2024-2025 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా భారతదేశంలోని చాలా ప్రముఖ కార్ల కంపెనీలు ధరలు పెంచాయి. ఇవి ఏప్రిల్ 1, 2025 నుండి అమలులోకి వస్తాయి. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, ద్రవ్యోల్బణం ఈ చర్యకు ప్రధాన కారణాలని తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని కంపెనీలు గత కొన్ని నెలల్లోనే రెండు, మూడు సార్లు కార్ల ధరలు పెంచాయి.
మారుతి సుజుకి
మారుతి సుజుకి దాని కార్ల మోడల్స్ పై 4 శాతం వరకు ధరలు పెంచేసింది. ఆల్టో కె10, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, బ్రెజ్జా, గ్రాండ్ విటారా వంటి మోడళ్లు ఈ లిస్టులో ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి వీటి ధరలు మారతాయి. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల మధ్య ప్రొడక్షన్ ఖర్చులను బ్యాలెన్స్ చేయడానికే ఇలా చేసినట్లు మారుతి సుజుకి ప్రకటించింది.
టాటా మోటార్స్
టాటా మోటార్స్ కూడా వివిధ మోడల్స్ ధరలు పెంచేసింది. ఈ పెరుగుదల సుమారు 3 శాతం వరకు ఉంటుంది. నెక్సాన్, టియాగో, కర్వ్ వంటి అనేక మోడళ్లు ఈ లిస్టులో ఉన్నాయి. ఈ కార్ల ఎలక్ట్రిక్ వెర్షన్‌ల ధరలు కూడా పెరిగిపోయాయి. టాటా మోటార్స్ EV కార్లకు మార్కెట్ లో డిమాండ్ పెరుగుతోంది. అందుకే ప్రొడక్షన్ ఖర్చులను బ్యాలెన్స్ చేసుకుంటూ లాభాలను కాపాడుకోవడానికి ధరలను పెంచడం, తగ్గడం చేస్తుంటామని టాటా మోటార్స్ ప్రకటించింది.
మహీంద్రా
స్ట్రాంగ్ SUV మోడల్స్ ని అందించే మహీంద్రా కూడా 3 శాతం వరకు ధరలను పెంచింది. స్కార్పియో ఎన్, థార్ రాక్స్, ఎక్స్‌యువి 700 వంటి మోడల్స్ ఈ లిస్టులో ఉన్నాయి. మార్కెట్ డిమాండ్ నేపథ్యంలో ఎక్కువ కార్లు తయారు చేయాల్సి రావడంతో ప్రొడక్షన్, సప్లై ఖర్చులను బ్యాలెన్స్ చేయడం కోసం ధరలు పెంచాల్సి వచ్చిందని మహీంద్రా పేర్కొంది.
కియా, హ్యుందాయ్
కియా, హ్యుందాయ్ రెండూ కూడా ఒక్కొక్కటి 3 శాతం వరకు ధరల పెరుగుదలను ప్రకటించాయి. కియా సోనెట్, సెల్టోస్, కేరెన్స్ ధరలు పెరిగిన లిస్టులో ఉన్నాయి. హ్యుందాయ్ కు చెందిన క్రెటా, ఎక్స్‌టర్, గ్రాండ్ ఐ10 నియోస్ వంటి మోడల్స్ ధరలు పెరిగిన జాబితాలో ఉన్నాయి. ఆర్థిక ఒడిదుడుకుల మధ్య లాభాలను నిలుపుకోవడానికి ఈ రెండు కంపెనీలు ధరలు పెంచుతూ, తగ్గిస్తూ లాభాల కోసం ప్రయత్నిస్తున్నాయి.
హోండా, రెనాల్ట్
హోండా, రెనాల్ట్ వంటి ఇతర కార్ల కంపెనీలు కూడా ధరల పెరుగుదలను ప్రకటించాయి. రెనాల్ట్ దాని మోడల్స్ పై 2 శాతం పెరుగుదలను ధృవీకరించింది. హోండా ఇంకా కచ్చితమైన శాతం పెరుగుదలను ప్రకటించలేదు.
కొత్తగా కార్లు కొనాలనుకొనే వారు వాటి మోడల్స్ ను బట్టి ధరలు తెలుసుకొని కొనుక్కోవడం మంచిది.
ఇది కూడా చదవండి హోండా అమేజ్ vs టాటా టిగోర్: ఈ రెండు కార్లలో ఏది బెస్ట్?