Stock Market: రూ.7 లక్షల కోట్లు ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను దెబ్బకొట్టిన 5 కారణాలు ఇవే

Published : Dec 08, 2025, 06:34 PM IST

Stock Market: భారత స్టాక్ మార్కెట్ లో ఒక్కరోజులో రూ.7 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. ఎఫ్ఐఐ అమ్మకాలు, రూపాయి బలహీనత, యూఎస్ ఫెడ్ భయం సూచీలను భారీగా ప్రభావితం చేశాయి. స్టాక్ మార్కెట్ కూలడానికి పూర్తి కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
సెన్సెక్స్, నిఫ్టీ పతనం: మార్కెట్‌ ప్రారంభం నుంచే ఒత్తిడి

భారత స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఒక్కరోజులో రూ.7 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఆరంభం నుంచే దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్రమైన ఒత్తిడిలోకి జారుకున్నాయి. ఉదయం ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 85,624 పాయింట్ల వద్ద నష్టాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజంతా అమ్మకాల ఒత్తిడి తగ్గకపోవడంతో ఇండెక్స్ 84,875 పాయింట్ల ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 609 పాయింట్లు క్షీణించి 85,102 వద్ద నిలిచింది.

నిఫ్టీ కూడా 226 పాయింట్లు కోల్పోయి 25,960 వద్ద ముగిసింది. దీంతో బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.7 లక్షల కోట్లకు పైగా తగ్గిపోయింది, ఇది మదుపర్లకు భారీ దెబ్బగా మారింది.

25
ఎఫ్ఐఐ అమ్మకాలు: మార్కెట్‌ పై దెబ్బకు ప్రధాన కారణం

విదేశీ సంస్థాగత మదుపర్ల (FII) అమ్మకాలు మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడిని సృష్టించాయి. డిసెంబర్ 5న ఒక్కరోజే రూ.439 కోట్ల నిధులు వెనక్కి వెళ్లాయి. డిసెంబర్ నెలలో ఇప్పటివరకు మొత్తం రూ.6,584 కోట్ల స్టాక్స్ అమ్ముడయ్యాయి. రూపాయి విలువ నిరంతరం బలహీనపడుతున్నందున ఎఫ్ఐఐలు భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అవుట్‌ఫ్లో వల్ల బెంచ్‌మార్క్ సూచీలు మరింత ఒత్తిడిలో పడ్డాయి.

35
రూపాయి పతనం.. డాలర్ ప్రభావం

రూపాయి పతనం కూడా భారత స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 90.09 వద్దకు పడిపోయింది. పతనానికి కారణాలలో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, విదేశీ నిధుల వెలివేత, భారత్, అమెరికా వాణిజ్య చర్చల్లో పురోగతి లేకపోవడం వంటి అంశాలు ఉన్నాయి. దీర్ఘకాలం పాటు ఇదే బలహీనత కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం మరింత లోతుగా ఉంటుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ అయిన వీకే విజయకుమార్ ప్రకారం, రూపాయి విలువ నిరంతరంగా పడిపోవడం FIIలను భారతీయ ఈక్విటీలను విక్రయించడానికి బలవంతం చేస్తోంది, ఇది బెంచ్‌మార్క్ సూచీలపై ఒత్తిడిని కొనసాగిస్తోంది.

45
యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు కీలకం కానున్నాయి !

డిసెంబర్ 10న అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం ప్రకటించబోతోంది. అనలిస్టులు వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశాలను అంచనా వేస్తుండగా, ఏవైనా భిన్న నిర్ణయాలు మార్కెట్‌లో తీవ్ర కలకలం రేపొచ్చు. అందుకే ఇన్వెస్టర్లు లాభదాయకమైన పొజిషన్లను క్లోజ్ చేస్తూ జాగ్రత్తగా అమ్మకాలకు దిగారు.

55
స్మాల్, మిడ్ క్యాప్స్ కుప్పకూలాయి !

సెన్సెక్స్, నిఫ్టీతో పాటు చిన్న, మధ్య తరహా సూచీల్లో కూడా భారీ పతనం నమోదైంది. స్మాల్‌క్యాప్ సూచీ 2.6% పతనం కాగా, మిడ్‌క్యాప్ సూచీ 1.8% పతనమైంది.

ఇండిగో, బీఈఎల్, ట్రెంట్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ వంటి ప్రధాన షేర్లు గణనీయంగా క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా యెన్ క్యారీ ట్రేడ్ తిరోగమనంపై ఉన్న భయాలు కూడా పెట్టుబడిదారుల్లో ఆందోళనలు పెంచాయి.

రోజంతా అమ్మకాల ఒత్తిడి, ఎఫ్ఐఐ అవుట్‌ఫ్లో, రూపాయి పతనం, యూఎస్ ఫెడ్ నిర్ణయంపై అనిశ్చితి.. ఇలా అన్ని అంశాలు కలిసి భారత స్టాక్ మార్కెట్లను ఒక్కరోజులోనే భారీగా కుదిపేశాయి. వచ్చే కొన్ని రోజులు మార్కెట్లలో అస్థిరత కొనసాగనుందని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories