ఇదిలా ఉంటే.. దేశీయంగా బంగారం ధరలను ప్రభావితం చేసే మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. బంగారం, వెండిపై ప్రస్తుతం 15 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని తగ్గించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బులియన్ వ్యాపారులు, ఆభరణాల తయారీదారులు ఈ సుంకాన్ని తిరిగి 6 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. అధిక సుంకాల కారణంగా అధికారిక దిగుమతులు ఖరీదవుతున్నాయని, దీంతో అక్రమ మార్గాల్లో బంగారం దేశంలోకి వచ్చే అవకాశం పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సుంకాన్ని తగ్గిస్తే అక్రమ రవాణాకు ప్రోత్సాహం తగ్గుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే దేశీయంగా బంగారం ధరలకు మరింత ఊరట లభించే అవకాశం ఉంది. అయితే ధరలు ఎంత మేరకు తగ్గుతాయనేది అంతర్జాతీయ బంగారం ధర, రూపాయి-డాలర్ మారకం విలువ, అమెరికా ఫెడ్ నిర్ణయాలు వంటి ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,62,980 వద్ద ఉన్న నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలతో పాటు కేంద్రం తీసుకునే నిర్ణయంపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.