ఇండియ‌న్ రైల్వే సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాత్రి 11 త‌ర్వాత మొబైల్ ఛార్జింగ్ బంద్

Published : Oct 28, 2026, 04:11 PM IST

Indian Railway: రైళ్లలో ప్రయాణించే వారికి రైల్వే శాఖ కీలక సూచన చేసింది. రాత్రి వేళల్లో రైళ్లలోని మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరిగా నిలిపివేయాలని అన్ని రైల్వే జోన్లను ఆదేశించింది. ఇండియ‌న్ రైల్వే ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకుందంటే.?

PREV
15
పవర్ బ్యాంక్ పేలుడుతో రైల్వే శాఖ అప్రమత్తం

ముంబైలోని దాదర్ నుంచి బద్లాపూర్ వైపు వెళ్తున్న లోకల్ రైలులో ఇటీవల పవర్ బ్యాంక్ పేలిన ఘటన చోటుచేసుకుంది. ఛార్జింగ్‌లో ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో రైలు బోగీలో దట్టమైన పొగ వ్యాపించింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటన నేపథ్యంలో రైళ్లలో మొబైల్ ఛార్జింగ్ పాయింట్ల వినియోగంపై రైల్వే శాఖ మరోసారి దృష్టి పెట్టింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.

25
రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఛార్జింగ్ బంద్

రైళ్లలోని మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిలిపివేయాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఈ ఆరు గంటల సమయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని తెలిపింది. ఈ మేరకు అక్టోబర్ 26న అన్ని రైల్వే జోన్లకు బోర్డు లేఖ పంపింది. నిర్ణీత సమయంలో ఛార్జింగ్ పాయింట్లను ఆఫ్ చేయడంలో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లు లేఖలో పేర్కొంది. ఇకపై ఈ విషయంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని ఆదేశించింది.

35
ఆకస్మిక తనిఖీలు.. సిబ్బందికి హెచ్చరికలు

రైళ్లలోని అన్ని బోగీల్లో ఛార్జింగ్ పాయింట్లు నిర్ణీత సమయానికి నిలిచిపోయేలా సిబ్బందికి సూచనలు ఇవ్వాలని రైల్వే బోర్డు ఆదేశించింది. అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు నిబంధనల అమలుపై వారికి అవగాహన కల్పించాలని తెలిపింది. అంతేకాకుండా అధికారులు, పర్యవేక్షకులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించింది. రాత్రి 11 గంటలకు ఛార్జింగ్ పాయింట్లు ఆఫ్ అవుతున్నాయా? ఉదయం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచే ఉంటుందా? అనే విషయాలను పరిశీలించనున్నారు. భద్రతా నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

45
2014 నుంచే అమల్లో ఛార్జింగ్ నిబంధన

రైళ్లలో రాత్రి వేళల్లో ఛార్జింగ్ పాయింట్లను నిలిపివేసే నిబంధన కొత్తదేమీ కాదు. 2014 జూన్ 19 నుంచే ఈ నిబంధన అమల్లో ఉంది. బెంగళూరు నుంచి హజూర్ సాహిబ్ నాందేడ్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగిన తర్వాత, రైల్వే భద్రతా కమిషనర్ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత 2021 మార్చిలోనూ రైల్వే శాఖ ఈ నిబంధనను మరోసారి అమలు చేయాలని సూచించింది. వెస్ట్రన్ రైల్వే అదే ఏడాది మార్చి 16 నుంచి రాత్రి వేళల్లో ఛార్జింగ్ పాయింట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం ప్రారంభించింది. తాజాగా పవర్ బ్యాంక్ పేలుడు ఘటనతో రైల్వే బోర్డు మరోసారి ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

55
రాత్రి ప్రయాణానికి ముందే ఫోన్ ఛార్జ్ చేసుకోండి

రాత్రిపూట రైళ్లలో ప్రయాణించేవారు ఈ నిబంధనను దృష్టిలో పెట్టుకోవాలని రైల్వే శాఖ సూచిస్తోంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రైళ్లలోని ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉండవు. అందువల్ల ప్రయాణానికి బయలుదేరే ముందే మొబైల్ ఫోన్లు, అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను పూర్తిగా ఛార్జ్ చేసుకోవడం మంచిది. ప్రయాణ సమయంలో ఫోన్ బ్యాటరీ అయిపోకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పవర్ బ్యాంక్ ఉపయోగించేవారు కూడా దాని నాణ్యత, భద్రతపై శ్రద్ధ వహించాలి. రైల్వే శాఖ తీసుకున్న ఈ చర్యల ప్రధాన ఉద్దేశం రైళ్లలో అగ్నిప్రమాదాల ముప్పును తగ్గించి, ప్రయాణికుల భద్రతను కాపాడటమే.

Read more Photos on
click me!

Recommended Stories