మీరు ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఇది కేవలం బ్యాంకు పెనాల్టీతో ఆగిపోదు, మిమ్మల్ని తీవ్రమైన చట్టపరమైన చిక్కుల్లోకి నెడుతుంది. ఈ పరిస్థితిలో ఎలాంటి శిక్షలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.
Cheque Bounce : భారతదేశంలో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్‌లోని సెక్షన్ 138 ప్రకారం చెక్ బౌన్స్ అయి మీరు డబ్బు చెల్లించలేకపోతే రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా చెక్ అమౌంట్‌కు రెట్టింపు జరిమానా ఉండవచ్చు… ఒక్కోసారి రెండూ విధించవచ్చు. అయితే చెక్ బౌన్స్ అయిన ప్రతిసారీ జైలు శిక్ష పడుతుందని కంగారు పడక్కర్లేదు… చట్టం మీకు తప్పు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది.
25
చెక్ బౌన్స్ అయినా ఇలా చేశారో నో ప్రాబ్లమ్...
మీ చెక్ బౌన్స్ అయినప్పుడు ఎందుకు తిరస్కరించారో వివరిస్తూ బ్యాంకు ఒక 'రిటర్న్ మెమో'ను డిపాజిట్ చేసిన వ్యక్తికి పంపుతుంది. ఎక్కువగా అకౌంట్‌లో డబ్బు లేకపోవడం (Insufficient Funds) దీనికి ప్రధాన కారణం అవుతుంది. ఆ తర్వాత డబ్బు స్వీకరించాల్సిన వ్యక్తి మీకు లీగల్ నోటీసు పంపడానికి 30 రోజుల సమయం ఉంటుంది. నోటీసు అందిన 15 రోజుల్లోగా మీరు చెక్ మొత్తాన్ని చెల్లిస్తే, సాధారణంగా సమస్య అక్కడితో ముగుస్తుంది. క్రిమినల్ కేసు నమోదు కాదు.
35
అసలు సమస్య ఇదే..
మీరు లీగల్ నోటీసును పట్టించుకోకుండా అవతలి వ్యక్తి కోర్టుకు వెళ్లడని భావిస్తే 15 రోజుల తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. ఒకవేళ క్రిమినల్ కేసు ఫైల్ అయ్యిందో మీరు కోర్టుకు హాజరుకావాలి, లాయర్ ఫీజులు చెల్లించాలి, నెలలు లేదా ఏళ్ల తరబడి చట్టపరమైన ఒత్తిడిని ఎదుర్కోవాలి. కోర్టు ఆదేశాలను పాటించకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది.
చాలామంది పోస్ట్-డేటెడ్ చెక్కులు ఇవ్వడం సురక్షితం అనుకుంటారు. కానీ మీరు అద్దె, లోన్ లేదా వ్యాపార ఒప్పందం కోసం పోస్ట్-డేటెడ్ చెక్ ఇచ్చినా, అది బౌన్స్ అయితే అవే చట్టాలు వర్తిస్తాయి. చట్టపరమైన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైతే, చర్యలు తప్పవు.
55
సకాలంలో స్పందిస్తే సేఫ్...
మీ అకౌంట్‌లో కచ్చితంగా డబ్బు ఉన్నప్పుడే చెక్ రాయడం అత్యంత సురక్షితమైన మార్గం. పొరపాటున చెక్ బౌన్స్ అయినా, వెంటనే సమస్యను పరిష్కరించండి. దాన్ని నిర్లక్ష్యం చేయడమే మీరు చేసే అతిపెద్ద తప్పు. సకాలంలో స్పందిస్తే జైలు, భారీ జరిమానా, సుదీర్ఘ న్యాయపోరాటం నుంచి సులభంగా బయటపడొచ్చు.