EPFO: పీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోవ‌డం ఇప్పుడు మ‌రింత ఈజీ.. వాట్సాప్ ద్వారా

Published : Nov 01, 2026, 08:58 PM IST

EPFO: పీఎఫ్‌ ఖాతాలో ఎంత మొత్తం ఉంది? ఉద్యోగి వాటా ఎంత? యజమాని జమ చేసిన మొత్తం ఎంత? ఈ వివరాల కోసం ఇకపై పదేపదే వెబ్‌సైట్ చూడాల్సిన ప‌నిలేదు. వాట్సాప్ ద్వారా ఈ వివరాలను తెలుసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు.

PREV
15
ఈపీఎఫ్‌వో నుంచి కొత్త సేవలు.. సభ్యులకు మరింత సౌలభ్యం

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సభ్యులకు అందించే సేవలను మరింత సులభతరం చేసే దిశగా కొత్త సదుపాయాలను ప్రవేశపెట్టింది. ఈపీఎఫ్‌వో 74వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వీటిని ప్రారంభించారు. ఇందులో భాగంగా వాట్సప్‌ ద్వారా పీఎఫ్‌ ఖాతాకు సంబంధించిన పలు వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. సాధారణంగా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవడానికి సభ్యులు సంబంధిత ఆన్‌లైన్‌ సేవలను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే కొత్త సదుపాయంతో వాట్సప్‌ నుంచే అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుంది. పీఎఫ్‌ బ్యాలెన్స్‌తో పాటు ఖాతాలో జరిగిన లావాదేవీలు, పాస్‌బుక్‌కు సంబంధించిన సేవలను కూడా సులభంగా పొందే వీలుంది.

25
వాట్సప్‌లో ఏయే పీఎఫ్‌ వివరాలు తెలుసుకోవచ్చు?

ఈపీఎఫ్‌వో అందుబాటులోకి తెచ్చిన వాట్సప్‌ సేవల ద్వారా సభ్యులు తమ పీఎఫ్‌ ఖాతాకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇందులో తాజా పీఎఫ్‌ బ్యాలెన్స్‌, చివరిగా జరిగిన ఐదు లావాదేవీల వివరాలు, పీఎఫ్‌ పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం ఉన్నాయి. అంతేకాకుండా అవసరాన్ని బట్టి భాషను మార్చుకునే అవకాశం కూడా కల్పించారు. ప్రధాన మెనూలో కనిపించే ఎంపికల ద్వారా కావాల్సిన సేవను ఎంచుకోవచ్చు. ప్రధానమంత్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన (PMVBRY) పథకానికి సంబంధించి సందేహాలు, సూచనల కోసం కూడా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ సేవలను వినియోగించుకోవాలంటే పీఎఫ్‌ ఖాతాకు ఇప్పటికే నమోదు చేసిన మొబైల్‌ నంబర్‌ నుంచే సందేశం పంపాలి. ఖాతాదారుడి వివరాలను ధ్రువీకరించేందుకు అవసరమైన సందర్భాల్లో ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది.

35
వాట్సప్‌లో పీఎఫ్‌ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోవాలి.?

మీ పీఎఫ్‌ ఖాతాలో ఎంత మొత్తం ఉందో తెలుసుకోవాలంటే ఈ కింది విధానాన్ని ఫాలో అవ్వండి.

* మీ పీఎఫ్‌ ఖాతాకు లింక్‌ చేసిన మొబైల్‌ నంబర్‌ నుంచి +91 87964 41800 నంబర్‌కు వాట్సప్‌లో 'Hi' అని సందేశం పంపండి.

* మీకు భాషను ఎంచుకోవాలని సూచించే సందేశం వస్తుంది. అందులో మీకు అనుకూలమైన భాషను ఎంపిక చేసుకోండి.

* ఆ తర్వాత సేవలకు సంబంధించిన మెనూ కనిపిస్తుంది. ఇందులో తాజా పీఎఫ్‌ బ్యాలెన్స్‌, చివరి ఐదు లావాదేవీలు, పాస్‌బుక్‌ డౌన్‌లోడ్‌, భాష మార్పు వంటి ఎంపికలు ఉంటాయి.

* పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవడానికి సంబంధిత ఎంపికను ఎంచుకోండి. అనంతరం మీ నమోదిత మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని సూచించిన విధంగా నమోదు చేయాలి.

* ధ్రువీకరణ పూర్తయిన తర్వాత మీ పీఎఫ్‌ ఖాతాలోని బ్యాలెన్స్‌ వివరాలు అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగి వాటా, యజమాని వాటా, పెన్షన్‌ ఫండ్‌లోని మొత్తం, చివరి లావాదేవీ వివరాలను పరిశీలించవచ్చు.

ఈ విధంగా వాట్సప్‌ ద్వారానే మీ పీఎఫ్‌ ఖాతాలోని తాజా వివరాలను తెలుసుకోవచ్చు. అయితే సందేశం పంపే ముందు అధికారిక సేవా నంబర్‌ను సరిచూసుకోవడం మంచిది.

45
పీఎఫ్‌ పాస్‌బుక్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలా?

పీఎఫ్‌ ఖాతాలోని లావాదేవీలను వివరంగా పరిశీలించాలనుకునే వారికి పాస్‌బుక్‌ సదుపాయం ఉపయోగపడుతుంది. వాట్సప్‌ మెనూలో కనిపించే పాస్‌బుక్‌ డౌన్‌లోడ్‌ ఎంపికను ఎంచుకోవడం ద్వారా ఈ సేవను పొందవచ్చు. పాస్‌బుక్‌ ద్వారా ఖాతాలో జమ అయిన మొత్తాలు, ఉద్యోగి వాటా, యజమాని వాటా వంటి వివరాలను పరిశీలించవచ్చు. ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఉపయోగించుకునేందుకు పాస్‌బుక్‌ పీడీఎఫ్‌ రూపంలో అందుబాటులో ఉంటే దాన్ని భద్రపరుచుకోవచ్చు.

ఈ పీడీఎఫ్‌ను తెరవడానికి సూచించిన విధంగా పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా తేదీ, నెల, సంవత్సరం క్రమంలో వివరాలను ఎంటర్‌ చేయాలి. ఫైల్‌ను తెరిచే సమయంలో సూచించే తేదీ ఫార్మాట్‌ను తప్పనిసరిగా అనుసరించాలి. పాస్‌బుక్‌ను పరిశీలించడం ద్వారా పీఎఫ్‌ ఖాతాలోని జమలు, ఉపసంహరణలు, ఇతర లావాదేవీలను అర్థం చేసుకోవచ్చు. ఏదైనా జమ ఆలస్యమైందని అనుమానం ఉన్నా, ఖాతాలోని వివరాలను సరిపోల్చుకోవాలన్నా ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

55
రూ.1,000 వరకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలకు ఆటోమేటిక్ సెటిల్‌మెంట్

వాట్సప్‌ సేవలతో పాటు, అర్హత కలిగిన ఇన్‌ఆపరేటివ్‌ పీఎఫ్‌ ఖాతాదారుల కోసం ఈపీఎఫ్‌వో ఆటోమేటిక్‌ సెటిల్‌మెంట్‌ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఆధార్‌తో ధ్రువీకరించిన, రూ.1,000 వరకు బ్యాలెన్స్‌ ఉన్న అర్హమైన ఇన్‌ఆపరేటివ్‌ ఈపీఎఫ్‌ ఖాతాల్లోని మొత్తాలను సంబంధిత నిబంధనల ప్రకారం ఆటోమేటిక్‌గా సెటిల్‌ చేయనున్నారు. ఈ విధానంలో అర్హులైన సభ్యులు విడిగా క్లెయిమ్‌ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈపీఎఫ్‌వో ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలను ధ్రువీకరించి, అర్హత నిర్ధారణ తర్వాత నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపడుతుంది. ఈ సదుపాయం ద్వారా దాదాపు లక్ష ఖాతాల్లో సుమారు రూ.5 కోట్ల వరకు నిధులు జమ కావచ్చని అంచనా. చాలా కాలంగా ఉపయోగంలో లేని పీఎఫ్‌ ఖాతాల్లో చిన్న మొత్తాలు మిగిలిపోయిన వారికి ఈ విధానం ప్రయోజనకరంగా ఉండనుంది.

Read more Photos on
click me!

Recommended Stories