Stock market: ఒక్క రోజులో రూ. 10 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరి.. స్టాక్ మార్కెట్‌లో ఎందుకీ అల‌జ‌డి

Published : Oct 08, 2026, 07:03 PM IST

Stock market: దేశీయ స్టాక్ మార్కెట్‌లో గురువారం అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా కనిపించింది. సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరువైంది. ఒక్క రోజులోనే ఏకంగా రూ. 10 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరైంది.

PREV
15
భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

గురువారం ఉదయం సెన్సెక్స్‌ 72,668 పాయింట్ల వద్ద స్వల్ప లాభంతో ప్రారంభమైనప్పటికీ ఆ స్థాయి ఎక్కువసేపు నిలవలేదు. కొద్దిసేపటికే అమ్మకాలు పెరగడంతో సూచీ వరుసగా దిగజారింది. ఇంట్రాడేలో 71,327.75 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 1,045.46 పాయింట్లు కోల్పోయి 71,593.24 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ కూడా తీవ్ర ఒత్తిడికి గురైంది. 371.25 పాయింట్లు నష్టపోయి 22,231.80 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 96.78 వద్ద కొనసాగింది. మార్కెట్‌ పతనంతో బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం విలువలో భారీగా క్షీణత నమోదైంది.

25
చాలా షేర్లలో అమ్మకాల వెల్లువ

సెన్సెక్స్‌ 30లో మెజారిటీ స్టాక్స్‌ నష్టాలను చవిచూశాయి. ఐటీసీ, అదానీ పోర్ట్స్‌, ఇండిగో, పవర్‌ గ్రిడ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎన్‌టీపీసీ, బీఈఎల్‌ వంటి ప్రముఖ కంపెనీల షేర్లలో గణనీయమైన క్షీణత కనిపించింది. దీనికి భిన్నంగా ఐటీ రంగానికి చెందిన కొన్ని షేర్లు మార్కెట్‌ పతనాన్ని కొంతవరకు ఎదుర్కొన్నాయి. టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ మినహా దాదాపు అన్ని ప్రధాన రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.

35
చమురు ధరల పెరుగుదలతో పెరిగిన ఆందోళనలు

గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో హర్మూజ్‌ జలసంధి ద్వారా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడే అవకాశాలపై ఆందోళనలు పెరిగాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 104.42 డాలర్ల స్థాయిలో కొనసాగింది. భారత్‌ తన చమురు అవసరాల్లో గణనీయమైన భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటున్న నేపథ్యంలో క్రూడ్‌ ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందన్న భయాలు మదుపర్లలో నెలకొన్నాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు దేశీయ సూచీలపై అదనపు ఒత్తిడిని పెంచాయి.

45
విదేశీ నిధుల ఉపసంహరణ కూడా కీలక కారణం

దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ మదుపర్లు నిధులను వెనక్కి తీసుకోవడం అమ్మకాల తీవ్రతను పెంచింది. బుధవారం ఒక్కరోజే విదేశీ పెట్టుబడిదారులు రూ.6,100 కోట్లకు పైగా విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. మరోవైపు అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల రాబడులు కూడా పెరిగాయి. దీంతో అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ల నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లే అవకాశాలు పెరిగాయి. ఈ పరిణామాలన్నీ కలిపి భారత మార్కెట్‌లో రిస్క్‌ తగ్గించుకునే ధోరణిని బలపరిచాయి.

55
ఆర్‌బీఐ నిర్ణయాలపై మదుపర్లలో పెరిగిన భయాలు

ఆర్‌బీఐ వడ్డీ రేట్లపై అనుసరిస్తున్న వైఖరి కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌కు ప్రతికూలంగా మారింది. అంతర్జాతీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్‌లో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న సంకేతాలు మదుపర్లలో ఆందోళన పెంచాయి. ప్రస్తుతం రేట్ల కోతకు అవకాశం తగ్గిపోవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. అధిక వడ్డీ రేట్లు రుణ వ్యయాలను పెంచడంతో పాటు కంపెనీల వృద్ధి, వినియోగంపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఈ అంశాన్ని మార్కెట్‌ ప్రతికూలంగా స్వీకరించింది. దీనికి తోడు జపాన్‌, షాంఘై, హాంకాంగ్‌ మార్కెట్లు ఒక శాతానికి పైగా నష్టపోవడం, దక్షిణ కొరియా కాస్పీ దాదాపు 2 శాతం వరకు పడిపోవడం దేశీయ మార్కెట్‌పై మరింత ఒత్తిడిని పెంచింది.

Read more Photos on
click me!

Recommended Stories