
ఒకప్పుడు దూరప్రాంతాలకు డబ్బులు పంపాలంటే చాలా కష్టంగా ఉండేది. కొంత కాలం తర్వాత బ్యాంకింగ్ రంగం వచ్చి, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వరకు మారింది. కానీ 2016లో వచ్చిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) భారత డిజిటల్ రంగాన్ని పూర్తిగా మార్చేసింది. జేబులో వందల నోట్లు పెట్టుకునే రోజులు పోయి, చిన్న టీ కొట్టు నుండి పెద్ద మాల్స్ వరకు కేవలం మొబైల్ పట్టుకుని తిరిగే స్థాయికి దేశం మారింది. బ్యాంక్ ఖాతా నంబర్ గుర్తుపెట్టుకునే పని లేకుండా కేవలం QR కోడ్ స్కాన్ చేయగానే సెకన్లలో డబ్బులు అవతలి వారి ఖాతాలో పడిపోతున్నాయి. మనం వినే ఆ శబ్దం, డబ్బులు వచ్చాయి అని చెప్పే నోటిఫికేషన్ వెనుక ఒక పెద్ద టెక్నాలజీ నెట్‌వర్క్ రాత్రింబవళ్లు పనిచేస్తోంది.
అసలు ఫోన్‌లో డబ్బులు దాచి ఉంటాయా? అంటే లేదనే చెప్పాలి. మన డబ్బులు ఎప్పుడూ బ్యాంక్ ఖాతాలోనే ఉంటాయి. యూపీఐ యాప్‌లు కేవలం గేట్‌వేలా పనిచేస్తాయి.
• QR Code: ఇది ఒక డిజిటల్ పాస్‌వర్డ్ లేదా డేటా ప్యాకేజీ. ఇందులో రిసీవర్ (డబ్బులు తీసుకునే వ్యక్తి) పేరు, ఫోన్ నంబర్, యూపీఐ ఐడీ, బ్యాంక్ వివరాలు నిక్షిప్తమై ఉంటాయి.
• UPI ID (VPA): ఇది వర్చువల్ పేమెంట్ అడ్రస్. ఉదాహరణకు "yourname@bankname" రూపంలో ఉంటుంది. మీ బ్యాంక్ ఖాతా నంబర్‌ను బహిరంగంగా చెప్పకుండా భద్రంగా ఉంచడమే దీని ముఖ్య ఉద్దేశం.
పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ వంటి యాప్‌లు మీ మొబైల్ నంబర్ సహాయంతో బ్యాంక్ ఖాతాను లింక్ చేస్తాయి. యూజర్ పిన్ ఎంటర్ చేయగానే, ఆ సమాచారం ఇన్‌క్రిప్ట్ అయి బ్యాంక్‌కు చేరుతుంది.
కోట్లాది మందిఒకే సమయంలో ట్రాన్సాక్షన్స్ చేసినా సిస్టమ్ ఎలా క్రాష్ కాకుండా పనిచేస్తుంది? దీని వెనుక 9 ముఖ్యమైన దశలు ఉంటాయి:
1. మీరు దుకాణంలో QR కోడ్ స్కాన్ చేయగానే మీ యాప్ కెమెరా దాన్ని టెక్స్ట్ డేటాగా మారుస్తుంది.
2. రిసీవర్ పేరు, అమౌంట్ కన్ఫర్మ్ చేసుకుని మీ UPI PIN నమోదు చేస్తారు.
3. మీ PIN ఎన్‌క్రిప్టెడ్ రూపంలో మీ బ్యాంక్ సర్వర్‌కు వెళ్తుంది.
4. మీ యాప్ ద్వారా ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ తయారై NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కి వెళ్తుంది.
5. NPCI ఈ నెట్‌వర్క్‌లో ట్రాఫిక్ కంట్రోలర్‌లా పనిచేసి మీ బ్యాంక్ నుండి రిసీవర్ బ్యాంక్‌కు రూటింగ్ చేస్తుంది.
6. మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఉన్నాయా, లిమిట్ దాటిందా, PIN సరిగ్గా ఉందా అని చెక్ చేసి డెబిట్ అప్రూవల్ ఇస్తుంది.
7. అంతా సరిగ్గా ఉంటే రిసీవర్ బ్యాంక్‌కు క్రెడిట్ ఇన్‌స్ట్రక్షన్ వెళ్తుంది.
8. డిజిటల్ లెడ్జర్ ఎంట్రీ జరిగి మీ ఖాతాలో డెబిట్, అవతలి ఖాతాలో క్రెడిట్ నమోదు అవుతుంది.
