
రైల్వే ట్రాక్‌ను ఒక రకమైన విద్యుత్ సర్క్యూట్‌లా ఉపయోగించే విధానమే ట్రాక్ సర్క్యూట్. ట్రాక్‌లోని నిర్దిష్ట సెక్షన్‌లో రైలు ఉన్నప్పుడు, రైలు చక్రాలు రెండు పట్టాలను విద్యుత్ పరంగా కలపడం ద్వారా ఆ సెక్షన్ ఆక్యుపైడ్‌గా గుర్తిస్తారు. ఇదే వ్యవస్థలో ట్రాక్‌కు సంబంధించిన విద్యుత్ కంటిన్యుటీలో మార్పులు వచ్చినా సిగ్నలింగ్ వ్యవస్థకు సమాచారం అందుతుంది. కొన్ని పరిస్థితుల్లో పట్టా విరగడం వల్ల ట్రాక్ సర్క్యూట్ కంటిన్యుటీ దెబ్బతిని ఆ సెక్షన్ ఆక్యుపైడ్‌గా కనిపించే అవకాశం ఉంటుంది. దీంతో ఆ సెక్షన్‌లో రైలు నడిపే విషయంలో సిగ్నలింగ్ వ్యవస్థ సురక్షిత చర్యలకు దారి తీస్తుంది. అయితే ట్రాక్ సర్క్యూట్‌ను కచ్చితంగా పట్టాలు విరిగింది అని గుర్తించే వ్యవస్థగా భావించకూడదు. ట్రాక్‌లోని అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన డిటెక్షన్ ఉండదు. అందుకే రైల్వే ఇతర సాంకేతిక పద్ధతులు, తనిఖీలు, పెట్రోలింగ్‌ను కూడా కలిపి ఉపయోగిస్తుంది.
మరో ముఖ్యమైన వ్యవస్థ యాక్సిల్ కౌంటర్. రైలు ఒక సెక్షన్‌లోకి ప్రవేశించినప్పుడు దాని చక్రాల యాక్సిళ్లను లెక్కిస్తుంది. రైలు ఆ సెక్షన్ నుంచి బయటకు వెళ్లినప్పుడు మళ్లీ యాక్సిళ్లను లెక్కించి రెండు వైపుల సంఖ్యను పోల్చుతుంది. ఉదాహరణకు ఒక రైలు ఒక సెక్షన్‌లోకి 100 యాక్సిళ్లతో ప్రవేశించి, బయటకు కూడా 100 యాక్సిళ్లను చూపిస్తే ఆ సెక్షన్ క్లియర్‌గా పరిగణిస్తారు. సంఖ్యల్లో తేడా వస్తే లేదా సెక్షన్ క్లియర్ కాలేదని సిస్టమ్ చూపిస్తే సిగ్నలింగ్ వ్యవస్థ అప్రమత్తమవుతుంది. ఇలాంటి వ్యవస్థలను డేటా లాగర్ల ద్వారా పర్యవేక్షించే అవకాశం కూడా భారతీయ రైల్వే సాంకేతిక డాక్యుమెంట్స్‌లో పేర్కొంది. అయితే యాక్సిల్ కౌంటర్ ప్రధాన ఉద్దేశం ట్రాక్ సెక్షన్‌లో రైలు ఉందా లేదా ఖాళీగా ఉందా అన్నది గుర్తించడం.
ట్రాక్‌ను బయట నుంచి చూసినప్పుడు బాగానే కనిపించినా పట్టా లోపల చిన్న పగుళ్లు, లోపాలు ఉండే అవకాశం ఉంది. ఇవి ప్రమాదకరంగా మారకుండా గుర్తించేందుకు భారతీయ రైల్వే అల్ట్రాసోనిక్ ఫ్లా డిటెక్షన్ (USFD) టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఈ విధానంలో అల్ట్రాసోనిక్ తరంగాలను ఉపయోగించి రైలు లోపలి భాగాన్ని పరీక్షిస్తారు. లోపల పగుళ్లు లేదా ఇతర లోపాలు ఉంటే అల్ట్రాసోనిక్ సిగ్నల్‌లో మార్పులు కనిపిస్తాయి. వాటిని విశ్లేషించి రైలులో లోపం ఉన్న ప్రాంతాన్ని గుర్తిస్తారు. రైళ్ల భద్రత కోసం పట్టాల్లో లోపాలను గుర్తించడానికి USFD టెక్నిక్ భారతీయ రైల్వేలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. తీవ్రంగా ఉన్న లోపాలను గుర్తించినప్పుడు వాటిపై తక్షణ చర్యలు తీసుకునే విధానం కూడా ఉంది. అంటే ఎవరైనా పట్టాను పూర్తిగా కట్ చేసే ముందు ఏర్పడిన అంతర్గత లోపాలు, పగుళ్లు వంటి వాటిని గుర్తించడంలో ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది.
రైల్వే ట్రాక్ సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రత్యేకమైన ట్రాక్ రికార్డింగ్ కార్స్ (TRC), ఆస్కిలోగ్రాఫ్ కార్స్ , ఆస్కిలేషన్ మానిటరింగ్ సిస్టమ్ (OMS) వంటి పరికరాలను కూడా ఉపయోగిస్తారు. ట్రాక్ రికార్డింగ్ కార్లు ట్రాక్‌పై ప్రయాణిస్తూ గేజ్, అలైన్‌మెంట్, కర్వేచర్, ట్విస్ట్, అసమానతలు వంటి అంశాలను కొలుస్తాయి. దీని ద్వారా సాధారణ కంటికి వెంటనే కనిపించని ట్రాక్ జ్యామెట్రీ మార్పులను గుర్తించవచ్చు.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అడవులు, కొండలు, వంతెనలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి రైల్వే ట్రాక్‌ను కేవలం టెక్నాలజీతోనే పర్యవేక్షించడం సాధ్యం కాదు. అందుకే ట్రాక్ మెయింటెనర్లు, కీమన్, పెట్రోల్‌మెన్, వాచ్‌మెన్ వంటి సిబ్బంది చేసే భౌతిక తనిఖీలు కూడా రైల్వే భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రత్యేకంగా వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ట్రాక్‌పై పెట్రోలింగ్‌కు ప్రాధాన్యం ఉంటుంది. రైల్వే ట్రాక్ మెయింటెనర్ శిక్షణ పత్రాల్లో హాట్ వెదర్ పెట్రోలింగ్, కోల్డ్ వెదర్ పెట్రోలింగ్, రైల్ ఫ్రాక్చర్, ట్రాక్ బక్లింగ్ వంటి పరిస్థితుల్లో ట్రాక్ భద్రతను కాపాడటం పెట్రోల్‌మెన్ బాధ్యతలు. అదే సమయంలో వరదలు, భారీ వర్షాలు, కొండచరియలు, మట్టి కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి ప్రత్యేక తనిఖీలు, పెట్రోలింగ్, స్పీడ్ లిమిట్స్, రైళ్ల రాకపోకలపై నియంత్రణ వంటి భద్రతా చర్యలు తీసుకోవచ్చు.