్స్‌పై కూడా రిపోర్ట్ దృష్టి పెట్టింది. ఇండస్ టవర్స్ ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన సుమారు 1.7 శాతం పెరగవచ్చని అంచనా. టాటా కమ్యూనికేషన్స్ ఆదాయం కూడా దాదాపు 1.6 శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తంగా చూస్తే, టెలికాం కంపెనీల ఆదాయం, 5G వినియోగం పెరుగుతున్నప్పటికీ.. రాబోయే నెలల్లో రీచార్జ్ ధరల పెంపు సామాన్య వినియోగదారులపై అదనపు భారం మోపే అవకాశం ఉంది.