Jio: భూమి నుంచి అంతరిక్షం వరకు.. 1,600 శాటిలైట్లతో జియో మ‌రో సంచ‌ల‌నం

Published : Oct 08, 2026, 07:21 PM IST

Jio: ప్ర‌ముఖ టెలికం సంస్థ రిల‌య‌న్స్ జియో మ‌రో అద్భుతానికి తెర తీస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు లేని విధంగా అంత‌రిక్ష ఆధార‌తి క‌నెక్టివిటీపై దృష్టి సారించింది. ఇందుకోసం ఏకంగా 1600 శాటిలైట్ల‌తో విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యం తీసుకుంది.

PREV
15
శాటిలైట్ నెట్‌వర్క్‌పై జియో భారీ అడుగు

దేశంలో మొబైల్ నెట్‌వర్క్‌లు, ఫైబర్‌ సేవలను విస్తరించిన రిలయన్స్‌ జియో ఇప్పుడు అంతరిక్ష ఆధారిత కనెక్టివిటీపై దృష్టి పెట్టింది. దాదాపు 1,600 లో ఎర్త్ ఆర్బిట్‌ (LEO) శాటిలైట్లతో కూడిన భారీ కాన్‌స్టెలేషన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదిత ప్రణాళికను జియో ప్రదర్శించింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ (IMC) 2026లో కంపెనీ తన శాటిలైట్‌ కనెక్టివిటీ విజన్‌ను వెల్లడించింది. భౌగోళికంగా మొబైల్ టవర్లు, ఫైబర్ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేయడం కష్టమైన ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్, కమ్యూనికేషన్‌ సేవలను అందించడమే దీని ప్రధాన లక్ష్యం.

25
23 గ్రౌండ్ స్టేషన్లతో టెరెస్ట్రియల్ నెట్‌వర్క్ అనుసంధానం

జియో ప్రతిపాదించిన ప్రణాళికలో 23 గ్రౌండ్ స్టేషన్లు కీలకంగా ఉండనున్నాయి. శాటిలైట్ల నుంచి వచ్చే సిగ్నళ్లను భూమిపై ఉన్న నెట్‌వర్క్‌తో అనుసంధానించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న జియో టెరెస్ట్రియల్ నెట్‌వర్క్‌తో శాటిలైట్ వ్యవస్థను కలపాలని కంపెనీ భావిస్తోంది. డిజైన్, ఇంజినీరింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ నుంచి శాటిలైట్‌ల ప్రయోగం, నిర్వహణ వరకు మొత్తం వ్యవస్థపై భారత్‌లోనే నియంత్రణ ఉండేలా అభివృద్ధి చేయాలన్నది జియో ఉద్దేశం.

35
6 లక్షలకు పైగా గ్రామాలకు కనెక్టివిటీ లక్ష్యం

ఈ శాటిలైట్‌ నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా మరింత విస్తృతమైన కవరేజీ అందించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా మారుమూల గ్రామాలు, ద్వీప ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల్లోని ఔట్‌పోస్టులకు కనెక్టివిటీ అందించడంపై దృష్టి పెట్టింది. జియో ప్రదర్శించిన విజన్‌లో 6 లక్షలకు పైగా గ్రామాలను అనుసంధానించే లక్ష్యం ఉంది. సముద్ర ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్‌ సేవలను విస్తరించే అవకాశం ఉంది. దీంతో భౌగోళికంగా వెనుకబడిన ప్రాంతాల్లోనూ వేగవంతమైన డిజిటల్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

45
ఏవియేషన్ నుంచి రక్షణ వరకు ఎన్నో రంగాలకు ఉపయోగం

శాటిలైట్‌ కనెక్టివిటీని కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేయకుండా వివిధ రంగాల్లో ఉపయోగించుకునే అవకాశాలను జియో ప్రదర్శించింది. ఎంటర్‌ప్రైజ్‌ కనెక్టివిటీ, రిమోట్ సైట్లు, విమానయానం, సముద్ర రవాణా, ప్రభుత్వ సంస్థలు, రక్షణ రంగం, విపత్తు నిర్వహణ వంటి విభాగాలకు ఇది ఉపయోగపడొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో డైరెక్ట్-టు-డివైస్‌ (D2D) కాలింగ్‌ సదుపాయం అందించే అవకాశాన్ని కూడా జియో ప్రస్తావించింది. అంటే సంప్రదాయ మొబైల్ టవర్లపై ఆధారపడకుండా శాటిలైట్‌ ఆధారంగా నేరుగా పరికరాలకు కనెక్టివిటీ అందించే దిశగా ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది.

55
‘స్కేల్ వితౌట్ బౌండరీస్’.. అంతరిక్షం వైపు కొత్త దిశ

ఈ ఏడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ ప్రధాన థీమ్‌ ‘స్కేల్ వితౌట్ బౌండరీస్’. టెలికాం, డిజిటల్ టెక్నాలజీని సంప్రదాయ పరిమితులను దాటి మరింత విస్తరించాలన్న ఆలోచనను ఇది ప్రతిబింబిస్తోంది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ఐఎంసీ 10వ ఎడిషన్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జియో శాటిలైట్‌ కనెక్టివిటీ ప్రణాళిక ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం 1,600 శాటిలైట్లు, 23 గ్రౌండ్ స్టేషన్లు ప్రతిపాదిత ప్రణాళికలోనే ఉన్నాయి. అయితే టవర్లు, ఫైబర్‌ నెట్‌వర్క్‌లను దాటి భూమిపై ఉన్న వ్యవస్థలను అంతరిక్ష ఆధారిత నెట్‌వర్క్‌లతో అనుసంధానించే దిశగా జియో అడుగులు వేస్తున్నట్లు ఈ ప్రదర్శన స్పష్టం చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories