Gold Price Hike: మార్కెట్ నిపుణులు చెప్పిందే జరిగింది. బంగారం ధరలు రూ.1.50లక్షలు దాటేసింది. మూడురోజులుగా పెరుగుతూ కంగారు పెట్టిన పసిడి...ఇవాళ మాత్రం పెద్ద షాక్ ఇచ్చింది. వచ్చేది శ్రావణ మాసం కాబట్టి...గోల్డ్ కొనాలంటే ఇక బిత్తర చూపులు చూడాల్సిందే.
వచ్చేది శ్రావణమాసం. దేశ వ్యాప్తంగా మహిళలు వరలక్ష్మీ వ్రతాలు, నోములు, ప్రత్యేక పూజలు చేస్తారు. కాసు బంగారమైనా కొనాలనేది సంప్రదాయం.దానికి తోడు అంతర్జాతీయ పరిస్థితులు, ఇవన్నీ కలిసి బంగారం మార్కెట్లపై ప్రభావం చూపించింది. ఇప్పటికే నార్త్ లో శ్రావణమాసం మొదలైపోయింది. ఎంత ధరలు పెరిగినా కూడా బంగారం కొనకమానరు. ఇప్పుడు సౌత్ లో ఈనెల 13 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో పసిడి ధరలు చాలా పెద్ద షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల బంగారం రూ.1.50లక్షలు దాటేసింది.
25
రూ.1,52,350కు చేరిన పసిడి
ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో తాజా ధరలు గమనిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,090 పెరిగి రూ.1,52,350కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1000 పెరిగి రూ.1,39,650 వద్ద ట్రేడవుతోంది. వెండి ధరలు కూడా పెరుగుదలనే నమోదు చేశాయి. కిలో వెండి రూ.2.50లక్షలకు చేరిపోయింది.
35
మార్కెట్లలో అనిశ్చితి
అంతర్జాతీయ పరిణామాలు ప్రస్తుతం బంగారం మార్కెట్‌కు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధికి సంబంధించిన పరిణామాలు మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతున్నాయి. హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గం. అక్కడ నౌకా రాకపోకలపై ఆంక్షలు లేదా అంతరాయం ఏర్పడుతుందనే భయాలు పెరిగితే చమురు ధరలతో పాటు ప్రపంచ మార్కెట్లలో కూడా ఒత్తిడి పెరగవచ్చు. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సాధారణంగా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తారు. అందుకే అంతర్జాతీయంగా పసిడి ధరలకు సపోర్ట్ లభిస్తోంది.
హర్మూజ్ జలసంధిలో నౌకా రవాణాను సాధారణ స్థితికి తీసుకురావడంపై ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు కీలక దశకు చేరుకున్నట్లు సమాచారం. అయితే అమెరికా ఆంక్షలు, ఇరాన్ వైఖరి వంటి అంశాలు ఈ ప్రక్రియలో ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. ఒకవేళ ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గి, హర్మూజ్ మార్గంలో రవాణా పూర్తిగా సాధారణ స్థితికి వస్తే ప్రపంచ మార్కెట్లలో కొంత ఊరట కనిపించవచ్చు. అదే సమయంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగితే బంగారానికి సేఫ్-హేవన్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
55
కొనాలా.. ఆగాలా?
హర్మూజ్ మీదుగా నౌకా రాకపోకలు గతంతో పోలిస్తే పెరిగినప్పటికీ, ఆ మార్గం పూర్తిగా స్థిరపడిందనే నమ్మకం మార్కెట్లకు ఇంకా రాలేదు. ఇదే అనిశ్చితి పసిడి ధరలకు సపోర్ట్ గా మారుతోంది.
ప్రస్తుతం బంగారం ధరలు రికార్డు స్థాయిల్లో ఉండటంతో ఒక్కసారిగా భారీ మొత్తంలో కొనుగోలు చేయడం కంటే అవసరాన్ని బట్టి కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ పరిశీలకులు సూచిస్తున్నారు. మరోవైపు శ్రావణ మాసం డిమాండ్, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, డాలర్ కదలికలు, చమురు ధరలు వంటి అంశాలు రాబోయే రోజుల్లో పసిడి ధరల దిశను నిర్ణయించవచ్చు.