ఏ ధైర్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 125% పన్నును ప్రకటించారో తెలియదు కాని ఈ అంశం ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. ఈ పన్ను వెనుక ఉన్న లక్ష్యం చైనా నుండి ఉత్పత్తిని తొలగించడమే అయినప్పటికీ చాలా మంది నిపుణులు ఇది రోజువారీ ఎలక్ట్రానిక్ పరికరాల ధరలను ప్రభావితం చేస్తుందని నమ్ముతున్నారు. అంటే దీని వల్ల కొన్ని దేశాల్లో వస్తువుల ధరలు తగ్గుతాయి. అమెరికా వంటి కొన్ని దేశాల్లో ఎలక్ట్రానిక్స్ ధరలు పెరుగుతాయని సమాచారం.
ఇండియాలో ధరలు తక్కువ.. అమెరికాలో ఎక్కువ
అమెరికా పన్నుల విధింపు కారణంగా భారతదేశంతో సహా ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో కొన్ని దిగుమతి చేసుకున్న పరికరాలు చౌకగా లభించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే అమెరికాలో ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఆటోమొబైల్స్ వంటి రంగాల్లో ధరల పెరుగుదల ఎక్కువగా ఉంటుందని అంచనా. ఉదాహరణకు, దిగుమతి పన్నులు పెరగడం వల్ల అమెరికాలో ఆపిల్ ఐఫోన్‌ల ధర 30 % కంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది.
ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి?
అమెరికాలో చాలా దశాబ్దాలుగా తక్కువ ధర దిగుమతులకు ముగింపు పలకడానికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే చైనా వస్తువులపై భారీ పన్నుల ప్రభావం అమెరికాపైనే ఎక్కువ పడేలా ఉంది. ఈ చర్య వల్ల ఆటోమొబైల్స్ ధర 15% వరకు పెరిగే అవకాశం ఉంది. దుస్తులు వంటి ప్రాథమిక వస్తువులు కూడా 33% పెరుగుతాయి. దీంతో ప్రజలు, కంపెనీలు, దుకాణదారులు, చిల్లర వ్యాపారులు కూడా ఇప్పుడు డిమాండ్ వస్తువుల ధరల్లో మార్పులకు సిద్ధమవుతున్నారు.
మొబైల్ ఫోన్ల ఉత్పత్తిపై ప్రభావం
అమెరికా, చైనా మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత వల్ల భారతదేశానికి కొంచెం ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రపంచ తయారీదారులు కార్యకలాపాలను పన్ను రహిత దేశాలకు మార్చినట్లయితే చాలా పేపర్ వర్క్స్ తగ్గిపోతాయి.
ఉదాహరణకు ఆపిల్ ఇప్పటికే భారతదేశానికి ఎక్కువ ఐఫోన్ ఉత్పత్తిని తరలిస్తోంది. ఈ సుంకాలను విధించడం వల్ల కలిగే నిజమైన ప్రభావం రాబోయే నెలల్లో స్పష్టంగా తెలుస్తుంది.