9. మీ స్క్రీన్ పై 'Payment Successful' అని వస్తుంది. చివరికి బ్యాంకుల మధ్య అసలు డబ్బు సర్దుబాటు షెడ్యూల్ చేసిన సమయాల్లో జరుగుతుంది.
సాధారణ వినియోగదారులకు యూపీఐ ఉచితం. మర్చంట్ డిస్కౌంట్ రేట్ సున్నా. కానీ సర్వర్లు, నెట్‌వర్క్, సెక్యూరిటీ నడపడానికి ఉచితంగా కాదు. ఆర్బీఐ 2022 డిస్కషన్ పేపర్ ప్రకారం, ప్రతి ₹100 యూపీఐ పేమెంట్‌పై దాదాపు 0.25 పైసలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు అవుతుంది.
ఈ 25 పైసల ఖర్చు వివరాలు:
• 10 పైసలు - పేమెంట్ చేసే వినియోగదారుడి బ్యాంక్ ఖర్చు
• 06 పైసలు - PSP (పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్) లేయర్
• 07 పైసలు - మర్చంట్ వైపు ఉండే బ్యాంక్ యాప్ లేయర్
• 02 పైసలు - NPCI మౌలిక సదుపాయాల వ్యయం
మరి యూపీఐ యాప్‌లకు ఆదాయం ఎలా వస్తుంది? వీరు ప్రకటనలు (Ads), వాయిస్ నోటిఫికేషన్ బాక్స్‌ల అద్దెలు, స్క్రాచ్ కార్డులు, యాప్ ద్వారా లోన్లు, ఇన్సూరెన్స్ వంటి ఆర్థిక సేవలను అమ్మడం ద్వారా కోట్ల రూపాయల రాబడి పొందుతున్నారు.
యూపీఐ వాడే ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన నిబంధనలు తెలుసుకోవాలి. P2P (వ్యక్తి నుండి వ్యక్తికి) రోజువారీ ట్రాన్సాక్షన్ పరిమితి సాధారణంగా ₹1 లక్ష వరకు ఉంటుంది. అయితే క్యాపిటల్ మార్కెట్, ఇన్సూరెన్స్, ఆసుపత్రి బిల్లులు, విద్యా సంస్థల ఫీజులకు ఈ పరిమితి ₹5 లక్షల వరకు ఉంటుంది. మైక్రో పేమెంట్స్ కోసం తెచ్చిన యూపీఐ లైట్ పరిమితి ₹1,000.
• పొరపాటున వేరే ఖాతాకు డబ్బులు వెళ్తే: కంగారు పడకుండా 12 అంకెల UTR / ట్రాన్సాక్షన్ ID నోట్ చేసుకోండి. ముందుగా యాప్‌లో 'Raise a Dispute' లేదా 'Report an Issue' ద్వారా ఫిర్యాదు చేయండి. తర్వాత బ్యాంక్ కస్టమర్ కేర్‌ను సంప్రదించండి. NPCI పోర్టల్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-120-1740 కి కాల్ చేయవచ్చు. 30 రోజుల్లో పరిష్కారం కాకపోతే ఆర్బీఐ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
• డబ్బులు కట్ అయి పేమెంట్ ఫెయిల్ అయితే: 24 నుండి 48 గంటల్లో మీ ఖాతాలో డబ్బులు ఆటోమేటిక్‌గా క్రెడిట్ అవుతాయి.
• సైబర్ ఫ్రాడ్ జరిగితే: వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి సైబర్ క్రైమ్ ఫిర్యాదు నమోదు చేయాలి.
ఇప్పుడు భారత యూపీఐ విదేశాల్లోనూ దూసుకుపోతోంది. ఫ్రాన్స్, సింగపూర్, యుఏఈ, నేపాల్, భూటాన్, మారిషస్, శ్రీలంకతో సహా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం 'UPI One World' యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. విదేశాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసినప్పుడు, ఆ దేశ కరెన్సీ విలువకు తగినట్లుగా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ ద్వారా మీ భారతీయ బ్యాంక్ ఖాతా నుండే డబ్బులు కట్ అవుతాయి.
ఈ సమయంలో బ్యాంకులు 1.5% నుండి 3.5% వరకు మార్కప్ ఛార్జీలు, అలాగే ప్రతి ట్రాన్సాక్షన్‌కు ₹15 నుండి ₹50 వరకు ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి. విదేశాల నుండి భారతదేశానికి నిధులు పంపడం కూడా యూపీఐ ద్వారా సులువైంది. ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత్‌కు విదేశాల నుండి దాదాపు ₹14 లక్షల కోట్ల రికార్డు రెమిటెన్స్ లభించింది. ఇందులో యూపీఐ కీలక పాత్ర పోషించింది.